ఎస్సార్‌లో అగ్రికల్చర్‌ బీఎస్సీ విద్యార్థిని ఆత్మహత్య

ఎస్సార్‌లో అగ్రికల్చర్‌ బీఎస్సీ విద్యార్థిని ఆత్మహత్య– వసతి గృహంలో ఉరేసుకున్న దీప్తి
– సెమిస్టర్స్‌లో బ్యాక్‌లాగ్స్‌..!
–  కన్నీరు పెట్టుకున్న తోటి విద్యార్థులు
నవతెలంగాణ-హసన్‌పర్తి
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలోని అనంతసాగర్‌ ఎస్సార్‌ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని రాథోడ్‌ దీప్తి(21) వసతిగృహంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలాన్ని ఎస్సార్‌ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటర్‌ శరత్‌, ఇన్‌స్పెక్టర్‌ తుమ్మ గోపి పరిశీలించారు. వర్సిటీ సిబ్బంది, తోటి విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన మోహన్‌సింగ్‌ మంచిర్యాలలో డిప్యూటి కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. చిన్నకూతురు దీప్తి (21) హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌ ఎస్సార్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. దీప్తి చదువులో వెనుకబడింది. కానీ, ఆమెలో చిత్రకళ నైపుణ్యం అద్భుతంగా ఉంటుంది. ఆమె వేసిన చిత్రాలలో జీవం ఉన్నట్టు కనిపిస్తుంది. అందులో నిగూఢమైన అర్థాన్ని చిత్రం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే, దీప్తికి 8 బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులున్నట్టు విశ్వవిద్యాలయం యాజమాన్యం చెబుతోంది. ఇటీవల పరీక్షల్లోనూ సబ్జెక్టులు తప్పాయి. బ్యాక్‌లాగ్స్‌పై దీప్తి మనస్తాపానికి గురైంది. సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లాల్సి ఉండగా.. గురువారం రాత్రి వరకు స్నేహితులతో సంతోషంగా గడిపింది. అర్ధరాత్రి వరకు అందరితో చాటింగ్‌, వీడియో కాల్‌లో మాట్లాడిన దీప్తి తెల్లవారే సరికి తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొంది. కొంత మంది మిత్రులకు ‘ఐ మిస్‌యూ’ అని మెసేజ్‌ చేసినట్టు సమాచారం. ఉదయం తోటి విద్యార్థులు, సిబ్బంది గమనించారు. ఎస్సార్‌ అడ్మినిస్ట్రేటర్‌ శరత్‌, ఇన్‌స్పెక్టర్‌ తుమ్మ గోపి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీప్తి వేసిన చిత్రాలను, సెల్‌ఫోన్‌, ఉరివేసుకునేందుకు వినియోగించిన చీరను, ఇతర వస్తువులను సేకరించారు. తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. ఎంతో నైపుణ్యం కలిగిన విద్యార్థిని దీప్తి ఆత్మహత్య చేసుకోవడంతో తోటి విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికులను కలిచివేసింది. అయితే, విద్యార్థిని చివరి క్షణంలో వేసిన చిత్రాలను బట్టి ప్రేమ విఫలంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్‌ తుమ్మ గోపి తెలిపారు.