
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
గుండాల మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ 88వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి షేక్ షాహిద్ శనివారం జెండా ఆవిష్కరణ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలోని బెనారస్ విశ్వవిద్యాలయంలో ఆగస్టు12, 1936లో ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందన్నారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదుల పాలన నుంచి మాతృభూమి విముక్తి కై సాగిన వీరోచిత స్వాతంత్ర్య ఉద్యమంలో పొత్తిళ్లలోనే పిడికిళ్లు బిగించి స్వాతంత్ర్యము మా జన్మ హక్కు అని, మా అంతం చూసిన స్వాతంత్ర్యోద్యమ పంతం వీడం అంటూ నినదించి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని, భరతమాతను బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేయడానికి ఎందరో విద్యార్థులు విప్లవ కిషోరాలుగా మారి ప్రాణత్యాగం చేసి దేశంలోనే ఘనమైన చరిత్ర కలిగిన ఏకైక విద్యార్ధి సంఘం ఏఐఎస్ఎఫ్ అని వ్యాఖ్యానించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ 87 వసంతాలు పూర్తిచేసుకుని 88వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా విద్యార్థినులకు మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి గంగదరి వినయ్, పవన్ కళ్యాణ్, యశ్వంత్, నసీర్, విద్యార్థినులు పాల్గొన్నారు.