– కొత్త సంవత్సరంలో వెస్ట్ బ్యాంక్‌ను ఆక్రమిస్తాం: ఇజ్రాయిల్ మంత్రి వ్యాఖ్యలు
దుబాయ్, గాజా. బీరుట్ : గత ఏడాదికి పైగా ఇజ్రాయిల్ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గాజాకు మరింతగా మానవతా సాయం అందించా లంటూ చేసిన విజ్ఞప్తులు, గడువులు అన్నీ విఫలమ య్యాయని, సరిగా సహాయం అందడం లేదని అంతర్జాతీయ సహాయక సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.
13మాసాల దాడుల్లో పరిస్థితులు చాలా అధ్వాన్నంగా మారాయని ఆ సంస్థలు మంగళవారం పేర్కొన్నాయి. గాజాకు మరింత ఆహారాన్ని, ఇతర సాయాన్ని అందించాలని గత నెల్లో బైడెన్ ప్రభుత్వం ఇజ్రాయిల్‌ను కోరింది. ఇందుకు 30రోజుల గడువును కూడా విధించింది. మంగళవారంతో ఆ గడువు ముగిసింది. ఈ ఆదేశాలను అమలు చేయక పోతే ఇజ్రాయిల్‌కు మిలటరీ మద్దతు తగ్గిపోతుందని అమెరికా హెచ్చరించింది. కాగా ఇజ్రాయిల్ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంది. సమస్య త్వరలో పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్లు ఇజ్రాయిల్ కొత్త విదేశాంగ మంత్రి గిడెన్ సార్ వ్యాఖ్యానించారు.
2025లో వెస్ట్ బ్యాంక్ మాదే
కొత్త సంవత్సరంలో ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌ను ఇజ్రాయిల్‌లో కలిపేస్తామని ఆ దేశ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ వ్యాఖ్యానించారు. సోమవారం రియాద్‌లో అరబ్, ముస్లిం లీగ్ నేతలు సమావేశమైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. అయితే మంత్రి స్మోట్రిచ్ వ్యాఖ్యలను ఇజ్రాయిల్ ప్రభుత్వం ఇంకా సమర్ధించలేదు. అయితే నెతన్యాహు ప్రభుత్వ వైఖరి ఎలా వుండబోతోందో సూచనప్రాయంగా తెలి సింది. ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాల్లో వివాదా స్పదమైన ఆవాసాల విస్తరణ కార్యకలాపాలను మంత్రి పర్యవేక్షిస్తున్నారు. వెస్ట్ బ్యాంక్‌ను ఆక్రమించు కోవడానికి అవసరమైన చర్యలు, మౌలిక వసతులు చేపట్టాల్సిందిగా స్మోట్రిచ్ ఇజ్రాయిల్ ప్రభుత్వాన్ని కోరారు. వెస్ట్ బ్యాంక్‌పై తమ సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని ఈ వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోందని పాలస్తీనా అధ్యక్ష ప్రతినిధి నబిల్ అబూ రుడెన్ వ్యాఖ్యానించారు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా వున్న సమయంలో ఈ అంశాన్ని చర్చించామని, ఇప్పుడు కూడా దీనికి ముందు వాషింగ్టన్‌లో తమ మిత్రులతో చర్చించాల్సి వుందని ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి గిడెన్ సార్ వ్యాఖ్యానించారు.
బీరుట్, గాజాలపై కొనసాగుతున్న దాడులు
గాజాలో మంగళవారం ఉదయం నుండి నిరంతరంగా దాడులు కొనసాగుతునే వున్నాయి. జనంతో కిక్కిరిసిపోయిన డేర్ అల్ బాలా నగరంపై జరిగిన వైమానిక దాడిలో ఆరుగురు మరణించారు. దీంతో మొత్తంగా తెల్లవారు జాము నుండి జరిగిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య 25కి పెరిగింది. మరోవైపు తూర్పు లెబనాన్‌లోని హెర్మల్ పట్టణంపై జరిగిన దాడిలో ఒకరు మరణించారు. హిజ్బుల్లాతో కాల్పుల విరమణ కుదుర్చుకునే ప్రసక్తే లేదని ఇజ్రాయిల్ కొత్త రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కట్జ్ తేల్చి చెప్పారు. ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేస్తామంటూ హెచ్చరించారు. ఇదిలావుండగా, ఇజ్రాయిల్‌లోని కఫర్ యువల్ సెటిల్‌మెంట్‌పై హిజ్బుల్లా రాకెట్ దాడులకు పాల్పడింది.