ఎన్నికలపై ఏఐ

AI on election– ఓటర్లను ప్రభావితం చేయనున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌
– సాంకేతికతను విస్తృతంగా వాడుకుంటున్న పార్టీలుొ సోషల్‌ మీడియాలో ఏఐ ఆధారిత వీడియోలు, ఫొటోలు
– ఇలాంటి వాటి ద్వారా ప్రభావితమవ్వద్దు
– వాస్తవమేదో.. కల్పితమేదో గ్రహించాలి
– ప్రజలకు సాంకేతిక నిపుణుల సూచన
– తప్పుదారి పట్టించే ఏఐ కంటెంట్‌పై నిఘా అవసరం
– రాజకీయ విశ్లేషకులు, సామాజిక కార్యకర్తల సూచన
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) గురించి తీవ్ర చర్చ నడుస్తున్నది. అగ్రదేశాల నుంచి పేద, మధ్య తరగతి దేశాలకూ ఈ సాంకేతికత ఎంతో కొంతవరకు అందుబాటులోకి వచ్చింది. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఎంత ఉపయోగకరమో.. అంతకు మించిన నష్టాన్ని కలగ చేయచ్చని నిపుణులు చెప్తున్న మాట. సదుద్దేశంతో మంచి పనులకు వాడినంత వరకు ఎలాంటి సమస్యా ఉండదనీ, ఆ హద్దును దాటితేనే అసలు సమస్యలు మొదలవుతాయని అంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక ఎన్నికల్లో ఏఐ ప్రభావం కచ్చితంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలతో పాటు.. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికారమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. తమ బలానికి ప్రత్యర్థి బలహీనత తోడైతే విజయం తమదేనన్న అంశాన్ని పట్టుకున్నాయి. దీంతో ఏదో ఒక సందర్భంలో ప్రత్యర్థి చేసిన ‘సెల్ఫ్‌ గోల్‌’ వ్యాఖ్యలను ప్రచారంగా వాడుకుంటున్నాయి. ఇందుకు సోషల్‌ మీడియాను ప్రధాన వేదికగా వాడుకుంటున్నాయి. మరికొన్ని పార్టీలైతే ఇంకొక అడుగు ముందుకేసి.. ఏఐ నుంచి రంగంలోకి దించుతున్నాయి. తమ పార్టీ అగ్రనాయకులు, పోటీలో ఉన్న అభ్యర్థుల గొంతులను పోలిన సందేశాలను, ప్రసంగాలను ఏఐ నుంచి సృష్టిస్తున్నారు. అలాగే, వారి చిత్రాలనూ ఏఐ సహాయంతో ప్రజలను ఆకట్టుకునే విధంగా రూపొందిస్తున్నారు. ఆయా పార్టీల ఐటీ, సోషల్‌ మీడియా టీమ్‌లు.. వీటిని సామాజిక మాధ్యమాల్లో ఒదులుతున్నాయి. ఇలాంటి ఏ.ఐ ఆధారిత, తయారీ వీడియోలు నెటిజన్లను ఆకర్షిస్తూ వైరల్‌గా మారుతున్నాయి.
మద్యం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు అనంతరం ఆయన భార్య సునీత కేజ్రీవాల్‌ కెమెరాల ముందుకొచ్చి ఆయన సందేశాన్ని హిందీలో చదివి వినిపించారు. అయితే, దీనికి సంబంధించిన ఇంగ్లీషు అనువాద సందేశం.. ఆయన గొంతుతోనే ఏఐ ద్వారా తయారు చేయబడి, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఆయన వ్యాఖ్యలను మాత్రం బీజేపీ తన ఐటీ టీం సహాయంతో కేజ్రీవాల్‌ను ఒక దయ్యంలా చూపించే ప్రయత్నాన్ని చేసింది. ఒక బాలీవుడ్‌ చిత్రంలోని కొన్ని సెకన్ల నిడివి గల వీడియోకి కేజ్రీవాల్‌ మాటలను జతపరుస్తూ వీడియోను తయారు చేసి సామాజిక మాధ్యమంలో బీజేపీ ఒదిలటం గమనార్హం.
ఏఐ కంటెంట్‌పై ‘డీప్‌’గా ఆలోచించాలి : నిపుణులు
భారత్‌ ఎన్నికల సీజన్‌లోకి వస్తున్నందున రాజకీయ నాయకుల సింథటిక్‌, డీప్‌ఫేక్‌లు విస్తృతంగానే వైరలవుతున్నాయి. దివంగత మాజీ సీఎం ఎం. కరుణానిధి డీఎంకే పార్టీ క్యాడర్‌ను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్నట్టుగా ఏఐను ఉపయోగించి రూపొందించారు. అలాగే, చెన్నైలో ఒక సభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీ తమిళ డబ్‌ కూడా ఇందులో భాగమే. అయితే, రాజకీయ పార్టీలు ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్న తీరు వారికి కావాల్సిన ప్రచారాన్నే తీసుకొస్తున్నప్పటికీ.. డీప్‌ఫేక్‌ల గురించి సాంకేతిక నిపుణులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. సెల్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాల వినియోగం ప్రజల్లో పెరిగిపోవటంతో.. ఇలాంటి డీప్‌ఫేక్‌లు వారికి త్వరగా చేరుకుంటున్నాయని చెప్తున్నారు. వాస్తవికమైన వీడియోలను పోలినట్టు ఉండే ఈ ఏఐ ఆధారిత వీడియోలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తాయనీ, గతంలో పలు సందర్భాల్లో ఇది స్పష్టమైందని సాంకేతిక నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి వీడియోల పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలనీ, చూసిన ప్రతి ఒక్క వీడియోనీ, ఫోటోను నిజమని నమ్మకుండా చెక్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు.
మరింత నిఘా అవసరం
ప్రస్తుతం ఎన్నికల సమయం కావటంతో ఏఐ ఆధారిత వీడియోలు, ఫోటోలను రాజకీయ పార్టీలు తమ ప్రచారం కోసం పెద్ద ఎత్తున విడుదల చేసే అవకాశం ఉన్నది. అయితే, తప్పుదోవ పట్టించనంత వరకు అవి సమర్ధనీయమేననీ, ఫేక్‌ వీడియోలతోనే అసలు సమస్య అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చట్టాలను మరింత కఠినంగా అమలు చేసి, వివాదాస్పద ఏఐ కంటెంట్‌పై దృష్టిని సారించి, సోషల్‌ మీడియాపై మరింత ఎక్కువ నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నదని సామాజిక కార్యకర్తలు ఎన్నికల సంఘాన్ని కోరుతున్నారు. ఏఐ ద్వారా తప్పుడు కంటెంట్‌తో ఓటర్లను ప్రభావితం చేసే వీడియోలు, చిత్రాలు, సమాచారంపై కఠిన చర్యలు తీసుకొని, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులపై ఉన్నదని వారు అంటున్నారు.