గగన విహారం.. గగనమే!

చిన్నతనంలో గాలిమోటర్‌ సౌండ్‌ వినగానే అదో ఆనందం. ఎగిరి గంతులేసేవాళ్లం. ప్రతి ఒక్కరికీ ఒక్కసారైనా గాలిమోటర్‌ ఎక్కాలనేది ఆశ ఉంటుంది. కానీ ఈ విషయం విన్నాక గగన విహరం పేదోడికి గగనమే అని చెప్పాలి. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దంపతులు వ్యక్తిగత విదేశీ (లండన్‌) పర్యటన నిమిత్తం బయలుదేరిన గాలిమోటర్‌ గురించి తెలుసుకున్న తర్వాత అది ఎక్కాలనే ఆశలు గల్లంతు కావడం మాత్రం ఖాయం! ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన గాలిమోటరు. అందులో ఎనిమిది పడకలు మాత్రమే ఉంటాయి. దానికి కిరాయి గంటకు అక్షరాల రూ.12 లక్షలు అంటే నమ్ముతారా? నేను కూడా ముందు నమ్మలే. గూగుల్‌లో పరిశీలిస్తే చెప్పిందంతా నిజమే. ముఖ్యమంత్రి ప్రయాణానికి కొంత డబ్బు ప్రభుత్వం భరించినప్పటికీ మిగతాది సొంతంగా పెట్టుకోవాల్సిందే. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిందేమిటంటే, ఈ వార్త ఏపీలో బాగా వైరల్‌ అవుతున్నది. ఎన్నికల్లో బిజీబిజీగా గడిపిన జగన్‌… ఫలితాలొచ్చే వరకు విశ్రాంతిగా గడపాలని విదేశీ టూర్‌కు పయనమయ్యారు. చాలామంది పేదింటి బిడ్డ గాలిమోటర్‌లో లండన్‌ పోతున్నారంటూ సైటైర్లు వేస్తున్నారు. పాలన గాలి కొదిలేసి గాలి మోటర్‌లో చెక్కర్లు కొడుతున్నారని కామెంట్లు పెడుతున్నారు. లండన్‌కు నేరుగా విమానాలు ఉంటాయి కదా.. లగ్జరీ విమానం బుక్‌ చేసుకుని పోవడం అవసరమా? అని అంటున్నారు. గాలిమోటర్‌కు పెట్టే ఖర్చు కూడు, గూడు లేని పేదోళ్లకు పెడితే మంచి గుండని అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ గాలిమోటర్‌ కథ విన్న తర్వాత గీ పైసలు లేని జీవితాన గాలిమోటర్‌ ఎక్కుడు నాతోనై కాదనిపించింది.
– గుడిగ రఘు