బహుముఖ ప్రజ్ఞాశాలి ఏ.జీ.నూరానీ

The versatile AG Nooraniన్యాయ నిపుణుడు, స్కాలర్‌ అయిన అబ్దుల్‌ గఫూర్‌ నూరానీ, ఏ.జీ.నూరానీగా ఏడు దశాబ్దాలకు పైగా ఆయన వ్యాసాలు, పుస్తకాలు పాఠకులకు సుపరిచితం. 94 ఏళ్ల వయసులో ఆగస్ట్‌ 29న ఆయన ముంబైలో మరణించాడు. ఆయన మరణంతో, భారతదేశం ఒక నడుస్తున్న విజ్ఞాన సర్వస్వాన్ని (ఎన్సైక్లోపీడియా) కోల్పోయి నట్లయింది. తన మిత్రులకు గఫూర్‌గా సుపరిచితుడైన నూరానీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయినా ఇప్పటికీ దిగజారిపోతున్న ఆరోగ్య పరిస్థితి అనుమతించినంత వరకు ఆయన, సుప్రీంకోర్టు దారుణమైన బాబ్రీ మసీదు తీర్పుపై పనిచేస్తూనే ఉన్నాడు. మరణం ఆయన తలుపు తడుతుందని ఆయనకు తెలుసు కానీ తన రాతప్రతిని పూర్తి చేయడం ఆయనకు అవసరం. బహుశా పుస్తకం అసంపూర్తిగానే మిగిలిపోయింది. కానీ ఆయన, సమర్ధ వంతుడైన స్కాలర్‌, లేక ప్రచురణకర్త కోసం తగినంత పని వదిలి వెళ్లి ఉంటాడని ఆశిద్దాం.
స్వాతంత్య్ర భారతదేశం ఎంతో అత్యుత్తమ మేధావుల్ని తయారు చేసింది. కానీ వారిలో నూరానీ ప్రత్యేకమైన మేధావి: న్యాయ పండితుడు, రాజకీయ విశ్లేషకుడు, మానవ హక్కుల సమర్ధకుడు – అన్నీ ఒకే వ్యక్తిలో ఉన్నాయి. చైనా, పాకిస్థాన్‌లతో భారతదేశ సంబంధాలు, జమ్మూకాశ్మీర్‌ సమస్య, భారత రాజ్యాంగం, బ్రిటీష్‌ రాజ్యాంగ చరిత్ర, చట్టం యొక్క శాస్త్రీయ అధ్యయనం, హైదరాబాద్‌, ఇస్లాం, మానవ హక్కులు, రాజకీయ పరీక్షలు, భారత స్వాతంత్య్ర పోరాటం, బాబ్రీ మసీదు, హిందూత్వపై ఆయన పుస్తకాలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలలో ప్రతిబింబించే ఆయన పాండిత్యం చాలా విస్తారమైనది. ఆయన, లార్డ్‌ డెన్నింగ్‌, ఇజ్రాయిల్‌ సుప్రీంకోర్టు జడ్జి వినోగ్రాడ్‌ లేదా భారతీయ న్యాయ వ్యవస్థ గురించి ఇంట్లోనే చర్చిస్తున్నాడు. ఆయన ప్రతీ పుస్తకం, సాధారణ పాఠ కులకు, స్కాలర్లకు విలువైన ఆధార గ్రంథాలుగా మారాయి. ఒక స్కాలర్‌గా గఫూర్‌ భారుకి కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ గురించి ఏమీ తెలి యదు. ఆయనకు టైప్‌ రైటర్‌ ఎలా ఉపయోగించాలో కూడా తెలిసేది కాదు. తన వ్యాసాలు మొత్తం చేతితోనే రాశాడు. ఆయన ప్రాథమిక పరిశోధనకు అవసరమైన విషయాలపై అనేక వార్తాపత్రికల కటింగ్స్‌ ఉన్నాయి. ఆయన ఈ అలవాటును 1940ల నుంచే పాఠశాల విద్యార్ధిగా అలవాటు చేసుకొని, దానిని కొన్ని దశాబ్దాల పాటు కొనసాగించాడు. ఆయన విస్తృతంగా అధ్యయనం చేసి, నోట్స్‌ తయారు చేసుకునేవాడు. సంస్థాగతంగా ఆయనకెలాంటి నేపథ్యం లేదు. బొంబాయిలోని నేపియన్‌ సీ రోడ్‌లో ఆయన పరిశోధనా అభిరుచి విస్తృతం కావడంతో ఆయన ఫ్లాట్‌ ఇరుకుగా మారింది. అందుకే ఉపయోగం లేదనుకున్న న్యాయ సంబంధిత పుస్తకాలను ఆయన వదిలేశాడు.
విదేశాంగ విధానం, కాశ్మీర్‌పై ఆయన వార్తాపత్రికల సరియైన సమాచారాన్ని కలిగి ఉండడం వల్ల, ప్రకటనలు, గెజిట్‌ నోటిఫికేషన్లకు సంబంధించిన అధికారిక పత్రాలను సేకరించడంలో అవిశ్రాంత కృషిచేశాడు. కొన్ని సందర్భాల్లో సౌత్‌ బ్లాక్‌లో ఆయన సునిశితత్వాన్ని గౌరవించిన అధికారులు, ఆయన కోరింది వెంటనే సమకూర్చే వారు. ఇరాన్‌ ప్రభుత్వం అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు ఇచ్చిన పత్రం గురించి ఒక వార్తను ప్రస్తావించినప్పుడు, ఆయన ఆ నిర్దిష్ట పత్రం మాత్రమే కాక దాని పూర్తి సమాచార సంబంధిత వివరాల కోసం ఢిల్లీలోని తన స్నేహితుడిని పీడించేవాడు. ఆగ్రాలో జరిగిన భారత్‌-పాకిస్థాన్‌ శిఖరాగ్ర సమావేశం విఫలం చెందిన తర్వాత అటల్‌ బిహారీ వాజపేయి, పర్వేజ్‌ ముషారఫ్‌ల మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన పూర్తి రికార్డును, రద్దు చేయబడిన ముసాయిదా డిక్లరేషన్‌ను సంపాదిం చడానికి ఆయన ఇస్లా మాబాద్‌ పర్యటించాడు. ఆయన చేసిన ప్రయ త్నాల వల్ల సాధించిన ఫలితాలు 2005 ‘ఫ్రంట్‌ లైన్‌’ పత్రికలో ప్రచురితమయ్యాయి. రచయితగా ఆయన చాలా సూటిగా, నైపుణ్యంగా ఉండేవాడు. ప్రాథమిక పత్రాలు, సాంప్రదాయ అధ్యయన పద్ధతులే కాకుండా ఆయన వ్యక్తిగత పరస్పర సంభాషణలను పరిశోధనా సాధనంగా ఉపయోగించాడు. ఆయన ఢిల్లీ పర్యటనలెప్పుడూ అధికారులు, దౌత్యవేత్తలు, జర్నలిస్టులు, స్కాలర్లతో ఒంటరి సమావేశాల్లో నిమగమయ్యే విధంగా ఉండేది షెడ్యూల్‌. ఆయన జమ్మూకాశ్మీర్‌కు తరచుగా పర్యటించేవాడు. ఆయనకు అక్కడ విస్తృతమైన పరిచయాలున్నాయి. పూర్వ రాష్ట్ర ప్రజల హక్కులను రక్షించేందుకు ఆయన ప్రదర్శించిన స్థిరత్వం వల్ల ఆయనను ఆ రాష్ట్ర ప్రజలు గౌరవించారు.
నూరానీ న్యాయవాదిగా శిక్షణ పొందిన తరువాత బొంబాయి హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పనిచేశాడు. అయితే వాస్తవం చెప్పాలంటే, ఆయన క్రియాశీలకంగా ఉన్న రోజుల్లో కూడా ఎక్కువ కేసుల్ని చేపట్టలేదు. కాలమిస్ట్‌గా, స్కాలర్‌గానే ఎక్కువగా పని చేశాడు. ఆయన న్యాయవాద వృత్తిని నిర్వహించే క్రమంలో, 1960లో షేక్‌ అబ్దుల్లాను నిర్బంధంలో ఉంచినపుడు ఆయనకు న్యాయ వాదిగా పనిచేశాడు. నూరానీ కూడా కొంత కాలం జైలు జీవితం గడిపాడు. ఆయన రాజ్యాంగ విరుద్ధత గురించి రాసినందుకు నిర్బంధ నిరోధక నిబంధనల ప్రకారం జైల్లో పెట్టారు. నాలుగు దశాబ్దాలకు పైగా నూరానీ పాత్రికేయ ప్రపంచానికి చాలా దగ్గరయ్యాడు. ఆయన ఫ్రాంక్‌ మోరేస్‌ నిర్వహణలోని ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ కోసం క్రమం తప్పకుండా రాశాడు. 1990ల చివరి వరకు సీ.ఆర్‌.ఇరానీ ‘ద స్టేట్స్‌మ్యాన్‌’లో నూరానీ వ్యాసాల్ని ప్రచురించాడు. గఫూర్‌ 1960ల నుండి బొంబాయి, ఢిల్లీ, చెన్నై, కలకత్తాలోని అగ్రశ్రేణి సంపాదకు లందరితోనూ కలిసిపోయాడు, చాలామందితో విభేదించాడు కూడా. మోరేస్‌, శ్యామ్‌లాల్‌, లిండ్సే ఎమర్సన్‌, గిరిలాల్‌ జైన్‌, ఎస్‌.ముల్గావ్కర్‌, కుల్దీప్‌ నయ్యర్‌, ఇందర్‌ మల్హోత్రా, హిరణ్మరు కర్లేకర్‌, సయీద్‌ నక్వీ, ప్రేమ్‌ శంకర్‌ ఝా, ఎస్‌.నీహాల్‌ సింగ్‌, దినా వకీల్‌, ఎన్‌.రామ్‌, కుష్వంత్‌ సింగ్‌, దిలీప్‌ పడ్గాంకర్‌ లాంటి వారిలో చాలామందితో ప్రేమ పూర్వక, లేక ద్వేషపూరిత సంబంధాల్ని కొనసాగించాడు. కొన్నింటిలో ఆయన మారుపేర్లు కలిగి ఉన్నాడు. చాలా దశాబ్దాల అనంతరం వాటి గురించి మాట్లాడినప్పుడు వాటిని ఉపయోగిం చడంలో ఆయన చాలా ఆనందంగా ఉండేవాడు.
బహుశా 1997 ఆ ప్రాంతంలో యునైటెడ్‌ నేషన్స్‌ కన్వెన్షన్‌ ఎగెస్ట్‌ టార్చర్‌పై ప్రెస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన ఒక వర్క్‌ షాప్‌లో నేను మొదటిసారిగా నూరానీని కలిశాను. 1993లో అప్పుడు ఆక్స్‌ ఫర్డ్‌లో లా లెక్చరర్‌గా పనిచేస్తున్న నా సోదరుడు ఒక ఫ్రెంచ్‌ ఎన్జీవో, ఎఫ్‌ఐడీహెచ్‌ కోసం తయారు చేసిన కాశ్మీర్‌లో మానవ హక్కు ల ఉల్లంఘన నివే దికను నూరానీ ప్రశంసించాడు, అందుకే ఆయన నాతో చాలా స్నేహపూర్వకంగా ఉన్నాడు. ఆ తరువాత కాలంలో ఆయన తరచుగా ఢిల్లీ సందర్శించిన సందర్భాల్లో మా స్నేహం మరింతగా పెరిగింది. నేను ఆయనలో చూసిన మరోకోణం, ఆయనకు ఆహారం పట్ల మక్కువ ఎక్కువ.
పాత ఢిల్లీలో కబాబ్చీ లేక కొర్మా కోసం ఆయనతో ఎక్కువసార్లు వెతికే అదృష్టం నాకు దక్కింది. ఆయన ఢిల్లీ సందర్శనకు ముందు ఎక్కడో సందుగొందుల్లో మేము కనుగొనాల్సిన ‘రెస్టారెంట్‌’ పేరుతో ఒక చిన్న చీటిని అందించేవాడు. అప్పుడు మేము జమా మసీదు, లేక నిజాముద్దీన్‌ వైపు నా అంబాసిడర్‌ కారులో బయల్దేరే వాళ్లం. గఫూర్‌ ఎప్పుడూ నిష్కళంకమైన దుస్తులు ధరించేవాడు. ఒకసారి ఆయన ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌లోని తన గదినుండి దిగి, వాతావరణం చాలా చల్లగా ఉందని గ్రహించి, మళ్లీ తన గదిలోకి వెళ్లి, కోటు, టై ధరించి తిరిగి వచ్చాడు. టై ఎందుకని నేనడిగితే మొరటోడు మాత్రమే టై లేకుండా కోటు ధరిస్తాడని సమాధానం ఇచ్చాడు. మేము ఉర్దూ బజార్‌ దగ్గర దిగి, ఎవరో ఒక వ్యక్తి గఫూర్‌కు చెప్పిన గోలా కబాబ్‌లను వెతకడం మొదలుపెట్టిన తర్వాత ఆయన టై అందరి దృష్టిని ఆకర్షించడంతో అందరూ మా వైపు చూశారు. ఆయన చిన్నచిన్న దాబాల వద్ద ఆగి, వారు వండిన మాంసాహారం నాణ్యతను నిర్ధారించేందుకు కుండలను చూడాలని పట్టుపట్టేవాడు. వయసు మీద పడిన తరువాత, ఆయన రావడం తగ్గింది, ఇలాంటి సాహసకార్యాలకు పూనుకోవడం కూడా కష్టంగా మారింది.
నూరానీకి దృఢమైన ఇష్టాలు, అయిష్టాలున్నాయి. ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో 38వ నంబర్‌ గదిలో మాత్రమే ఉండేవాడు. ఆయన భోజనం కోసం మిమ్మల్ని కలుస్తుంటే, ఏ ఒక్కరినీ కనీసం పరిచయస్తుల్ని కూడా కూర్చున్న టేబుల్‌ వద్దకు ఒక్క క్షణం కూడా తిరగడానికి అనుమతించేవాడు కాదు. ఆయన ఎలాంటి చెడు ప్రవర్తన, అసంబద్ధతల పట్ల తక్కువ సహనం కలిగి ఉండేవాడు. హద్దులు దాటిన వారెవరైనా, వారిని తన జీవితం నుండి శాశ్వతంగా దూరం చేసేవాడు. వారిలో కొంతమంది జర్నలిస్టులు, స్కాలర్లు నాకు తెలుసు. ఒకరి తరపున నేను మధ్య వర్తిత్వం వహించి, ఫలానా వ్యక్తి నిన్ను కించపరచడానికి ఏమి చేశాడని ఆయనను నిరసించాను. వాస్తవమే, చెప్పిన విషయం దశాబ్దం క్రితం జరిగిందనే విషయం ఆయనకు తెలుసు, కానీ వివరాలేమీ గుర్తులేవు.
మరే ఇతర దేశంలోనైనా నూరానీ లాంటి ప్రజామేధావి ఒక గౌరవనీయమైన జాతీయ సంపదగా పరిగణించేవి. కానీ భారతదేశంలో ఆయన నిష్కళంక పదునైన మాటలు, ఆయన పదునైన కలం ఆయనకు అన్నివైపుల నుండి చాలామంది శత్రువులను తయారు చేశాయి. చివరికి గత రెండు సంవత్సరాల వరకు, అంటే ఆయన అనారోగ్యం పాలయ్యేవరకు ఆయన భారతదేశంలో ‘ఫ్రంట్‌ లైన్‌’ కు, పాకిస్థాన్‌లో ‘డాన్‌’ కు పరిమితమయ్యాడు.
ఆ తరువాత ఆయన రాయాలనుకున్న పుస్తకాల రచనకు తన శక్తిసామర్థ్యాలను ఉపయోగించాల్సి వచ్చింది. ఆయనతో జరిగిన కొన్ని సంభాషణల్లో, ఆయన పత్రాలకు, పుస్తకాలకు, ఢిల్లీలోని ఒక మంచి పరిశోధనా గ్రంథాలయంలో చోటు లభించాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఆయన నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ (ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎల్‌)ని సాధ్యపడే గమ్యంగా పేర్కొన్నాడు. కానీ అది ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎల్‌, పీఎంఎంఎల్‌గా మారడానికి ముందు. అది అనేక సందేహాస్పద సంఘాలు, ఆచరణలను సాధించింది.
(”ద వైర్‌” సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్‌, 9848412451
– సిద్ధార్ధ వరదరాజన్‌