లక్ష ఎకరాల్లో మూసీ నీటితో వ్యవసాయం

– విషతుల్యమవుతున్న కూరగాయలు : ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
లక్ష ఎకరాల్లో మూసీ నీటితో వ్యవసాయం చేస్తున్నారనీ, దీంతో పండించిన కూరగాయలు విషతుల్యంగా మారుతున్నాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మూసీ పక్కన ఉంటున్న వారు తరచుగా అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని స్పష్టం చేశారు. గత పాలకులకు వీరిని కాపాడే చిత్తశుద్ధి లేకపోయిందని చెప్పారు. స్వచ్ఛమైన నీరు, గాలి అందివ్వడం ఈ ప్రభుత్వం చేసిన తప్పా? అని ప్రశ్నించారు. ప్రపంచ విషపూరిత నదుల్లో మూసీ 23వ స్థానంలో ఉందని తెలిపారు.