ఐలమ్మ యూనివర్సిటీని యూజీసీలో చేర్చాలి

Ailamma University should be included in UGC– మహిళా విశ్వవిద్యాలయం వద్ద విద్యార్థినుల ఆందోళన
నవతెలంగాణ -సుల్తాన్‌ బజార్‌
కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థినులు శనివారం కళాశాల మెయిన్‌ గేటు వద్ద పెద్దఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న కోఠి మహిళా కళాశాలను తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మహిళా యూనివర్సిటీగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంగా పేరు మార్చారని తెలిపారు. అయితే, తమకు తెలంగాణ మహిళా యూనివర్సిటీగా ఐడీ కార్డు ఇస్తున్నారని, ఇక సర్టిఫికెట్లలో ఎలా ఇస్తారో తెలియక గందరగోళంగా ఉందన్నారు. ఇంతవరకు యూజీసీలో చేర్చలేదని, తమ డిగ్రీ పూర్తి అవుతున్న నేపథ్యంలో తమకు ఏ ప్రాతిపదికన సర్టిఫికెట్‌ ఇస్తారని ప్రశ్నించారు. తమ భవిష్యత్‌ అయోమయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకొని యూజీసీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న వీసీ సూర్య ధనుంజరు అక్కడికి చేరుకొని విద్యార్థినులను సముదాయించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.