ఐలమ్మ ఒక సాధారణమైన పేరే… కానీ 1940లలో తెలంగాణలో భూస్వామ్య వ్యతిరేక రైతాంగపోరాట నిర్మాణంలో కీలకమైన ప్రయోగానికి కేంద్రంగా నిలిచిన వ్యక్తి. ఎనభై ఏండ్ల క్రితపు వాస్తవం. ఆమె మరణించి నేటికి ముప్ఫయి ఎనిమిదేళ్లు. ఆజాదీ క అమృత్ మహౌత్సవాల సందర్భంలో అసలు తలచుకోవలసిన భూమి బిడ్డలు ఐలమ్మ వంటివాళ్లే. ఒక వైపు మా దేశాన్ని వదిలివెళ్ళండి అంటూ భారతదేశ ప్రజలు బ్రిటిష్ వారికీ వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం నిర్వహిస్తున్న కాలంలో మా భూములను వదిలి వెళ్ళండి అంటూ ఐలమ్మ వంటివాళ్లు దేశీయ భూస్వామ్య పెత్తందారీతనానికి వ్యతిరేకంగా దేశంలో ఎక్కడెక్కడో బతుకు స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేశారు. అయితే ప్రచారంలో ఉన్న స్వాతంత్య్ర ఉద్యమచరిత్ర ముఖచిత్రంలో వీళ్లకు చోటులేదు. అలాంటివాళ్లను చేర్చుకొంటూ పోతేనే స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర బహువర్ణ ముఖచిత్రమై భాసిస్తుంది. ఆ క్రమంలోనే భారత దేశ స్వాతంత్య్రం ఈ డెబ్బై అయిదేళ్ల చరిత్రలో ఎవరికి అమతాన్ని పంచింది? ఎవరి పాలుకు కాలకూటాన్ని మిగిల్చిందన్న విషయం అర్ధం చేసుకొనటానికి వీలవుతుంది.
ఐలమ్మ గురించి నేను తెలుసుకున్నది 1981,1982లోనో. నేను అప్పటికి కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా చేరి నాలుగైదేళ్లు.అటు ‘విరసం’ ఇటు విద్యార్థులు నన్ను ప్రభావితం చేస్తూ నా అధ్యయన మార్గాన్ని సూచిస్తున్న కాలం. ఆ సమయంలో కాలేజీలో బిఎ, బిఎస్సీ , బికామ్ విద్యార్థులకు ప్రజలమనిషి నవల, మాభూమి నాటకం పాఠం చెప్పే అవకాశం వచ్చింది. అందుకు అవసరమైన సైద్ధాంతిక చారిత్రక అవగాహన ఏర్పరచుకొనటం కోసం తెలంగాణ రైతాంగ పోరాటచరిత్ర గురించి వచ్చిన పుచ్చలపల్లి సుందరయ్య గారి ‘వీరతెలంగాణ విప్లవపోరాటం – గుణపాఠాలు,’ రావి నారాయణరెడ్డి గారి ‘వీర తెలంగాణా…నా అనుభవాలు- జ్ఞాపకాలు’ వంటి పుస్తకాలు కొని తెచ్చి చదువుకొన్నాను. అప్పుడే తెలంగాణ వ్యవసాయక తిరుగుబాటును రగిల్చిన నిప్పురాళ్లు చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య నాకు తెలిసారు.
ఈ చరిత్ర చదువుకొంటున్న ఒక సెలవురోజున అనుకోకుండా వరవరరావు కిషన్‌పురాలో ఉన్న మా ఇంటికి వచ్చారు. అప్పుడప్పుడు హనుమకొండ చౌరస్తాకు సమీపంలో కుమార్‌పల్లిలో వున్న వాళ్ళింటికి వెళ్ళటం, సాహిత్య సంభాషణలు చేయటం, రాసిన ఏదో ఒక వ్యాసం చూపించి ఆయన అభిప్రాయాలు తెలుసుకొని రావటం నాకు అలవాటే. కానీ ఆయన మా ఇంటికి రావటం అదే మొదలు. ఆశ్చర్యం, ఆనందం ఆ రోజు మా సంభాషణ అంతా తెలంగాణ రైతాంగ పోరాటం గురించే. ఐలమ్మ క్రియాశీల వ్యక్తిత్వానికి, దొడ్డి కొమురయ్య ఆత్మార్పణకు ఉన్న రాజకీయ ప్రాధాన్యత గురించి నాకొక స్పష్టమైన అవగాహనను ఇచ్చిన సంభాషణ అది. ఆ క్రమంలోనే వరంగల్‌కు సమీపంలో పాలకుర్తిలోనే ఆనాటి తెలంగాణ రైతాంగపోరాట చరిత్రకు సజీవ సాక్ష్యంగా మిగిలిన ఐలమ్మ ను1982 ఏప్రిల్ 25న కలిసి మాట్లాడి రావటం కూడా జరిగింది.
ఐలమ్మ 1895లో వరంగల్ జిల్లా కిష్టాపురంలో చాకలి కుటుంబంలో ఓరుగంటి మల్లమ్మ సాయిలు దంపతులకు పుట్టింది. పది, పదకొండేళ్ల వయసులో పాలకుర్తికి చెందిన చిట్యాల నరసింహతో పెండ్లయింది. పదిహేనేళ్లకు కాపురానికి వచ్చిందనుకున్నా 1910 నాటికి పాలకుర్తికి వచ్చింది. కులవృత్తి బట్టలు ఉతకటం, వృత్తి మాన్యంగా లభించిన నాలుగుమళ్ల భూమిసాగు చేయటం వాళ్లకు బతుకు తెరువు మార్గాలు. అయిదుగురు కొడు కులు, ఒక కూతురు పుట్టి పెద్దవాళ్లవుతుంటే పాలకుర్తికి ఆనుకొని ఉన్న మల్లంపల్లిలో ఉత్తమరాజు కొండలరావు అనే ‘కరణపు దొర’ దగ్గర 40ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేయటం మొదలు పెట్టారు.పెద్ద కొడుకు లిద్దరితో కలిసి భూమి మీద పాటుపడుతూ ఐలమ్మ దంపతులు వ్యవసాయానికి స్వంత నాగళ్లు ఏర్పరచుకొనటమే కాక నలు గురు జీతగాళ్లను పెట్టుకొని మరింత భూమిని సాగుచేసుకొనే స్థితికి ఎదిగారు. కొంతబంగారం కూడా సంపాదించుకొన్నారు.
ఆ సమయానికి తెలంగాణ గొప్ప పరివర్తనకు లోనవుతున్నది. 1930ల నుండి నైజాం ప్రభుత్వంలో తెలుగువాళ్ళ భాష సంస్కృతులు, విద్యా విషయక అభివృద్ధి, వ్యాపార ప్రయోజనాలు మొదలైన లక్ష్యాలతో పనిచేస్తున్న ఆంధ్రమహాసభ 1940 నాటికి ఆర్థిక రాజకీయ అంశాలను సంబోధించే స్థాయికి వచ్చింది. ముఖ్యంగా 1941లో చిలుకూరులో జరిగిన ఎనిమిదో ఆంధ్రమహాసభ తరువాత రెండు, మూడేండ్ల కాలంలో ఆంధ్రమహాసభ కార్య కలాపాలు గ్రామీణ ప్రాంతాలకు బాగా విస్తరించాయి. మహాసభలో మితవాదుల ప్రాబల్యం తగ్గి కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరిగింది. రావినారాయణ రెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఆరుట్ల రామచంద్రారెడ్డి మొదలైనవాళ్లు నల్లగొండ జిల్లా గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి స్థానిక రైతాంగంతో సంబంధాలు ఏర్పరచుకొని, సంఘం సభ్యు లుగా చేర్చుకొని పోరాటాలకు సంసిద్ధం చేశారు. ఆ క్రమంలో పాలకుర్తిలో కూడా సంఘం ఏర్పడింది. చిట్యాల ఐలమ్మ, ఆమె భర్త, పెద్ద కొడుకులిద్దరు కూడా అందులో సభ్యులే. ఆ సంఘం చైతన్యంతోనే ఐలమ్మ కుటుంబం పటేల్ శేషగిరిరావుకు వెట్టికి నాగళ్లను, పశువులను ఇయ్యటానికి నిరాకరించింది. మూడుతులాల బంగారం కానుకగా చెల్లించాలంటే లేదని నిలబడ్డది. ఈ ధిక్కారాన్ని సహించలేక పటేల్ ఐలమ్మ కుటుంబం అంతా సంఘ సభ్యులని చెప్పి విసునూరి రామచంద్రారెడ్డిని వాళ్ళమీదకు ఉసి గొలిపాడు. దాంతో ఐలమ్మ కుటుంబం శ్రమించి సాగుచేసిన కౌలుభూమి నుండి వాళ్ళను బేదఖల్ చేసి ఆ భూమిని స్వంతం చేసుకొనటానికి రామచంద్రారెడ్డి కుట్ర పన్నాడు. అందుకు 1944లో ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పాలకుర్తిలో జరిగిన సంఘం సభ అతనికి కలిసివచ్చిన అవకాశమైంది. తన జమీ గ్రామాలలో తిరుగుతూ రైతాంగాన్ని తనకు వ్యతిరేకంగా, తన అధికారానికి సవాల్‌గా తయారు చేస్తున్న ఆరుట్ల రామచంద్రారెడ్డిని చంపించటం, ఆ సభను భగం చేయటం లక్ష్యంగా విసునూరి రామచంద్రారెడ్డి పంపిన గుండాలు అక్కడికి వచ్చారు. అయితే ‘దొరవారి కుట్రలు కుతంత్రాలను జీవితంలో భాగంగా అనుభవిస్తున్న ఐలమ్మ భర్త, కొడుకులు ఆ విషయాన్ని ముందుగానే పసిగట్టి వేదికకు కాపలాగా నిలబడి, ఆరుట్ల రామచంద్రారెడ్డి మీద దాడికి లేస్తున్న వారిని నిరోధించగలిగారు. తరిమివేయగలిగారు’ అని భీమిరెడ్డి నర్సింహారెడ్డి చెప్తారు. గుండాల నాయకుడు ఓనమాల వెంకన్నను కొట్టి తరిమికొట్టిన ఈ ఘటనను సుంకర వాసిరెడ్డి ‘మా భూమి’ నాటకం నాలుగో అంకంలో దేశముఖ్ జగన్నాథ రెడ్డి, మస్తాన్‌ల మధ్య సంభాషణ నెపంగా నమోదు చేశారు కూడా.
ఆరుట్ల రామచంద్రారెడ్డి పై ఈ దాడి ఘటన వైఫల్య పరిణామాలు ఏమిటి? ఊళ్లోకి పోలీసులను దింపారు. ఐలమ్మ భర్త నర్సింహ, కొడుకులు సోమయ్య, లచ్చయ్యలతో సహా ఆరుట్ల రామచంద్రా రెడ్డి, గంగుల సాయిరెడ్డి మొదలైన మొత్తం పన్నెండు మంది మీద ఓనమాల వెంకన్నను హత్యచేయటానికి ప్రయత్నించినట్లు కేసు మోపి అరెస్టు చేశారు. హింసించారు. జైళ్లలో పెట్టారు. పాలకుర్తి కుట్రకేసుగా ఇది ప్రసిద్ధం. ఐలమ్మ భర్తను, ఇద్దరు కొడుకులను అరెస్టు చేయించి జైలులో పెట్టించిన విసునూరి రామచంద్రారెడ్డి ఒంటరిగా ఉన్న ఆమెను గుండాల నిత్య నిఘాలో భయాందోళనలకు లోను చేసి భూమి నుండి బయటకు పంపాలని అనుకొన్నాడు. అయితే సంఘం ఆదర్శాలను ఆచరించేవారి నైతిక ధైర్యం జారిపోకుండా నిలబెట్టటం మీదనే ఉద్యమ విస్తతి, కొనసాగింపు ఉన్నాయని తెలిసిన సంఘం నిర్ణయం ప్రకారం ఐలమ్మకు అండగా నిలబడటానికి భీమిరెడ్డి నరసింహారెడ్డి, చకిలం యాదగిరి రావు కొంతమంది స్వచ్ఛంద కార్యకర్తలతో కలిసి ఒకదళంగా ఏర్పడి పాలకుర్తి వెళ్లారు. వాళ్లు భూస్వామ్యవర్గపు దాడులను ఎదుర్కొనటానికి, ఆత్మరక్షణకు అవసరమవుతాయని కర్రలు పట్టుకొని పోయారని, వాళ్లతో పాటు అక్కడ జరిగే సంఘం సభల్లో పాడటానికి వెళ్లిన భీమిరెడ్డి నరసింహారెడ్డి చెల్లెలు మల్లు స్వరాజ్యం చెప్పారు. అలాగే ఐలమ్మకు కౌలుకు భూమి ఇచ్చిన ఉత్తమరాజు కొండలరావు అండ కూడా ఉన్నది అని గుర్తించి చెప్పింది. పాలకుర్తి అయినా, మల్లంపల్లి అయినా జనగామ తాలూకాకు చెందిన విసునూరి రామచంద్రారెడ్డి జమీ గ్రామాల్లోవే. పాలకుర్తిలో పెద్ద భూస్వామి అయిన నరసింహారెడ్డి కానీ, ఐలమ్మకు 40 ఎకరాలు కౌలుకు ఇయ్యగలిగిన ఉత్తమరాజు కొండల రావు కానీ అతని అధికార పరిధిలో వారే. అందువల్ల ఐలమ్మ భూమి విషయంలో అతని జోక్యాన్ని ప్రత్యక్షంగా వాళ్ళెవరూ నిరోధించలేకపోయారు. అయితే దేశముఖ్‌లతో తమకు ఉన్న వైరుధ్యాల పరిష్కారానికి సంఘాన్ని ఆహ్వానించటం స్థానిక భూస్వాములకు అనివార్యమైంది. ఉత్తమరాజు కొండలరావు ఐలమ్మకు అండగా నిలబడటంలో ఆ ప్రయోజనం ఉండే ఉంటుంది.
ఆ సమయంలో ఆంధ్రమహాసభ హత్యాయత్నం కేసులో నిర్బంధంలో ఉన్నవాళ్ళ కోసం న్యాయపోరాటం చేయటం, ఐలమ్మ పొలంలో పంట కోసుకొని పోవటానికి గుండాలను పంపి విసునూరి రామచంద్రారెడ్డి చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టటం అనే రెండు కార్యక్రమాలను తీసుకొని విజయం సాధించింది. చుట్టుపక్కల ఊళ్ళనుండి ఐలమ్మకు మద్దతుగా సంఘం కార్యకర్తలు వచ్చి నిలబడటం, భీమిరెడ్డి నరసింహారెడ్డి, కట్కూరి రామచంద్రారెడ్డి మొదలైనవాళ్లు స్వయంగా కోసిన పంట మూటలను వీపున మోసి ఐలమ్మ ఇంటికి చేర్చటం, అన్నిటికన్నా మిన్నగా శ్రమ ఫలితాన్ని దక్కించుకొనే తీరాలన్న పట్టుదలతో ఐలమ్మ నిలబడటం నల్లగొండ అంతటా భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు ఎక్కడికక్కడ రాజుకొని మండటానికి ఉత్ప్రేరకాలయ్యాయి. దేశముఖ్‌ల అధికారానికి, అహంకారానికి పెను సవాళ్ళై నిలిచాయి. తమ భూమి తాము నిలుపుకోవటం కోసం విసుసూరి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఐలమ్మ కుటుంబం ప్రారంభించిన పోరాటం నాలుగైదేండ్ల పాటు సాగింది. భర్త, కొడుకులు జైళ్ళకు వెడుతూ, విడుదలవుతూ కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ఐలమ్మ సంసారాన్ని నెట్టుకొస్తూ తనను తాను రక్షించుకొంటూ సంఘం కార్యకలాపాలకు మద్దతునిస్తూ సంఘం కోసం పనిచేస్తూ బతికింది. ఈ క్రమంలో ఇల్లు, వాకిళ్లు ధ్వంసం చేయ బడినా, పిల్లలు అవస్థల పాలైనా ఐలమ్మ వెనుకడుగు వేయలేదు. ఐలమ్మ ఉనికి, ఆమె భూమి సమస్య తెలంగాణా పోరాటాన్ని సాయుధ రైతాంగ పోరాటంగా పరిణమింప చేయటానికి రంగం సిద్ధం చేస్తే, దొరల గుండాల దోపిడీ దౌర్జన్యాలకు నిరసనగా కడివెండిలో 1946 జులై 4న జరిగిన ప్రజల ఆగ్రహ ప్రదర్శనపై విసునూరి గుండాలు జరిపిన కాల్పులకు దొడ్డి కొమురయ్య మరణించటం దాన్ని తక్షణ అవసరం చేసింది.
నిజాం రాజ్య పాలనకాలపు ఈ భూసంబంధాల వ్యవస్థ డెబ్భై అయిదేండ్ల స్వతంత్ర భారతంలో మరింత సంక్లిష్టంగా మారటం చూస్తాం. భూమి మీద వ్యవసాయం కోసం కాక, భూమి లోపలి ఖనిజాలతో వ్యాపారానికి ఈనాడు బహుళ జాతి కంపెనీలు, బడాపెట్టుబడి దారులు భూ బకాసురులయ్యారు. దేశీయ ప్రజాప్రభుత్వాలు విదేశీ పెట్టుబడులను ఆహ్వానించే సంబరంలో ఆ భూబకాసురుల పక్షం వహించాయి. ఈ పరిస్థితులలో ఆంధ్రా ఒడిషా సరి హద్దుల నుంచి మణిపూర్ వరకు దేశమంతటా భూమి కోసం, ఉనికి కోసం ఐలమ్మ వారసులు అనేక మంది ఆరాట పడుతున్నారు. పోరాటాల్లో ఉన్నారు. ఐలమ్మ కొనసాగుతున్న చరిత్ర. సెల్:9440550379
ప్రొ|| కాత్యాయని
విద్మహే