ముగిసిన ఎయిర్‌ పోర్ట్‌ మెట్రో టెండర్‌..

– రెండు అంతర్జాతీయ సంస్థలు బిడ్లు దాఖలు
నవతెలంగాణ-సిటీ బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎయిర్‌ పోర్టు టెండర్‌ గడువు ముగిసింది. ఇంజనీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్త్రక్షన్‌ (ఈపీసీ) విధానంలో నిర్మిస్తున్న ఎయిర్‌ పోర్టు మెట్రో పనులు చేపట్టేందుకు జూన్‌ 5 నుంచి జూలై 12వ తేదీ వరకు ఇచ్చిన గడువులో రెండు అంతర్జాతీయ సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్టు హెచ్‌ఏఎంఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణ రంగంలో పేరొందిన ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌సీసీ లిమిటెడ్‌ (నాగార్జున కంపెనీ) పోటీ పడ్డాయన్నారు. ఈ రెండు కంపెనీలు తమ సంస్థల డాక్యుమెంట్లు, అనుభవం, సాంకేతిక, ఆర్ధిక బలాలతో పాటు సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ 29 కోట్ల బ్యాంక్‌ గ్యారంటీలు సమర్పించినట్టు చెప్పారు. రెండు సంస్థల్లో దేనికి ఎక్కువ అనుభవం ఉందో, ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన అర్హతలు, మానవ వనరులు, నిర్మాణ పద్దతి, కన్‌స్ట్రక్షన్‌ షెడ్యూల్‌, డిజైన్‌తో పాటు వారు సమర్పించిన ఎయిర్‌పోర్టు నమూనాలను సిస్ట్రా, ఎల్‌ఈడీ సంస్థలకు చెందిన జనరల్‌ కన్‌సల్‌టెంట్ల నిపుణులతో పరిశీలిస్తామని, పది రోజుల అనంతరం అర్హత కలిగిన సంస్థ వివరాలను ప్రభుత్వానికి అందజేస్తామని ఎన్వీఎస్‌ రెడ్డి వివరించారు.