– హైకోర్టు కు 100 ఎకరాల కేటాయింపును రద్దు చేయాలి..
– ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వ్యవసాయ విద్యార్థులు…
– భోజన విరామంలో భారీ ప్రదర్శన…
– వర్శిటీ ఆస్తులను పరిరక్షించాలని వేడుకోలు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యార్ధులు, వ్యవసాయ రంగ భవిష్యత్ ను నిర్దేశించే వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వంసం చేయాలని చూడటం సరికాదని, వ్యవసాయ పరిశోధనలకు ఆటంకం లేకుండా హైకోర్టుకు కేటాయించిన 100 ఎకరాల యూనివర్శిటీ భూమిని వెనక్కి తీసుకోవడానికి జారీ చేసిన జీవో 55 ను రద్దు చేయాలని వ్యవసాయ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే చట్టపరంగా ముందుకు వెళతామని స్పష్టం చేశారు.హైకోర్టు బయో డైవర్సిటీ భూముల కేటాయింపును నిరసిస్తూ శుక్రవారం భోజన విరామ సమయంలో విద్యార్ధినీ,విద్యార్థులు ఆందోళన చేపట్టారు.కళాశాల ప్రాంగణం నుండి జాతీయ రహదారి వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ వ్యవసాయానికి సంబంధించి కీలక పరిశోధనలపై భూముల కేటాయింపు పెను ప్రభావం చూపుతుందని,పర్యావరణవేత్తలు,రా జకీయ పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు,ప్రజా సంఘాలు, నాయకులు వర్శిటీ భూముల రక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు నిర్మాణంతో పర్యావరణానికి తీరని నష్టం కలుగుతుందని,అరుదైన వృక్ష జాతులు,జీవజాతులు అంతరించి పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్శిటీలో పచ్చని వాతావరణానికి చిచ్చు పెడతారా అంటూ నిలదీశారు.తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 55 ను రద్దు చేయకుంటే భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో కళాశాలకు చెందిన పలువురు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.