– కార్పొరేషన్లకు మంత్రి తుమ్మల ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మారుతున్న పరిస్థితులకనుగుణంగా పోటీని తట్టుకునేలా సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖలపై తుమ్మల సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ 14 కార్పొరేషన్లకు చెందిన ఉన్నతాధికారులతో ఆయన సమావేశయ్యారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేషన్లు రైతులకు సేవలందించేందుకు అవసరమైన పద్దతులను అవలంభించాలని సూచించారు. ఇతర దేశాల నుంచి అత్యాధునిక పద్దతులను అందిపుచ్చుకుని రైతులకు లబ్ధిచేకూర్చేలా పని చేయాలని కోరారు. కార్పొరేషన్లు కేవలం వ్యాపార దృక్పథంతోనే పని చేయవద్దని సూచించారు. పాత పద్దతులకు స్వస్తిపలికి సరికొత్త విధానాలతో రైతులోకానికి ఉపయుక్తంగా ఉండేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలను అందిపుచ్చుకుని వాటిని సక్రమమైన పద్దతుల్లో అమలు పరిచేలా కార్పొరేషన్లు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రయివేటు కంపెనీలకు లబ్ధిచేకూర్చే యంత్రాలు, ఎరువులను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించొద్దని సూచించారు.
రైతు బంధు రూ. 640 కోట్ల జమ
రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో సోమ వారం నుంచి జమ అవుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. 22 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.640 కోట్లు జమ అయ్యాయి. ఈసారి పాత పద్ధతిలోనే రైతుబంధు చేస్తున్నట్టు పేర్కొన్నారు. రైతు బంధు పథకంపై ఒకటిరెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ అవుతాయనీ, ఆ తర్వాత కొత్త వారికి రైతు బంధు వర్తిస్తుందన్నారు.