ఆకలి కేకలు ఒకచోట.. అన్నపు రాసులు మరోచోట… అన్నాడో కవి. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులకు సరిగ్గా సరిపోయే వాక్యాలివి. భారీగా పెట్టుబడులను పట్టుకొస్తామంటూ ముఖ్యమంత్రి రేవంతుడు దావోస్‌లో పర్యటిస్తున్నారు. అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క… ఒరిస్సాలో పర్యటించి వచ్చారు. గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రుల జాతీయ సమావేశంలో పాల్గొన్న ఆయన… తెలంగాణలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు రూ.1.63 లక్షల కోట్లు ఇప్పించాలంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. గనుల రంగంలో సంస్కరణలు తెస్తామంటూ అదే వేదిక మీద నుంచి కిషన్‌రెడ్డి నొక్కి వక్కాణించారు. సరిగ్గా అదే రోజు రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా మైలారంలోని ప్రజలు… తమ ప్రాంతంలోని గుట్ట (తెల్లరాయి నిక్షేపాలు)ను కబళించి, మైనింగ్ జరపటానికి వీల్లేదంటూ ఆందోళనకు దిగటం గమనార్హం. వారిలో ఓ ఇద్దరు ఏకంగా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు కూడా.
ఈ దృష్టాంతాలన్నింటినీ పరిశీలిస్తే… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు తేటతెల్లమవు తున్నాయి. గతంలో నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు పెల్లుబికాయి. ఆ సందర్భంగా సీపీఐ(ఎం), ఇతర వామపక్షాలు అక్కడి గిరిజనులకు అండగా నిలిచాయి. ఇప్పుడు కేంద్ర మంత్రి చెబుతున్న ‘గనుల సంస్కరణలు’ ఏ రకంగా ఉంటాయో ఆయనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా పలు గిరిజన ప్రాంతాల్లో మైనింగ్, ఇతరత్రా తవ్వకాలపై ఆందోళనలు కొనసాగాయి. కానీ సహజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు యధేచ్ఛగా కట్టబెడుతున్న బీజేపీ… ఆయా సంస్థల ప్రయోజనాల కోసం ఆదివాసీల జీవితాలను ఫణంగా పెడుతున్నది. పర్యావరణానికి, నదీ జలాలకు పెనుముప్పు వాటిల్లుతుందంటూ సామాజికవేత్తలు నెత్తీనోరు బాదుకుంటున్నా వినకుండా కేంద్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. దీనిపై పెదవి విప్పని రాష్ట్ర ప్రభుత్వం…మైనింగ్‌కు సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు వెళ్లిన పౌరహక్కుల నేతలను అడ్డుకోవటం శోచనీయం. అంటే కేంద్ర పాపంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పాలుపంచుకోవాలను కుంటోందా? ఈ విషయమై రేవంత్ సర్కార్ స్పష్టతనివ్వాలి.
మరోవైపు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు, వ్యవసాయ కార్మికులకు ఆర్థిక సాయం (ఆత్మీయ భరోసా), ఆసరా పింఛన్ల పెంపునకు సంబంధించి మంగళవారం నుంచి ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ప్రతీ గ్రామంలోనూ లబ్దిదారులు బారులు తీరుతున్నారు. ఇది రాష్ట్రంలో గూడు లేని పేదలు, ఆసరా దొరకని వృద్ధులు, పూట గడవని వ్యవసాయ కూలీల గోసకు నిదర్శనం. ప్రతీ ఊర్లోనూ 20 నుంచి 30 మంది లబ్దిదారులనే ఎంపిక చేసి, మిగతా వారికి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటూ అధికారులు సూచించటం విడ్డూరం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజులకే ‘ప్రజాపాలన’ అంటూ హడావుడి చేసిన సర్కారు… ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు, రైతు భరోసా తదితరాల కోసం దరఖాస్తులను స్వీకరించింది. ఇది జరిగి ఏడాది గడిచిన నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలని చెప్పటం పేదల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఇవన్నీ కాలయాపన చేసే చర్యలేనంటూ ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు విమర్శిస్తున్న నేపథ్యంలో అర్హులైన పేదలందరికీ పథకాలను చేరువ చేయటం ద్వారా సర్కారు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియంటూ ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ప్రకటించినప్పటికీ ఆచరణలో అది ఎంతవరకు అమలవుతుందనేది ప్రశ్నార్థకం. దీనిపై ప్రజల్లో ఉన్న అనుమానాలు, అపోహలను ప్రభుత్వం పోగొట్టాలి. అందుకోసం పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసర ముంది. గ్రామాలు, పట్టణాల్లో లబ్దిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తు తున్న దరిమిలా పార్టీలకు అతీతంగా అందరికీ సమన్యాయం చేస్తామన్న భరోసాను కల్పించాలంటూ పేదలు వేడుకుం టున్నారు. దావోస్‌కు వెళ్లి పెట్టుబడులు తేవటం మంచిదే. కానీ చంద్రబాబు కాలం నుంచి ప్రతీ ముఖ్యమంత్రి దావోస్‌కు పయనమవుతున్నారు. ఇన్ని కోట్లు, అన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులొస్తున్నాయంటూ ప్రకటిస్తున్నారు. నిజానికి అవన్నీ ఎక్కడికి పోయినాయో ఏలినవారికే తెలియాలి. అంతకంటే ముందు రాష్ట్రంలోని పేదలకు కూడు, గూడు, బట్ట తదితర ప్రాథమిక అవసరాలను తీర్చటం ముఖ్యం. ఈ దిశగా రేవంత్ సర్కార్ దృష్టి సారించాలి.