
నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
వ్యవసాయం అనేది దేశానికి ప్రధాన జీవనాధారమని, ఒకప్పుడు చేసే వ్యవసాయానికి నేడు చేసే వ్యవసాయానికి చాలా మార్పులు వచ్చాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో శనివారం నుండి కొనసాగిన వ్యవసాయ ప్రదర్శన ఆదివారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అధునాతన పద్ధతులు, నూతన యంత్రాల వాడకం సరిగ్గా తెలుసుకుని వ్యవసాయం చేసే వారు ఆదాయాన్ని పొందుతున్నారని ఆయన చెప్పారు. చాలా మంది యువకులు సాప్ట్వేర్ ఉద్యోగాలను సైతం వదిలి అధునాతన పద్దతులలో వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ఎంతో శ్రమించి అన్ని కంపెనీలను ఒప్పించి ఇంత పెద్ద వ్యవసాయ ప్రదర్శనను ఏర్పాటు చేసిన రైతుబడి నిర్వాహకులు రాజేందర్ రెడ్డిని అభినందిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ కూలీలు దొరక్కపోవడం అనేది ప్రధాన సమస్యగా ఉందని, ఆ సమస్యను అధిగమించేందుకు అధునాతన యంత్రపరికాలను వాడే పద్దతులను తెలుసుకోవాలని ఆయన తెలిపారు. రైతులకు మేలు చేసే కార్యక్రమాలను నిర్వహించేందుకు ఎప్పుడు తన వంతు సహకారం అందిస్తానని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీల ప్రతినిధులకు సర్టిఫికెట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ ఖయ్యిమ్ బేగం, సీనియర్ నాయకులు యామ దయాకర్ , అయితగొని స్వామిగౌడ్, మందాడి మధుసూదన్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.