అభివృద్ధిలో మునుగోడు దిక్సూచి అయ్యేంత వరకు అహర్నిశలు కృషి చేస్తా..

Aharnisha will work hard until it becomes a compass in development.నవతెలంగాణ – మునుగోడు
రాష్ట్రంలోనే మునుగోడు నియోజకవర్గము ను అభివృద్ధి చూసి  తెలంగాణ మొత్తం వచ్చి మునుగోడు ను చూసి వెళ్లే  విధంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసి దిక్సూచిగా తీర్చిదిద్దేంతవరకు అహర్నిశలు కృషి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు . మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులతో  ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణంకు నిధులు  మంజూరు చేయగా, శుక్రవారం శంకుస్థాపన చేసి అనంతరం ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ మునుగోడు ప్రజలకు రావలసిన హక్కుల , నిధుల , అభివృద్ధి విషయంలో ఏ త్యాగానికైనా ఏ పోరాటానికైనా సిద్ధమే అని, రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం నిర్మించుకునేది పాఠశాల కాదు దేవాలయం లాంటిది అని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రతి మండలానికి మండలానికి ఆరు పాఠశాలల చొప్పున 50 పాఠశాలలు కట్టించే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. మునుగోడు నియోజకవర్గంలో విద్యా, వైద్య విషయంలో నిర్లక్ష్యం జరిగింది. దానిని సరి చేయాల్సిన బాధ్యత నాతోపాటు మీ అందరి పైన ఉందని అన్నారు. రాష్ట్రంలో  119 మంది ఎమ్మెల్యేలలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా బెల్ట్ షాపులు మూసి వేయలేదని అన్నారు. మీ గ్రామాల అభివృద్ధి జరగాలంటే విద్య వైద్యం వికసించాలంటే ప్రజలందరూ బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. గతంలో కులమత బేధాలు లేకుండా అందరూ ఒకే చోట చదువుకున్నాం. మళ్లీ ఇప్పుడు అదే పద్ధతిలో  ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని అన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం విద్య వైద్యాన్ని ప్రైవేటు పాలు చేసింది. కాలేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది అని మండిపడ్డారు. మునుగోడు నియోజకవర్గానికి మొదటి విడతలోనే స్కూల్ మంజూరుకు కృషిచేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పూర్ణచంద్రరావు, చండూరు ఆర్డీవో సుబ్రహ్మణ్యం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నారా బోయిన రవి ముదిరాజ్, వేదిరే మెగా రెడ్డి, వేదిరే  విజేందర్ రెడ్డి మాజీ జెడ్పిటిసిలు, జాజుల అంజయ్య , ప్రభాకర్, పాశం సురేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ లు , పోలగొని సత్యం, కర్నాటి స్వామి, మాజీ సర్పంచులు జాల వెంకన్న యాదవ్, పగిళ్ల బిక్షమయ్య, జిల్లా,  మండల వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.