పోరాట స్ఫూర్తినిచ్చిన ‘ఐద్వా’ రాష్ట్ర మహాసభలు

'Aidwa' State Congresses inspired struggleభద్రాద్రి కొత్తగూడెం. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఆదివాసీలు, గిరిజనులు. ఎన్నో ఏండ్లుగా తమ హక్కుల కోసం, ఉపాధి కోసం ఎర్రజెండా నీడలో పోరాడిన వీరులు. ఎన్నో నిర్భంధాలు, మరెన్నో ఉక్కుపాదాలు, నిర్ధాక్షిణ్య మైన అణచివేతల్ని లెక్కచేయని ధీరులు. నెత్తుటి గాయాల నుంచి వచ్చిన శ్వాసనే ఆశయంగా మలుచుకున్న యోధులు. అందుకే ఈ జిల్లా పోరాటాల ఖిల్లా. గిరిజన, కార్మిక, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆ జిల్లా అంతా ఎర్రజెండా పోరాటాలు బొగ్గుగనుల్లో అగ్గిరవ్వలా ఎగిసాయి. పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. వామపక్షాలకి ఘన చరిత్ర కలిగి, అలాంటి పోరాట నేపథ్యం ఉన్నచోట అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర నాలుగో మహాసభలు జరగడం ప్రత్యేకతను సంతరించు కున్నది. మల్లు స్వరాజ్యం నగర్‌, కొండపల్లి దుర్గా దేవి ప్రాంగణంగా నామకరణం చేసి కొత్తగూడెం క్లబ్‌లో ఈ నెల 21-23 వరకు నిర్వహించిన ఐద్వా సభలు ఎంతో ఉత్తేజాన్ని నింపాయి. రాష్ట్రంలో నలుమూలల నుంచి హాజరైన ప్రతినిధులు తమ పోరాటాలు, అనుభవాలు పంచుకోవడమే కాదు, భవిష్యత్తు కార్యచరణకు నడుం బిగించారు. తొలిరోజు బహిరంగసభకు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ హాజరై ప్రసంగించడం వేలాదిమంది మహిళల్లో స్ఫూర్తి నింపింది.
పారిశ్రామిక ప్రాంతానికి, గిరిజన సంస్కతికి, అభ్యుదయ భావాలకు అనేక సమరశీల రైతు పోరాటాలకు నిలయమైన జిల్లా కొత్తగూడెం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి, బొగ్గు కార్మికుల ఉద్యమానికి భద్రా చలం కేంద్రంగా ఆదివాసి పోరాటాలకు ఈ జిల్లా నిలయం. మహిళలను, గ్రామీణ పేదలను, ఆదివాసీలను సమీకరించి అనేక పోరాటాలకు నాయకత్వం వహించిన యోధులు ప్రాణాలర్పించి ఈ జిల్లాను త్యాగాలతో పునీతం చేసి, చరిత్ర కలిగినటువంటి జిల్లాలో నాలుగో రాష్ట్ర మహాసభలు జరగటం అభినందనీయం. కొండపల్లి దుర్గాదేవి, రాజేశ్వరమ్మ, హైమావతి వంటి అనేకమంది మహిళా నాయకులను తయారు చేసిన గడ్డ ఇది. దేశానికి తెలంగాణ తలమానికంగా ఉన్న సింగరేణికి పుట్టినిల్లు. కల్మషం ఎరగని ఆదివాసి సంస్కతి దోపిడీని సహించలేని పోరాటపటిమ కలిగిన వారసత్వం భద్రాద్రి కొత్తగూడానిది. ఇక్కడి నుంచే రాష్ట్ర నాయకత్వం అనేక మహిళా ఉద్యమాలకు ప్రారంభించి విజయవంతం చేయడం ఎంతో స్ఫూర్తిదాయకం. అలాంటి జిల్లాకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులు హాజరవ్వడం మంచి పరిణామం.
ఉత్తేజం నింపిన మహాసభలు
నేడు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నప్పటికీ సమాజంలో చులకన భావమే నెలకొన్నది. మనువాదం, మత రాజకీయాలతో ముడిపడిన ప్రస్తుత రాజకీయం స్త్రీలను వస్తువుగా, వంటింట్లో కుందేలుగానే చూస్తున్నది. పురుషాధిక్య సమాజంలో వారి విలువలు తరుగుతున్న సందర్భంలో ‘ఐద్వా’ అనేక సమస్యలపై ఉద్యమిస్తున్నది. దేశంలో రోజు రోజుకూ పెరుగుతున్న హింస పట్ల నూతన పోరాటాలను ఆవిష్కరిస్తున్నది. అందులో భాగమే తమ కర్తవ్యాల్ని గుర్తుచేస్తూ, బాధ్యతల్ని నెమరువేసుకుంటూ భవిష్యత్తు కార్యచరణలో భాగంగా మహిళల్ని ఐక్యం చేసేందుకు కొత్తగూడెంలో నిర్వహించిన ఈ మహాసభలు ఎంతగానో తోడ్పడ్డాయి. సభ ప్రారంభమైన మొదటిరోజున ఒక చేతిలో పిడికిళ్లు, మరోవైపు ఎర్రజెండాలు, ఇంకో వైపు ప్రత్యేక చీరలు ధరించిన ఐద్వా కార్యకర్తలు, డోల్‌ కొయ్యల కళాకారులు, డప్పు దళాల కళాకారులు, మహిళల కోలాటాలు, గిరిజన రేలా దళంతో పాత డిపో నుంచి సూర్యాప్యాలెస్‌ బహిరంగ సభ ప్రాంగణం వరకు ప్రదర్శన నిర్వహించారు. ‘ ప్రజాస్వామ్యం, సమానత్వం, స్త్రీ విముక్తి వర్ధిల్లాలి’, ‘ హింస, మద్యం, మాదకద్రవ్యాలు లేని సమాజం కోసం పోరాడదాం’ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. మహిళలు స్వేచ్ఛగా జీవించే హక్కు కావాలని, వారి భద్ర తకు తీసుకొచ్చిన చట్టాలు నిర్వీర్యమవుతున్నాయని, ఆ చట్టాల్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం మహసభల ప్రారంభ సూచికంగా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, సీనియర్‌ నాయకురాలు బత్తుల హైమావతి జెండా ఆవిష్కరించారు. ఆ తర్వాత అమరవీరుల స్థూపం వద్ద అఖిల భారత నాయకులు, ప్రతినిధులు నివాళులర్పించారు. ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్‌ మీడియం బాబురావు సభనుద్దేశించి మాట్లాడారు. ముందుతరం నాయకుల పోరాట పటిమ, త్యాగనిరతి, క్రమశిక్షణ, ఉక్కు సంకల్పం స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే ప్రారంభోపన్యాసం చేశారు. జాతీ అధ్యక్షురాలు శ్రీమతి, ఉపాధ్యక్షురాలు పుణ్యవతి కూడా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ విధానాలతో మహిళలకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. భారతదేశంలో కోట్లాది మందికి రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు అందరికి సమానంగా వర్తిస్తున్నాయా అనేది పశ్నించు కోవాలని, సమాన హక్కుల కోసం పోరా డాలని ప్రతి నిధులకు మంచి సందేశాన్నిచ్చారు. నిజాం పాలనలో తెలంగాణ రైతాం గ సాయుధ పోరాట చరిత్ర కీలకమైనది, అందులో చిన్నతనంలో బంధూకు పట్టి పోరాడిన మల్లు స్వరాజ్యం భవిష్యత్తు తరం నేతలకు ఆదర్శమన్నారు.
పోరాటాలు..పరిష్కారాలు
మహాసభల్లో వక్తల ఉపన్యాసాలు కార్యకర్తల్లో ఎంతో పోరాటాన్ని, ధైర్యాన్ని నింపాయి. ఈ అసమానతల సమాజంలో, దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నదని మహాసభల ఆవశ్యక్త నొక్కి చెప్పింది. ధరల పెరుగుదల, నిత్యావసర సమస్యలన్నింటి మూలమేంటి? నిరుద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు సమస్యలు ఏమిటి? ప్రభుత్వాలు ప్రజలపై ఎలాంటి భారాలు మోపుతున్నాయి? ప్రజాబాహుళ్యంలో ఉన్న సంఘంగా మహిళల ముందున్న సవాళ్లు ఏమిటో పరిశీలించాలని వక్తలు మహాసభల్లో ప్రతినిధులకు సూచించారు. బ్యాంకు ఉద్యోగాల నియామక సమయంలో గర్భంతో ఉన్న మహిళలను పరిగణనలోకి తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వరంగ బ్యాంకులు జారీచేసిన సర్కులర్‌కు వ్యతిరేకంగా ఐద్వా పోరాటం చేయటం వల్ల ఆ ఉతర్వులు రద్దయ్యాయని, అలాంటి పోరాటాలు భవిష్యత్తులో మరిన్ని కూడా చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మోడీ ప్రధాని అయ్యాక స్త్రీలు తీరోగమణ దిశలో పయనిస్తు న్నారని, అందుకే మహిళలను అభ్యుదయ భావాల వైపు మళ్లించే విధంగా విస్తృతంగా ప్రచారం అనివార్యమని, ఐద్వా విధానాలు మహిళలకు చేరువయ్యేలా ఉండాలని కోరారు. తెలంగాణలో కులదురహంకార హత్యలు, మహిళల్లో పెరుగుతున్న మూఢ నమ్మకాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అంశాల పట్ల రాష్ట్ర మహాసభ తీసుకునే నిర్ణయాలు, కర్తవ్యాల అమలుకు కార్యకర్తలు కృషిచేయాలని కోరారు.
కార్యదర్శి నివేదిక..సంతాప తీర్మానం
రాష్ట్రంలో మహిళల స్థితిగతులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, చేయాల్సిన పోరాటాలు, చేస్తున్న ఉద్యమాల పట్ల ప్రజల్లో స్పందన గురించి ఐద్వారాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ నివేదిక ప్రవేశపెట్టారు.
29 జిల్లాల నుండి వచ్చిన 400మంది ప్రతినిధులు పాల్గొని నివేదిక మీద మాట్లాడారు. వారు చేసిన పోరాటాలు, సాధించిన విజయాల్ని గుర్తుచేశారు.అమరవీరుల సంతాప తీర్మానాన్ని ఐద్వా సహాయ కార్యదర్శి నాగలక్ష్మి ప్రవేశపెట్టారు. మహాసభ ప్రాంగణంలో మల్లు స్వరాజ్యం చిత్రపటానికి జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, కొండపల్లి దుర్గాదేవి చిత్రపటానికి ఐద్వా అధ్యక్షురాలు పీకే. శ్రీమతి, ఎన్‌.ఎస్‌. లక్ష్మి దేవమ్మ చిత్రపటానికి ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్‌.పుణ్యవతి, కుంజా కృష్ణకుమారి చిత్రపటానికి ఐద్వా జాతీయ ఉపాధ్యక్షులు సుధాసుందర రామన్‌ పులమాల వేసి నివాళులర్పించారు. గత మహాసభ నుంచి నేటి వరకు మూడేండ్ల కాలంలో వివిధ కారణాల వలన చనిపోయిన వారికి సంతాపం తెలిపారు. ప్రారంభ కార్యక్రమానికి నాయకులను, అతిథులను భద్రాద్రి కొత్తగూడెం ప్రధాన కార్యదర్శి జ్యోతి వేదికపైకి ఆహ్వానించారు.
తీర్మానాలు
నేడు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టగా ప్రతినిధులు ఆమోదం తెలిపారు. మహిళా సాధికారత కల్పించాలి.చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి. మహిళలు – ఉపాధి సమస్యలు, ఆహార భద్రత, అర్హత కలిగిన అందరికీ డబుల్‌ బెడ్రూంలు, పేదలందరికీ ఇండ్ల స్థలాలు, ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయంమహిళలపై వివిధ రూపాల్లో పెరుగుతున్న హింసను అరికట్టడం, రాష్ట్రంలో మహిళల పరిస్థితి – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీర్మానాలు పెట్టి భవిష్యత్తు కార్యచరణ రూపొందించుకున్నారు.అలాగే నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర నూతన అధ్యక్ష, కార్యదర్శు లుగా ఆర్‌.అరుణజ్యోతి, మల్లు లక్ష్మి, కోశాధికారిగా మాచర్ల భారతి ఎన్నికవ్వగా ఆఫిస్‌ బేరర్స్‌ 19, రాష్ట్ర కమిటీ 71 మందితో ఎన్నుకోబడింది. కొత్తగూడెంలో నిర్వహించిన ఐద్వా మహాసభలు విజయవంతం కావడంతో ఐద్వా కార్యకర్తలు, ప్రతినిధులు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. భవిష్యత్తు కార్యచరణకు సన్నద్ధమ వ్వడమే కాకుండా మహిళల్ని ఐక్య ఉద్యమాల్లో పాల్గొనేలా చేస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు.
మల్లు లక్ష్మి
9848481099