– రైతులు, వ్యవసాయ సమస్యలపై నేషన్ ఫర్ ఫార్మర్స్ నివేదిక విడుదల
– స్వామినాథన్‌కు భారతరత్న ఇచ్చి ఆయన నివేదికను చెత్తబుట్టలో వేస్తారా? : పీ. సాయినాథ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోని వ్యవసాయ సమస్యలపై కిసాన్-మజ్దూర్ కమిషన్ రూపొందించిన ‘వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన ఎజెండా-2024’ని నేషన్ ఫర్ ఫార్మర్స్ ప్రతినిధులు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు విడుదల చేశారు. మంగళవారం నాడిక్కడ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నేషన్ ఫర్ ఫార్మర్స్ ఏర్పాటు చేసిన కిసాన్-మజ్దూర్ కమిషన్ దేశంలో భూపరిశీలన ఇంకా పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజలు, అన్ని రంగాల నిపుణులతో కూడిన నివేదికను కమిషన్ తయారు చేసింది. భూమి, నీరు తదితర హక్కులు, కౌలుదారుల జాబితాను తయారు చేసి వారికి కేంద్ర పథకాల్లో ప్రాతినిథ్యం కల్పించడం, మహిళా రైతులను గుర్తించి వారికి భూమిపై హక్కు కల్పించడం, అటవీ చట్టాల నిబంధనలను ఉపసంహరించుకోవడం, గిరిజన రైతులకు రక్షణ తదితరాలు ప్రధాన సూచనలు అందులో పేర్కొన్నట్టు తెలిపింది. ”రైతులను అప్పుల బాధ నుంచి తప్పించేందుకు బ్యాంకు రుణాలకు భరోసా కల్పించాలి. డిజిటల్ అడ్డంకులు లేని సార్వత్రిక ఆహార ధాన్యాల పంపిణీ, విద్య, వైద్యం ప్రభుత్వ రంగంగా మార్చాలి. ఉపాధి హామీ చట్టంలో 200 రోజుల ఉపాధి హామీని అమలు చేయాలి” అని కోరింది.
ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్టు పీ.సాయినాథ్ మాట్లాడుతూ రైతుల మద్దతు ధరను నిర్ధారిస్తూ వచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వం చెత్తబుట్టలో వేసి, ఆ నివేదిక రూపకల్పన చేసిన ఎంఎస్ స్వామినాథన్‌కు భారతరత్న ఇచ్చిందని విమర్శించారు. పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో రైతులపై డ్రోన్ యుద్ధం జరిగిందని పేర్కొన్నారు. ”మోడీ ప్రభుత్వం ఎవరితో పోరాడుతోంది? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మోడీ హామీ ఇచ్చారు.
కానీ రాబడులు పడిపోయాయి. సుమారు లక్ష మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు” అని సాయినాథ్ విమర్శించారు. విలేకరుల సమావేశంలో ఏఐకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ ధావలే, విజుకృష్ణన్, ఉపాధ్యక్షుడు హన్నన్ మొల్లా, కోశాధికారి పీ. కృష్ణ ప్రసాద్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్, అఖిల భారత కిసాన్ ఖేత్ మజ్దూర్ సంఘటణ్ జాతీయ అధ్యక్షుడు సత్యవాన్ తదితరులు పాల్గొన్నారు.