100 విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చిన ఎయిరిండియా

నవతెలంగాణ – హైదరాబాద్: టాటా గ్రూప్ కంపెనీకి చెందిన విమానయాన సంస్థ ఎయిర్ఇండియా ప్రపంచ వ్యాప్తంగా తమ కార్యకలాపాలను మరింత విస్తరించే పనిలో ఉంది. అందులో భాగంగా యూరప్కు చెందిన విమాన తయారీ కంపెనీ ఎయిర్‌బస్‌ నుంచి మరో 100 కొత్త విమానాలను ఆర్డర్ చేసినట్లు తెలిపింది. ఇందులో 90 నారో బాడీ A320 విమానాలు, 10 వైడ్ బాడీ A350 విమానాలు ఉన్నాయి. అలాగే విమానాల కొనుగోలుతో పాటు A350 విమాన విడిభాగాలు, మెయింటెనెన్స్ కోసం ఎయిర్‌బస్‌ తో ఒప్పందం కుదర్చుకున్నట్లు టాటా గ్రూప్ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా ఎయిరిండియా గత ఏడాది ఫిబ్రవరిలో 470 విమానాల కొనుగోలు కోసం ఆర్డర్ ఇచ్చింది. వీటిలో ఎయిర్‌బస్ నుండి 250, బోయింగ్ నుండి 220 విమానాలు ఉన్నాయి. ఈ ఆర్డర్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సింగిల్-ట్రాంచ్ ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలుగా చరిత్ర సృష్టించింది.