ఆహా ఏమి రుచి

Aha what a tasteస్వీట్‌ కార్న్‌ ఎంతో ఆరోగ్యకరమైనది. ఇందులో ఎన్నో పోషకాలున్నాయి. ప్రోటీన్‌, మెగ్నీషియం, కాపర్‌, సెలీనియం, బీటా కెరోటిన్‌, లుటీన్‌, విటమిన్‌ సి, విటమిన్‌ ఇ, విటమిన్‌ డి వంటి పోషకాలు లభిస్తాయి. అదనంగా డైటరీ ఫైబర్‌ కూడా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ఇన్ని పోషకాలున్న స్వీట్‌ కార్న్‌తో కొన్ని వెరైటీ వంటలను ఇప్పుడు తెలుసుకుందాం.
సూప్‌
కావలసిన పదార్థాలు : స్వీట్‌ కార్న్‌-ఒక కప్పు, ఉల్లి కాడలు-అర కప్పు, టమాటా సాస్‌-ఐదు చెంచాలు, దాల్చిన చెక్క-కొద్దిగా, జీలకర్ర – ఒక స్పూను,
మిరియాలు- ఒక స్పూను, ఉల్లిపాయ తరుగు -అర కప్పు,
టమాటా-ఒకటి, పచ్చి మిర్చి-నాలుగు, ఉప్పు, పంచదార- తగినంత, నీళ్లు – మూడు కప్పులు,
తయారీ విధానం : ముందుగా ఉల్లి పాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలుగా తరిగి మిక్సీలో వేసి ముద్దగా చేయాలి. అలానే శుభ్రంగా ఉన్న వస్త్రంలో దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు తీసుకొని మూటలా కట్టాలి. ఉల్లి ముద్ద, సుగంధ ద్రవ్యాల మూట, మొక్క జొన్నలను నీళ్లలో వేసి ఉడికిందాలి. కొద్దిసేపటికి ఉప్పు, ఉల్లి కాడలు, టమాటా సాస్‌ వేసి బాగా మరిగించాలి. సూప్‌ చిక్కగా అవుతుంది. అప్పుడు సుగంధ దినుసుల మూటను తీసేసి వేడివేడిగా తాగితే చాలా రుచిగా ఉంటుంది.
కార్న్‌ పాలక్‌ పకోడి
కావలసిన పదార్థాలు : పాలకూర – ఒక కప్పు, స్వీట్‌ కార్న్‌ గింజలు – ఒక కప్పు, శనగపిండి – రెండు కప్పులు, కారం – మూడు టీస్పూన్లు, అల్లం తరుగు – రెండు టీస్పూన్లు, జీలకర్ర పొడి – నాలుగు టీస్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – డీప్‌ఫ్రైకి తగినంత.
తయారీ: ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి గిన్నెలో వేయాలి. పాలకూర వేసిన గిన్నెలో నూనె తప్పించి మిగతా పదార్థాలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లుపోసి పకోడి పిండిలా కలుపుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకుని గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌లోకి మారేంత వరకు వేయించి తీసేయాలి. వేడివేడిగా సర్వ్‌ చేసుకుంటే ఈ పకోడీలు చాలా రుచిగా ఉంటాయి.
ఉప్మా
కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు రవ్వ, ఒక కప్పు స్వీట్‌ కార్న్‌, రెండు టేబుల్‌ స్పూన్లు క్యాప్సికమ్‌ ముక్కలు, ఒక పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, ఒక టేబుల్‌ స్పూన్‌ అల్లం, అయిదు టేబుల్‌ స్పూన్లు నూనె, తాలింపుకు ఆవాలు, మినపప్పు, నాలుగైదు జీడిపప్పులు, మూడు కప్పుల నీళ్లు, రెండు టేబుల్‌స్పూన్ల కొత్తిమీర, రుచికి తగిన ఉప్పు.
తయారీ విధానం : మొదటగా రవ్వను డ్రై రోస్ట్‌ చేసి పెట్టుకోవాలి. అలాగే స్వీట్‌ కార్న్‌ ఉడికించి సిద్ధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో నూనె లేదా నెయ్యి వేసి, వేడి చేసి జీడిపప్పు, శనగపప్పు, ఆవాలు వేసి వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ, క్యాప్సికమ్‌ ముక్కలు, అల్లం తురుము వేసి వేయించాలి. ఇప్పుడు అందులో స్వీట్‌ కార్న్‌, అలాగే ఉప్పు వేసి 2-3 నిమిషాలు వేయించాలి. మరొక బాండీలో రెండు కప్పుల గోరువెచ్చని నీళ్లు పోసి రవ్వ వేయాలి. రవ్వ ఉడుకుతుండగా మొదట చేసిన మిశ్రమాన్ని వేసి ముద్దలుగా కాకుండా బాగా కలపాలి. ఉప్మా దగ్గరకు వచ్చినపుడు కొద్దిగా కొత్తిమీర కలపండి, స్టవ్‌ ఆఫ్‌ చేయండి. అంతే వేడి వేడి స్వీట్‌ కార్న్‌ ఉప్మా రడీ…
పరోటా
కావలసిన పదార్థాలు : గోధుమపిండి – ఒక కప్పు, స్వీట్‌ కార్న్‌ – అరకప్పు, ఉప్పు – రుచికి సరిపడా, జీలకర్ర – ఒక స్పూను, ఇంగువ పొడి – చిటికెడు, ఉల్లి తరుగు – మూడు స్పూన్లు, పచ్చిమిర్చి తరుగు – అర స్పూను, అల్లం తరుగు – అర స్పూను, వెల్లుల్లి తరుగు – అర స్పూను, వాము – పావు స్పూను, కొత్తిమీర తరుగు – అర స్పూను, నూనె – వేయించడానికి సరిపడా.
తయారీ : గోధుమ పిండిని చపాతీ పిండిలా కలుపుకోండి, దాన్ని తడి బట్టలో చుట్టి ముప్పావు గంట సేపు పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్‌ మీద కళాయి పెట్టి నూనె వేయండి. అందులో జీలకర్ర, ఉల్లి తరుగు, ఇంగువ పొడి వేసి వేయించండి. ఆ తర్వాత పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, వాము, కొత్తిమీర తరుగు, స్వీట్‌ కార్న్‌ వేసి బాగా కలపండి. అందులోని తడి ఇంకిపోయేదాకా చిన్న మంట మీద వేయించండి. ఇప్పుడు గోధుమ పిండిని ముద్దలుగా తీసుకొని పూరీల్లా ఒత్తుకోండి. స్వీట్‌ కార్న్‌ మిశ్ర మాన్ని మధ్యలో పెట్టి ఆ రొట్టెను మడిచి మళ్లీ రోల్‌ చేయండి. ఇవి మందంగా వస్తాయి. స్టవ్‌ మీద పెనం పెట్టి నూనె వేయాలి. ఒత్తిన పరోటాను వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే టేస్టీ స్వీట్‌ కార్న్‌ పరోటా రెడీ అయినట్టే. ఇవి చాలా రుచిగా ఉంటాయి. దీనికి ఎలాంటి చట్నీలు అవసరం లేదు.
పాయసం
కావాల్సిన పదార్థాలు: స్వీట్‌ కార్న్‌ – ఒక కప్పు ఒలిచిన గింజలు, పాలు – రెండు కప్పులు, నెయ్యి – మూడు టేబుల్‌ స్పూన్లు, పంచదార – అరకప్పు, యాలుకల పొడి – అర టీస్పూను, పిస్తా, కిస్‌ మిస్‌, జీడిపప్పు, బాదం పప్పు – అన్నీ కలిపి అరకప్పు.
తయారు చేసే విధానం : కార్న్‌ను మిక్సీలో వేసి ముద్దగా చేసుకోవాలి. కార్న్‌ ముద్దని ఒక బౌల్‌లో వేసి అందులో కొద్దిగా పాలు పోసి ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ మీద కళాయి పెట్టి నెయ్యి వేసి అందులో ఈ కార్న్‌ పాలు మిశ్రమాన్ని వేయించాలి. ఆ తర్వాత మరో కప్పు పాలు పోసి కలిపి చిన్న మంట మీదే 8 నిమిషాల పాటు ఉడికించాలి. అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు పంచదార వేసి కలపాలి. కొద్ది సేపు మరిగిన తర్వాత యాలకుల పొడి వేయాలి. దించే ముందు బాదం, జీడిపప్పు, కిస్‌ మిస్‌, పిస్తా చల్లాలి. స్టవ్‌ ఆపేయాలి. అంతే స్వీట్‌ కార్న్‌ పాయసం సిద్ధమైనట్టే.