– ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా
– పలుచోట్ల ఐలమ్మ వర్దంతి కార్యక్రమాలు
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
బలహీన వర్గాలు, రైతుల కోసం వీరనారి ఐలమ్మ చేసిన పోరాటం అనిర్వచనీయమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ వర్థంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అధికారికంగా నిర్వహించారు. రిమ్స్ ఎదుట గల ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్, అధికారులు, రజక సంఘం నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐలమ్మ పోరాటలు, జీవిత చరిత్రను తెలియజేశారు. ఈ సందర్భంగా బీసీ సంఘం, రజక సంఘం నాయకులు పలు సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెత్తందారి వ్యవవస్థ, మహిళలపై లైంగిక దాడులు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. రైతులు, బలహీన వర్గాల కోసం ఐలమ్మ చేసిన పోరాట పటిమను ప్రతి ఒక్కరూ స్మరించాలన్నారు. వీరనారులు, వీరులను గుర్తించుకునేలా ప్రభుత్వాలు వారి జయంతి, వర్థంతులను అధికారంగా నిర్వహిస్తుందన్నారు. ప్రభుత్వం కూడా రైతుల పక్షాన ఉండి వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. రిమ్స్ ఎదుట విగ్రహం పక్కన దుకాణాలుండడంతో ఇబ్బందులవుతున్నాయని వాటిని తొలగించాలని రజక సంఘం నాయకులు విన్నవించారని, వాటిపై త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలదేవి, ఉట్నూర్ సబ్ కలెక్టర్ వికాస్ మర్మాట్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజలింగు, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, బీసీ సంఘం అధ్యక్షుడు చిక్కాల దత్తు, రజక సంఘం పట్టణ అధ్యక్షుడు సంతోష్, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొరంచు శ్రీకాంత్‌రెడ్డి, సామాజికవేత్త మౌనిష్‌రెడ్డి పాల్గొన్నారు.
లక్షెట్టిపేట : భూమి కోసం, భుక్తి కోసం, పీడిత జన విముక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో బీసీ సమాజం 52 శాతం రిజర్వేషన్ కోసం పోరాడాలని అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు తొగరు రాజు పేర్కొన్నారు. మంగళవారం అంబేద్కర్ యువజన సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్‌లో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ నైజాం సర్కార్ అండతో రెచ్చిపోయిన భూస్వాముల, దొరల పెత్తనాన్ని, దౌర్జన్యాలను, అరాచకాలను ఆమె ఎదిరించిందన్నారు. కుల, మతాలకతీతంగా మట్టి మనుషులుగా పోరాడి విజయం సాధించిన ధీర వనిత ఐలమ్మ అని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మతం రంగు పూస్తున్న నైజాం వారసులైన నేటి మతోన్మాదులకు బుద్ధి చెప్పాలన్నారు. చాకలి ఐలమ్మ పోరాట వారసత్వాన్ని మతవాదుల నుంచి కాపాడుకుందామన్నారు. భవిష్యత్ తరానికి చరిత్ర తెలిసేలా పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు దొంత నర్సయ్య, గౌరవ సలహాదారు గరిసే రవీందర్, ఉపాధ్యక్షుడు, కల్లేపల్లి విక్రమ్, మంచాల కుమార్, ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి రమేష్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ పాల్గొన్నారు.
తాండూర్ : ఐబిలో మంగళవారం ఐలమ్మ వర్ధంతిని నిర్వహించారు. రజక సంఘ నాయకులు, వివిధ పార్టీల నాయకులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘం డివిజన్ అధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దాగం రాజారాం మాట్లాడుతూ ఐలమ్మ అణిచివేతకు వ్యతిరేకంగా ఎదురు తిరిగిన వీర అని పేర్కొన్నారు. సామాన్యులకు జరిగే అన్యాయాలను, పెత్తనాన్ని, దోపిడీని ప్రతిఘటించిందని తెలిపారు. భూస్వాములు ఆమెపై తప్పుడు కేసులు బనాయించినా దొరలకు సవాల్ చేసి కోర్టులో కేసు గెలిచి చరిత్ర సృష్టించిందన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి సాంబయ్య, మండల అధ్యక్షులు వేమలకుర్తి భరత్, మల్లేష్, యువజన సంఘం నాయకులు తాండూరి నరేష్, వెంకటేష్, చంద్రగిరి విగేష్, రాజు, ఓరగంటి సాగర్, అరవింద్, సిరికొండ రాకేష్, వంశీ, ముడిపల్లి రమేష్ పాల్గొన్నారు.
బోథ్ : మండల కేంద్రంలో మంగళవారం వీరనారి ఐలమ్మ 39వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. రజక సంఘం సభ్యులు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్ర మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు చిల్కూరి భోజన్న, ఉపాధ్యక్షులు రమేష్, కోశాధికారి లోస్రం నరేష్, సంఘ నాయకులు కందుల గంగారాం, మంచికుంట లచ్చన్న, మంచికుంట సంతోష్, నరేష్, శ్రావణ్, సతీష్, మహేందర్, చిన్నయ్య, బండి నారాయణ, రమేష్ పాల్గొన్నారు.