పోడు రైతులను దగా చేసిన ప్రభుత్వం : ఏఐకేఎంఎస్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పోడు రైతులను రాష్ట్ర ప్రభుత్వం దగా చేసిందని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్‌) విమర్శించింది. శనివారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మామిడాల బిక్షపతి, బి భాస్కర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. పోడు సేద్యం చేసుకుంటున్న రైతులకు 11 లక్షల ఎకరాలకు పట్టాలిస్తామంటూ గత బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కేవలం నాలుగున్నర లక్షల ఎకరాలకు మాత్రమే పట్టాలిచ్చి పోడు రైతులని దగా చేశారని విమర్శించారు.
ఎన్నికల తాయిలాలలో భాగంగా కొద్ది మందికి తూతూ మంత్రంగా పట్టాలిచ్చి మెజారిటీ పోడు రైతులను వారి భూములు నుంచి వెళ్లగొట్టడానికి కేసీఆర్‌ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పట్టాలు రాని వారందరూ భూములను వదిలి వెళ్లాలంటూ అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారని వివరించారు. మరోవైపు అధికార పార్టీ నేతలు పోడు రైతుల నుంచి పట్టాలిప్పిస్తామంటూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. అటవీ హక్కుల చట్టం నిర్దేశించినట్టుగా, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ ప్రకారం పోడు రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. లేదంటే ప్రభుత్వ దాగాకోరు విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.