వ్యవసాయ ప్రణాళిక-శాస్త్రీయ పద్ధతి

Agricultural Planning-Scientific Method2014 నుంచి క్రమంగా రాష్ట్ర వ్యవసాయ ప్రణాళికను తగ్గిస్తూ గత ప్రభుత్వం 2020 నుంచి పూర్తిగా నిషేదిం చింది. ప్రణాళికలేని అరాచక వ్యవసాయ ఉత్పత్తికి దోహదం చేసింది. ముఖ్యమంత్రి ప్రకటనే వ్యవసాయ ప్రణాళికగా నాటి అధికారులు ఆమోదించారు. వ్యవసాయ పరిశోధనలు, పంటల ధరలు, హార్టికల్చర్‌ పంటల ఉత్పత్తి పెంపుదల, ఆహార ధాన్యాల ఎగుమతులు – దిగుమతులపై ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికగానీ, అజమాయిషిగానీ లేదు. ఎరువులు, విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలు, బడ్జెట్‌ మొదలగు అంశాల ప్రస్తావన ప్రణాళిక నుంచి తొలగించి వేశారు. వ్యవసాయ శాఖ రైతులు పండించిన పంటలపైనే సమాచార సేకరణ చేశారు తప్ప, రాష్ట్రంలో గల మౌలిక వసతులను పరిగణలోకి తీసుకోలేదు. వాటిని సద్వినియోగం చేసి ఉత్పత్తిని, ఉత్పదకతను పెంచడానికి కనీస కృషి చేయలేదు.
డిసెంబర్‌ 2023న రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పరిస్థితుల్లో మార్పు వచ్చింది. క్యాబినేట్‌ సమావేశం జరపడానికి ప్రధాన ఎన్నికల కమిషన్‌ అంక్షలు పెట్టడం వలన కొన్ని సమస్యలకై పరిమితమై చర్చించింది. వ్యవసాయ ప్రణాళిక, రుణమాఫీ, ఖరీఫ్‌ ప్రణాళిక తదితర అంశాలపై పాక్షికంగా చర్చించారు. మరో 15 రోజులలో తొలకరి రాబోతోంది. ఇప్పటికే కొన్ని జిల్లాలలో విత్తనాలు వేయడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం సమగ్రమైన ‘వ్యవసాయ ప్రణాళిక’ను రూపొందించాలి. అందులో రైతులకు ఉపయోగపడే విధంగా ఉండాలి. గత రెండేండ్ల భూ వినియోగంతోపాటు రానున్న 2024-25 సంవత్సరాల వాస్తవాలు, లక్ష్యాలు ప్రకటించాలి. గత మూడేండ్లలో పండిన పంటలు, ఉత్పత్తి, ఉత్పాదకత, జిల్లాల వారీగా ప్రకటించాలి. భూసార పరీక్షలు జరిపి అందరికి ‘సాయిల్‌ హెల్త్‌ కార్డులు’ ఇవ్వాలి. ఇవి మూడేండ్ల వరకు పనిచేస్తాయి.
రాష్ట్రం అవసరాలకు తగిన ఆహార ఉత్పత్తులను పండించడం లేదు. పప్పులు, నూనెగింజలు, కూరగాయలు, ఆకుకూరలు, పంచదార, సుగంధద్రవ్యాలు(ఉల్లి, వెల్లుల్లి), పండ్లు, హార్టికల్చర్‌ ఉత్పత్తులు దిగుమతులు చేసుకుంటున్నాము. మన రాష్ట్రంలో వీటన్నిటిని ఉత్పత్తి చేయడానికి తగిన భూ, భౌతిక వనరులు ఉన్నాయి. పైగా రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు విత్తనాలు సరఫరా చేస్తున్నాము. మన రాష్ట్రంలో ఒక పంటపై 20 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం. నాణ్యతగల విత్తనాలను రైతులకు అందుబాటులో పెట్టి మిగిలిన విత్తనాలను ఎగుమతులు చేయాలి. గత వ్యవసాయ శాఖ ‘విత్తనగోదాం’ గా తయారు చేస్తానని ప్రకటనలు చేశారే తప్ప ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. కంపెనీల మోసాలకు తట్టుకొలేక విత్తనాల రైతులు భూములు కొల్పోవడమేకాక ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం తక్షణమే విత్తన చట్టం తెచ్చి ఆ రైతులకు రక్షణ కల్పించాలి.
కల్తీ విత్తనాల సమస్య
రాష్ట్రంలో ఏటా 4, 5 లక్షల ఎకరాల్లో కల్తీ విత్తనాల వల్ల పంటలు దెబ్బతింటున్నాయి. చట్టం లేకపోవడంతో రైతులు నష్ట పోతున్నారు. నాణ్యత లేని విత్తనాలు అనగా ఆడ, మగ విత్తనాల మధ్య తక్కువ పాలినేషన్‌ చేసి విత్తనాలు తయారు చేయడం వల్ల ఉత్పాదకత దెబ్బతింటున్నది. ఎఫ్‌-1 విత్తనాలు, హైబ్రిడ్‌ విత్తనాలు, సర్టిఫైడ్‌ విత్తనాలు, అధికోత్పత్తి వంగడాలు, వీటికి ధృవీకరణ పత్రం కంపెనీలే ఇస్తున్నాయి. సొంత ధృవీకరణ వల్ల విత్తనాల ”జర్మినేషన్‌” 60 శాతం లోపే ఉంటున్నది. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో విత్తన ధృవీకరణ వ్యవసాయ విశ్వ విద్యాలయం ద్వారా నిర్ణయించిన కమిషన్‌ ద్వారా ”విత్తన దృవీకరణ పత్రం” ఇచ్చారు. తిరిగి దానిని పునరుద్ధరించాలి. విత్తన కంపెనీకి, రైతుకు కుదించిన ఒప్పంద పత్రం రాష్ట్ర వ్యవసాయ కమిషనర్‌ వద్ద డిపాజిట్‌ చేయాలి. విత్తన రైతుకు కావాల్సిన రుణాలు, వ్యవసాయ సలహాలు ఉచితంగా అందుబాటులో పెట్టాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పర్యవేక్షణ కింద విత్తనోత్పత్తి, పరిశోధన కేంద్రాలు పని చేయాలి. ఆ విధంగా ఉత్పాదకతలను పెంచాలి.
హార్టికల్చర్‌
తెలంగాణలో ప్రస్తుతం 6.5 లక్షల ఎకరాలలో హార్టికల్చర్‌ పంటలు పండిస్తున్నారు. దీని లక్ష్యాన్ని 15 లక్షల ఎకరాలకు పెంచాలి. ప్రస్తుతం రాష్ట్రంలో కూరగాయలు, నూనెలు, పప్పులు, చెరుకు, అయిల్‌ పాం తదితర పంటల లోటు ఉంది. అలాగే హార్టికల్చర్‌ పంటల ప్రయోగ కేంద్రాలు నిర్వహించి పై పంటలపై కేంద్రీకరించాలి, లోటును భర్తీ చేయాలి. హార్టికల్చర్‌ పంటలను ప్రాసెస్‌ చేసి, గ్రేడింగ్‌ చేసి దగ్గరలో ఉన్న ముస్లిం దేశాలకు ఎగుమతులు చేయడం ద్వారా రైతులకు లాభాలు కట్టబెట్టవచ్చు. ప్రస్తుతం ఈ శాఖలో 901 పోస్టులు ఖాళీలు ఉన్నాయి, వాటిని వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నది.
వ్యవసాయశాఖలో ఖాళీలు
ప్రతి మూడు గ్రామాలకు ఒక ఏఓను నియమించాలి. ప్రస్తుతం ఉన్న పోస్టుల ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలి. అన్ని వ్యవసాయ పరిశోధన కేంద్రాలను పని చేయించాలి. రైతుల పర్యటనలు పెట్టాలి. వాటికి నిధులు కేటాయించి పరిశోధన కేంద్రాలలో రైతులకు క్లాసులు పెట్టాలి. రాష్ట్రంలోని 2,208 రైతు వేదికలను రైతు సలహా కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి. ఆ కేంద్రం నుండే రైతులకు సలహాలివ్వాలి. రైతుల పంటల జబ్బులకు సలహాలు ఇవ్వడానికి టోల్‌ నెంబర్లు కేటాయించాలి. ప్రణాళికలో ఐప్‌సోమ్‌ పంటల వివరాలను స్పష్టపరచాలి. కెవికెల పనిని మెరుగుపర్చాలి. పంటలేగాక మార్కెట్‌ చట్టాలు ఎగుమతి, దిగుమతుల ఫలితాలను వివరించాలి. పంటలు వేయు సందర్భంగా, కోతల అనంతర కృషికి సంబంధించి విధానాలను ప్రణాళికలో చెప్పాలి. పంటల నిల్వ సౌకర్యం, అమ్మకపు సందర్భంగా రైతు బంధు (సరుకు తాకట్టు పెట్టుకొని డబ్బు ఇవ్వడం) పథకం సక్రమంగా అమలు చేయాలి. ఎంపిక చేసిన జిల్లా కేంద్రాల్లో ల్యాబ్‌ సౌకర్యం కల్పించి కల్తీ, నాణ్యతలేని విత్తనాలను, ఎరువులను పరిశీలించి చర్యలు చేపట్టాలి. ఒకే పంటల విధానం కాక బహుళ పంటల సేద్యాన్ని ప్రోత్సహించాలి.
బడ్జెట్‌, రుణప్రణాళిక
ప్రణాళికలో చివరి అంశంగా గత మూడేండ్ల బడ్జెట్‌తో పాటు రానున్న ఏడాదికి కేటాయించిన వ్యవసాయ బడ్జెట్‌ వివరాలను అంశాల వారీగా ప్రకటించాలి. కేంద్ర సహాయాన్ని విడిగా జాబితా ఇవ్వాలి. హార్టికల్చర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయం, కృషి విజ్ఞాన్‌ కేంద్రాల కేటాయింపులు స్పష్టంగా బడ్జెట్‌లో ఇవ్వాలి. బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి ”రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం”లో రిజర్వుబ్యాంకు ఆదేశాలను అమలు చేయాలి. రైతులందరికీ రుణాలివ్వాలి. ఇందుకు ఎస్‌ఎల్‌బిసి బాధ్యత వహించాలి. స్కేల్‌ ఆఫ్‌ పైనాన్స్‌ ప్రకారం రుణాలివ్వాలి. 15 శాతం దళిత గిరిజనులకు, 8.3 శాతం సన్న-చిన్నకారు రైతులకు రుణాలివ్వాలని ఆర్‌బిఐ ఆదేశించింది. పంటల రుణాలు, దీర్ఘ కాలిక రుణాలు, వ్యవసాయ అనుబంధ రుణాలు ఇవ్వాలి. బుక్‌ అడ్జెస్ట్‌మెంట్‌ పద్ధతి రద్దు చేయాలి. కాంఫౌండ్‌ వడ్డీ కాకుండా ”సాలు సరి” వడ్డీని లెక్కగట్టాలి. పావలా వడ్డీ, వడ్డీమాఫీ, కేంద్ర వడ్డీ సహాయం తదితర పథకాల అమలు చేయని బ్యాంకులపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర బడ్జెట్‌ నిధులను సహకరా సంఘాలలో డిపాజిట్లు చేయాలి. సహకరా సొసైటీలు నిత్యావసర సరుకుల అమ్మకాలు, పంటల కొనుగోళ్లు చేయాలి. ఎఫ్‌పిఓ (రైతుల, ఉత్పత్తిదారుల ఆర్గనైజేషన్‌)లు ఏర్పాటు చేసి వాటి ద్వారా సేవలు కొనసాగించాలి. అధికారులను నిధులకు ఆకౌంట్‌ బులిటి బాధ్యత వహింపజేయాలి. ప్రతి మండలానికి నాలుగు సహకరా సంఘాలు నెలకొల్పాలి. కేంద్ర ఎన్‌సిడిసి సహాయంతో భవనాలు, గోదాంల నిర్మాణం చేపట్టాలి. పంటలలో కనీసం 70 శాతం నిల్వ సౌకర్యం కల్పించాలి. తాత్కాలిక రేకుల షెడ్‌, సిమెంట్‌ గద్దెలు నిర్మాణం చేసి మార్కెట్‌కు వచ్చిన పంటలు ఆకాల వర్షాల వల్ల నష్టపోకుండ సౌకర్యం కల్పించాలి. తగినన్ని టార్‌పాలిన్స్‌ అందుబాటులో పెట్టాలి. రైతులకు అవసరమైన అన్ని సరుకులను సొసైటీల ద్వారా అందించాలి. కొన్ని సంఘాలలో గ్రేడింగ్‌, ప్రాసెసింగ్‌ జరిపే ఏర్పాట్లు చేయాలి. సహకార వ్యవస్థలో ఐదంచెల విధానానికి బదులు మూడంచెల విధానాన్ని అమలు చేయాలి. అనగా జిల్లా కమిటీలు, రిజర్వు బ్యాంకు అంచెలను తొలగించాలి. ప్రయివేటు రుణాలను బ్యాంకు రుణాలుగా మార్చాలి. వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ప్రస్తుతం మధ్యదళారీలు కొనసాగిస్తున్న దోపిడీ, కుంభకోణాలను అరికట్టాలి. రైతుబంధు (గోదాములలో ధాన్యం తాకట్టుపెట్టుకొని డబ్బులు ఇవ్వడం) రైతులకు అమలు చేయాలి. ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి అదనపు ఆదాయం వచ్చే విధంగా చూడాలి. వ్యవ సాయ అనుబంధ ఉత్పత్తులు కోళ్లు, గొర్రెలు, మేకలు, చేపలు, పాలు తదితర ఉత్పత్తులను పెంచడానికి తగిన ప్రణాళిక రూపొందించాలి.
ప్రకృతి వైపరీత్యాలు
గతంలో యాక్షన్‌ ప్లాన్‌లో ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి నిబంధనలు మాత్రమే ప్రచురించారు. దాంతో పాటు గత రెండేండ్లలో జరిగిన నష్టం మండలాల వారీగా ప్రకటించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ఆర్థిక సంస్థలు ఇచ్చే పరిహారాన్ని ప్రణాళికలో తెలియబరచాలి. అన్ని పంటలకు ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించి, బీమా సౌకర్యం కల్పించాలి. ఇందుకు నిబంధనలు రూపొం దించాలి. రైతుబీమా ప్రస్తుతం 18-59 సంవత్సరాల వయస్సు వారికే ఉంది. దీనిని 18-70 సంవత్సరాలకు పెంచాలి. ప్రస్తుత బీమా ఆగస్టు 15తో పూర్తవుతుంది గనుక తిరిగి పునరుద్ధరించాలి. సిపిఓ (చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌) ద్వారా క్రాప్‌ కటింగ్‌ చేసి నష్టాన్ని అంచనా వేయాలి.రాష్ట్ర వ్యవసాయ శాఖ శాస్త్రీయంగా వ్యవసాయ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలి. పై విధానాలు అమలు చేయడం ద్వారా రైతుల ఆత్మహత్యలను నివారించవచ్చు. వ్యవసాయ దిగుమతులను తగ్గించి, ఎగుమతులు కొనసాగించవచ్చు. నష్టాల్లో ఉన్న వ్యవసాయాన్ని లాభాల్లోకి తీసుకురావచ్చు.
సారంపల్లి మల్లారెడ్డి
9490098666