వ్యవసాయ భూములే వెంచర్లు..!

Agricultural lands are ventures..!– గజాల్లో విక్రయం, గుంటల్లో రిజిస్ట్రేషన్‌
– తక్కువ ధర పేరుతో కొనుగోలు దారులకు వల
– నోటీసులతో సరిపెడుతున్న అధికారులు
జిల్లాలో వ్యవసాయ భూముల్లో ప్లాట్ల దందా జోరుగా నడుస్తుంది. రహదారికి అనుకొని ఉన్న వ్యవసాయ భూములపై రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కన్నేస్తున్నారు. వ్యవసాయ భూములను గమనించిన వ్యాపారులు వాటిపై గద్దల్ల వాలి పోతున్నారు. రైతులను మచ్చిక చేసుకొని వారి అవసరాలను ఆసరాగా చేసుకొని పంట భూములను ప్లాట్లుగా మార్చేస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్న పంచాయితీ, రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల కను సన్నల్లోనే ఇలాంటి అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్ట రీతిలో ప్లాట్ల విక్రయాలు చేస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది.
నవతెలంగాణ-మంచిర్యాల
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రియల్‌ వ్యాపారులు ప్లాట్ల దందా చేస్తున్నా అధికారులు ఎవరు ఆ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. గత ప్రభుత్వంలో అవలంబించిన తీరే ఇప్పుడు కూడా అధికారులు అవలంబిస్తున్నారని స్థానికంగా చర్చ కొనసాగుతుంది. అయినప్పటికీ ఉన్నత అధికారులు అక్రమంగా వెలుస్తున్న వెంచర్లపై విచారణ చేసేందుకు నిర్లక్ష్యం వహిస్తున్నరనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది. ఒక వైపు సాధారణ ప్రజలు వారి భుసమస్యలు పరిష్కారం కాక అరిగోస పడుతుంటే రాజకీయ పలుకుబడి ఉన్న నాయకులు ఎలాంటి భు దందాలు చేసిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం గమనార్హం. వ్యవసాయ భూమిలో ఏ నిబంధనల ప్రకారం లేఅవుట్లు చేస్తారు, రోడ్లు, ప్రహరీ ఎలా నిర్మిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గజల్లో ధరలు నిర్ణయించి గుంటల లెక్కన క్రయ విక్రయాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నిబంధనలు ఇవే
గ్రామాల్లో వెంచర్లను ఏర్పాటు చేయాలంటే నూతన పంచాయితీ రాజ్‌ చట్టం ప్రకారం గ్రామ పంచాయితీ పేరుపై 10 శాతం స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయాలి. కనీస సౌకర్యాలు అయిన డ్రైనేజీ, విద్యుత్‌, మంచినీటి సౌకర్యం, రోడ్లు, పార్కు వంటి వసతులు కల్పించి గ్రామ పంచాయితీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ దందా ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు గ్రామ పంచాయితీల అనుమతి కోసం దరఖాస్తు చేసుకోకుండానే డీజీసీపీ లేఅవుట్ల పేరుతో ప్లాట్ల క్రయ విక్రయాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ప్లాట్ల క్రయ విక్రయాలు జరపడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఇప్పటికే జిల్లాలోని, గుడిపేట్‌, ముల్కల్ల, వేంపల్లి, జైపూర్‌, భీమరం, హాజీపూర్‌ మండలాల్లోలో ఇలాంటి అనుమతులు లేని అక్రమ వెంచర్‌లు ఎన్నో వెలిశాయి.
ఆదేశాలు బేఖాతరు..
మంచిర్యాల జిల్లా గుడిపేట గ్రామంలో ఇటీవల కొత్తగా వెలిసిన రెండు వెంచర్‌లు చర్చ నియాంశంగా మారాయి. గుడిపేట్‌ నుంచి ప్రాజెక్టుకు వెళ్ళే దారిలో 4 ఎకరాల పట్టా భూమి ఉండగా దానికి అనుసంధానంగా ఉన్న ఎకరం ప్రభుత్వ భూమిని వెంచర్‌లో కలుపుకొని నిర్వాహకులు ప్లాట్లు క్రయ విక్రయాలు కొనసాగిస్తున్నప్పటికీ అధికారులెవరూ ఆ వైపు చూడడం లేదు. మరొకటి గుడిపెట్‌ హై వేను ఆనుకొని ఎనిమిది ఎకరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వెంచర్‌ ఏర్పాటు చేశాడు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్‌కు గ్రామ పంచాయితీ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా వెంచర్‌లో డెవలప్మెంట్‌ పనులు చేస్తూ, ప్లాట్లు క్రయ విక్రయాలు కొనసాగిస్తున్నాడు. గుడిపేట్‌ పంచాయితీ కార్యదర్శితో మాట్లాడగా నోటీసులు అందించాం అయిన పనులు చేస్తున్నారని తెలిపారు. కానీ అందించిన నోటీసులు అట్టి వ్యవసాయ భూమి సర్వే నెంబర్‌ చెప్పకుండా అధికారులు గోప్యంగా ఉంచడం గమనార్హం. గతం లోను ఇదే వెంచర్‌ నిర్వాహకుడు వేంపల్లిలో ఏర్పాటు చేసిన అనుమతి లెనీ వెంచర్‌లో అధికార పార్టీ నాయకులతో కలిసి అనుమతులు లేకుండా నే ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లు చేయించారనేే ఆరోపణలు ఉన్నాయి.
లక్షెట్టిపేటలో సైతం ఇదే తీరు
ఇదే తరహాలో లక్షెట్టిపేట్‌ మండలంలోని లక్ష్మిపూర్‌ గ్రామానికి వెల్లే రూట్‌లో కొన్ని వెంచర్‌లు వెలిశాయి. 5 ఎకరాల్లో వెలిసిన వెంచర్‌కు అప్పటి అధికారులు నోటీసులు అందజేశారు. అయినప్పటికీ అక్కడి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అవేవీ పట్టకుండా ప్లాట్లను ఇష్టానుసారం గా అమ్మేస్తున్నారు. మార్కెటింగ్‌ ఏజెంట్లను పెట్టుకొని ప్లాట్లను అమ్ముతూ ప్లాట్‌ నుండి వచ్చిన డబ్బులో కొంత ఏజెంట్‌లకు కమిషన్‌ లుగా ఇస్తూ కొనుగోలు దారులను దోచుకుంటున్నారు. గ్రామ పంచాయితీ అధికారుల నిబంధనలు బేఖాతరు చేస్తూ ఇష్ట రీతిన అక్రమంగా వెంచర్‌ ఏర్పాటు చేసి ప్లాట్ల క్రయ విక్రయాలు చేస్తున్న రియల్‌ వ్యాపారులపై ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
అక్రమ లేఅవుట్లకు నోటీసులు ఇచ్చాం
వెంకటేశ్వర్‌ రావు, జిల్లా పంచాయతీ అధికారి
వ్యవసాయ భూముల్లో ఇల్లీగల్‌గా ప్లాట్ల దందా కొనసాగించే వారికి ఇప్పటికే నోటీసులు అందించాం. వ్యవసాయ భూముల్లో వెంచర్‌ ఏర్పాటు చేయాలి అంటే ముందుగా గ్రామ పంచాయితీకి పది శాతం స్థలం కేటాయించాల్సి ఉంటుంది. వెంచర్‌లో రోడ్లు, విద్యుత్‌, మంచినీటి సదుపాయాలు కల్పించాలి. రూల్స్‌కు విరుద్ధంగా ఎవరైనా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తే వెంచర్‌ నిర్వాహకులుపై చర్యలు తీసుకుంటాం. గతంలో చాల వెంచర్‌లకు నోటీసులు అందించాం. అయినప్పటికీ వినక పోతే హద్దురాళ్లు తొలగిస్తాం.