– రోజుకు సగటున 5 హెచ్‌ఐవి కేసులు
– ఈ ఏడాది ఇప్పటికే 47 మంది విద్యార్థుల మృతి
త్రిపుర: బీజేపీ పాలనలో ఉన్న త్రిపురలో ఎయిడ్స్ మహమ్మారి విజృంభిస్తోంది. విద్యార్థుల్లో ఎక్కువగా ఈ వ్యాధి బయటపడుతుండటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది మే 31 వరకు సేకరించిన గణాంకాల ప్రకారం ఇప్పటికే 47 మంది విద్యార్థులు హెచ్‌ఎఐ బారిన పడి చనిపోయారు. రోజుకు అయిదు చొప్పున హెచ్‌ఐవి కేసులు నమోదవుతున్నాయి. ఈ వివరాలను ఇటీవల నిర్వహించిన ఒక సెమినార్‌లో ఆ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 828 మంది విద్యార్థులను హెచ్‌ఐవి పాజిటివ్‌గా గుర్తించినట్లు తెలిపారు. 828 మంది హెచ్‌ఐవి పాజిటివ్ విద్యార్థుల్లో 572 మంది వివిధ దశల్లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. ‘మే 2024 నాటికి 8729 మంది లైంగిక సంబంధిత (ఎఆర్‌టి) వ్యాధుల బారినపడ్డారు. వీరిలో 5674 మంది హెచ్‌ఐవితో బాధపడుతున్నారు. బాధితుల్లో 4570 మంది పురుషులు కాగా 1103 మంది మహిళలు. ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు’ అని సంబంధిత అధికారులు వివరించారు. 220 పాఠశాలలు, 24 కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి డ్రగ్స్ ఇంజెక్షన్ తీసుకుంటున్న విద్యార్థుల సమాచారం ఆధారంగా ఈ డేటా రూపొందించారు.