– ప్రభుత్వానికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సూచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పాఠశాలల నుంచి డిగ్రీ కాలేజీల వరకు ఎయిడెడ్ విద్యాసంస్థలు గొప్ప పాత్రను పోషిస్తున్నాయని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి చెప్పారు. మాడపాటి హనుమంతరావు, వివేకానంద, కీస్ హైస్కూల్‌తోపాటు ఏవీ కాలేజీ, వీవీ కాలేజీ వంటి ప్రముఖ విద్యాసంస్థలుగా ఉన్నాయని వివరించారు. బుధవారం శాసనమండలి సమావేశంలో ప్రత్యేక ప్రస్తావన కింద ఈ అంశాన్ని ఆయన లేవనెత్తారు. 20 ఏండ్లుగా వాటిలో ఉపాధ్యాయ, అధ్యాపక నియామకాల్లేకపోవడం వల్ల చాలా విద్యాసంస్థలు మూతపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థలపై ప్రభుత్వం కమిటీని వేసి అన్ని అంశాలనూ అధ్యయనం చేయాలని కోరారు. ఆ భూములను కొందరు దాతలు విరాళంగా ఇచ్చారని గుర్తు చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించారు. కొన్నింటినీ విలీనం చేసుకోవాలని కోరారు.
మోడల్, కేజీబీవీ, గురుకులాల సిబ్బందికి ఆరోగ్య కార్డులివ్వాలి
రాష్ట్రంలో 3.69 లక్షల మంది ఉద్యోగులు, 2.87 లక్షల మంది పెన్షనర్లున్నారని నర్సిరెడ్డి చెప్పారు. వారికి ఆరోగ్య కార్డులను ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, ఐదు రకాల గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఇతర సిబ్బందికి ఆరోగ్య కార్డులను ఇవ్వలేదని వివరించారు. వారికి ఆరోగ్యకార్డులిచ్చి నగదు రహిత వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.