వినియోగదారులకే లాభిస్తున్న వ్యవసాయ సబ్సిడీలు

వినియోగదారులకే లాభిస్తున్న వ్యవసాయ సబ్సిడీలున్యూఢిల్లీ : వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలంటూ చేపట్టిన ఆందోళనకు అన్నదాతలు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. పోలీసు కాల్పుల్లో ఓ యువ రైతు మరణించడం, మరికొందరు గాయపడడంతో రైతులు తమ ఆందోళనను రెండు రోజుల పాటు నిలిపివేశారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వంతో పలు దఫాలుగా జరుపుతున్న చర్చలు ఫలప్రదం కావడం లేదు. రాష్ట్రపతి ఎన్నికలకు ముందు, గతంలో 2020, 2021లో కూడా రైతులు డిమాండ్ల సాధన కోసం ఆందోళన సాగించారు. రైతుల పోరాటంతో వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ కొన్ని డిమాండ్లు మాత్రం ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి.ప్రభుత్వ విధానాలు రైతుల డిమాండ్లను నెరవేర్చేవిగా ఉండడం లేదు. దేశీయ వ్యవసాయ రంగం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధర లభించక రైతాంగం ఎన్నో ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలోనే రైతులు తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు అందించాలని, వాటికి చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఆర్థిక మద్దతు, రాయితీలను మినహాయించిన తర్వాత కూడా 2022లో అన్నదాతలు 163.6 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని చవిచూశారు. హోల్‌సేల్‌ మార్కెట్లలో ధరలు తక్కువగా ఉండడం, ప్రజా పంపిణీ వ్యవస్థ వంటి కార్యక్రమాల ద్వారా వినియోగదారులు లబ్ది పొందడం వంటివి ఈ నష్టానికి కారణాలు. అర్జెంటీనాలో కూడా ఇలాంటి పంపిణీ వ్యవస్థ ఉంది. అక్కడి రైతుల ఆదాయం 9.5 బిలియన్‌ డాలర్లు తగ్గింది. అదే సమయంలో వినియోగదారులకు 9.1 బిలియన్‌ డాలర్ల ప్రయోజనం చేకూరింది.