నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఏడాదికి కేవలం 14 రకాల పంటలకే మద్దతు ధరలను ప్రకటించడంతో రైతులకు నిరాశ మిగిలిందని అఖిల భారత ప్రగతిశీల రైతుసంఘం (ఏఐపీకేఎస్) విమర్శించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాయల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో వంద రకాల పంటలుంటే, కేంద్రం 14 పంటలకే మద్దతు ధరను నామమాత్రంగా పెంచిందని విమర్శించారు. మోడీ రైతు పక్షపాతి అనీ, రైతు ఆదాయాన్ని పెంచేలా ఉన్నాయనీ, అందుకే ఈ మద్దతు ధరలను ప్రకటిస్తున్నామంటూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించడం సమంజసంగా లేదని తెలిపారు. రైతు పెట్టుబడికి వడ్డీ, రైతు కుటుంబ శ్రమను కూడా పరిగణనలోకి తీసుకుని మద్దతు ధరలను నిర్ణయించాలని సూచించారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు భిన్నంగా ఈ విధానం ఉందని పేర్కొన్నారు. ఆ కమిషన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.