చేతులు లేకున్నా గురి త‌ప్ప‌దు

Aim without handsశీతల్‌ దేవి… పరిచయం అవసరం లేని పేరు. తన కుడి కాలుతో విల్లును పైకెత్తి, కుడి భుజం సహకారంతో తీగను వెనక్కి లాగి, దవడ బలాన్ని ఉపయోగించి గురి పెట్టి బాణాన్ని వదులుతుంది. ఇటీవల పారిస్‌ పారాలింపిక్స్‌లో తన ప్రదర్శనతో కోట్లాది మంది గుండెల్లో చోటు సంపాదించుకుంది. రెండు చేతులు లేకపోయినా ఆత్మవిశ్వాసంతో కాళ్లతో బాణాలు సంధించి విశ్వక్రీడల్లో పతకం సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
ఇటీవలె ముగిసిన పారాలింపిక్స్‌కు వెళ్లక ముందు ‘స్వర్ణం గెలవాలనే స్ఫూర్తితో ఉన్నా. నేను గెలిచిన పతకాలను చూసినప్పుడల్లా మరిన్ని గెలవాలనే స్ఫూర్తి కలుగుతుంది. నేను గెలవడం ఇప్పుడే మొదలుపెట్టాను’ అని ఆమె అన్నారు. ‘శీతల్‌ విలువిద్యను ఎంచుకోలేదు, విలువిద్యే ఆమెను ఎంచుకుంది’ అని శీతల్‌ ఇద్దరు జాతీయ కోచ్‌లలో ఒకరైన అభిలాష చౌదరి చెప్పారు.
చేతులు లేకుండా పుట్టినా…
జమ్ము కాశ్మీర్‌లోని కిష్త్వార్‌ జిల్లాలో 2007, జనవరి 10న పుట్టింది శీతల్‌. పుట్టుకతోనే ఫోకోమెలియా అనే అరుదైన రుగ్మతతో పుట్టింది. అంటే రెండు చేతులు లేకుండానే పుట్టింది. ఓ చిన్న గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన శీతల్‌ 15 ఏండ్లు వచ్చే వరకు విల్లు, బాణం పట్టలేదు. 2019లో కిష్ట్వార్‌లో జరిగిన ఓ యువ కార్యక్రమానికి ఆమె హాజరయ్యింది. అక్కడ భారత సైన్యానికి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్‌ యూనిట్స్‌చే ఆమె గుర్తించబడింది. ఫలితంగా ఆమె విద్యా, వైద్యానికి సైన్యం సహాయం అందించింది.
కాళ్లతోనే బాణం ఎక్కుపెట్టి
తెలిసిన వ్యక్తి సూచన మేరకు 2022లో ఆమె ఇంటికి దాదాపు 200 కి.మీ. దూరంలో ఉన్న కత్రాలోని మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం బోర్డ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ చూసేందుకు వెళ్లింది. ఆ తర్వాత శీతల్‌ జీవితం మారిపోయింది. అక్కడే ఆమె అభిలాష చౌదరి, మరో కోచ్‌ కుల్దీప్‌ వెద్వాన్‌లను కలుసుకున్నారు. శీతల్‌కు విలువిద్యను వెద్వాన్‌ పరిచయం చేశారు. శీతల్‌ వెంటనే కత్రా నగరంలోని శిక్షణ శిబిరానికి వెళ్లింది. ఆమె సంకల్పానికి కోచ్‌లు ఆశ్చర్యపోయ్యారు. శీతల్‌ కాళ్లు,శరీరం పైభాగంలోని బలాన్ని ఉపయోగించి బాణం సంధించడంపై కోచ్‌లు దృష్టి పెట్టారు. చివరికి విజయం సాధించారు.
ప్రయాణం ఇలా సాగింది
కోచ్‌లు మొదట ఆమెకు ప్రోస్తెటిక్స్‌(కృత్రిమ చెయ్యి)తో సహాయం చేయాలనుకున్నారు. అయితే ఆమె విషయంలో ఇది సాధ్యం కాదని వైద్యులు చెప్పారు. శీతల్‌కు తన కాళ్లను ఉపయోగించి చెట్లను ఎక్కడ ఎంతో ఇష్టమని తెలుసుకున్నారు. స్నేహితులతో కలిసి పాదాలతో రాయడం, చెట్లను ఎక్కడం వంటివి సాధన చేయడం వల్ల ఆమె పాదాలు ఎంతో బలంగా తయారయ్యాయి. కోచ్‌లకు ఇంతకు ముందు అవయవాలు లేని వ్యక్తికి విలువిద్యలో శిక్షణ ఇచ్చిన అనుభవం లేదు. అయినప్పటికీ మాట్‌ స్టట్జ్‌మాన్‌ గురించి కొంత పరిశోధన చేసి విలువిద్య కోసం కాళ్లను ఉపయోగించడంలో శిక్షణ ఇచ్చారు. అయితే ఆమెకు కొన్ని సందేహాలూ వచ్చాయి. ‘ఇది నాకు అసాధ్యం అనుకున్నా. నా కాళ్లలో నొప్పిగా ఉండేది, అయినా ప్రయత్నించాను’ అని ఆమె పంచుకున్నారు. అమెరికన్‌ ఆర్చర్‌ ‘మాట్‌ స్టట్జ్‌మాన్‌’ నుంచి శీతల్‌ ప్రేరణ పొందింది. ఆయన కస్టమైజ్‌ పరికరాన్ని ఉపయోగించి పాదాలతోనే గురిపెడతారు. శీతల్‌ కుటుంబం ఇలాంటి మెషీన్‌ కొనలేకపోయింది. దీంతో శీతల్‌ కోసం విల్లు తయారుచేసే బాధ్యత కోచ్‌ వెద్వాన్‌ తీసుకున్నారు. స్థానికంగా లభించే మెటీరియల్‌తో అక్కడే ఆమె శరీరానికి అనుగుణంగా దాన్ని తయారు చేయించారు. ఇందులో శరీరం పైభాగాన బిగించడానికి ఒక పట్టీ, బాణాన్ని వదలడంలో సాయపడేలా శీతల్‌ నోటితో పట్టుకోవడానికి ఒక చిన్న పరికరం ఉన్నాయి.
ఇద్దరు కోచ్‌లతో కలిసి
స్థిరమైన విలువిద్య టెక్నిక్‌ కోసం శీతల్‌ కేవలం తన కాళ్లను మాత్రమే ఉపయోగించకుండా మరో మార్గాన్ని కనుగొనడం కోచ్‌లకు ప్రధాన సవాలు. ‘శీతల్‌కు బలమైన కాళ్లు ఉన్నాయి. కానీ షూట్‌ చేయడానికి ఆమె తన వీపును ఎలా ఉపయోగించవచ్చో మేం కనిపెట్టాలి’ అని అన్నారు. ఆమె కాళ్లలో బలాన్ని బ్యాలెన్స్‌ చేసి, దాన్ని టెక్నికల్‌గా ఉపయోగించడానికి ప్లాన్‌ చేసినట్లు అభిలాష వివరించారు. ఇద్దరు కోచ్‌లతో కలిసి శీతల్‌ రోజువారి శిక్షణ మొదలుపెట్టారు. శీతల్‌ విల్లుకు బదులుగా రబ్బరు బ్యాండ్‌ ఉపయోగించి కేవలం 5 మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను గురిపెట్టడంతో శిక్షణ ప్రారంభించారు. నాలుగు నెలల్లోనే శీతల్‌ నిజమైన విల్లును ఉపయోగించడం ప్రారంభించింది. 50 మీటర్ల దూరం (కాంపౌండ్‌ ఓపెన్‌ కేటగిరీ పోటీ ప్రమాణం)లో లక్ష్యాలపై బాణం ఎక్కుపెట్టింది. శిక్షణ ప్రారంభించిన 11 నెలలలోపే 2022 ఆసియా పారా గేమ్స్‌లో మహిళల సమ్మేళనం విల్లులో పాల్గొంది. భారతదేశానికి రెండు బంగారు పతకాలను తెచ్చింది.
రెండేళ్ల నుంచి ఇంటికెళ్లలేదు
శీతల్‌ 2023లో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచింది. ఆమె ఫైనల్‌లో ఆరు సార్లు 10 చొప్పున పాయింట్లు సాధించింది. ఆ పోటీలలో ఒక్క షాట్‌లో ఆర్చర్‌ సాధించే గరిష్ట పాయింట్ల సంఖ్య 10. ‘నేను తొమ్మిదికి షూట్‌ చేస్తే, తదుపరి షాట్‌లో దాన్ని పదికి ఎలా మార్చగలనని ఆలోచిస్తుంటాను’ అని శీతల్‌ చెప్పింది. ఆమె కష్టపడి ఇంత దూరం రావడమే కాదు. ఈ దారిలో శీతల్‌ చాలా త్యాగాలు చేసింది. శిక్షణ కోసం రెండేండ్ల కిందట కత్రాకు వచ్చానని, అప్పటి నుంచి ఒక్కసారి కూడా ఇంటికి వెళ్లలేదని ఆమె పంచుకుంది. పారాలింపిక్స్‌ పతకంతో తీసుకొనే తిరిగి వెళ్లాలని ఆమె నిర్ణయించుకుంది.
అత్యుత్తమ ప్రదర్శన
2024 సమ్మర్‌ పారాలింపిక్స్‌లో మహిళల పారా ఆర్చరీలో పోటీ పడిన అతిపిన్న వయస్కురాలు శీతల్‌. ఆమె ఎలిమినేట్‌ అయినప్పుడు ప్రేక్షకులు నిరాశ చెందారు. ఆ సమయంలో ఆమెకు 3,12,000 మంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లు ఉన్నారు. కానీ 2024 సమ్మర్‌ పారాలింపిక్స్‌లో రాకేష్‌ కుమార్‌తో కలిసి ఓపెన్‌ మిక్స్‌డ్‌ టీం కాంపౌండ్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకోవడం ద్వారా ఆమె ప్రేక్షకుల హృదయం గెలుచుకుంది. ‘నేను ఎవరికీ పరిమితులు ఉండవనుకుంటాను. నీకు కావాల్సింది కోరుకోవడం అంటే దాని కోసం కష్టపడటమే. నేను చేయగలిగినప్పుడు ఎవరైనా చేయగలరు’ అని ఆమె అంటుంది. 2023లో ఆమె ఆసియా పారాలింపిక్‌ కమిటీ నుండి ఉత్తమ యూత్‌ అథ్లెట్‌ అవార్డు, భారత ప్రభుత్వం నుండి అర్జున అవార్డును అందుకుంది.