అజింక్య ఆదుకున్నా..!

– రహానె, ఠాకూర్‌ అర్థ సెంచరీలు
– భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 296/10
-ఆసీస్‌ ప్రస్తుత ఆధిక్యం 296 పరుగులు
– ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌
అజింక్య రహానె (89) ఆపద్బాందవుడి పాత్ర పోషించినా.. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌ కష్టాల్లోనే కొనసాగుతుంది. శార్దుల్‌ ఠాకూర్‌ (51)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 109 పరుగులు జోడించిన రహానె భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో గౌరవప్రద స్కోరు అందించాడు. రహానె, ఠాకూర్‌ అర్థ సెంచరీలతో భారత్‌ 296 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 123తో కలిపి ఆస్ట్రేలియా ప్రస్తుత ఆధిక్యం 296 పరుగులు.
నవతెలంగాణ-కెన్నింగ్టన్‌
    ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతుంది. అజింక్య రహానె (89, 129 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌), శార్దుల్‌ ఠాకూర్‌ (51, 109 బంతుల్లో 6 ఫోర్లు) అర్థ సెంచరీలతో పోరాడినా భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకే కుప్పకూలింది. 173 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కించుకున్న ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు రాబడుతుంది. ఉస్మాన్‌ ఖవాజ (13), డెవిడ్‌ వార్నర్‌ (1), ట్రావిశ్‌ హెడ్‌ (18), స్టీవ్‌ స్మిత్‌ (34) నిష్క్రమించినా.. మార్నస్‌ లబుషేన్‌ (41 నాటౌట్‌, 118 బంతుల్లో 4 ఫోర్లు), కామరూన్‌ గ్రీన్‌ (7 నాటౌట్‌) అజేయంగా ఆడుతున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో 123/4తో ఆడుతున్న ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 296 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. దీంతో నేడు ఉదయం సెషన్‌ మ్యాచ్‌ ఫలితాన్ని శాసించే అవకాశం ఉంది.
ఆదుకున్న రహానె, ఠాకూర్‌ : ఓవర్‌నైట్‌ స్కోరు 151/5తో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌ ఆరంభంలోనే వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కె.ఎస్‌ భరత్‌ (5) వికెట్‌ కోల్పోయింది. ఓవర్‌నైట్‌ స్కోరుకు ఒక్క పరుగూ జోడించని భరత్‌ బొలాండ్‌కు బొల్తా పడ్డాడు. ఇక్కడ అజింక్య రహానెతో జతకట్టిన శార్దుల్‌ ఠాకూర్‌ భారత ఇన్నింగ్స్‌లో తొలి శతక భాగస్వామ్యం నమోదు చేశాడు. రహానె, శార్దూల్‌ జోడికి ఆసీస్‌ కంగారు ఫీల్డింగ్‌ సైతం ఉపయుక్తమైంది. బౌండరీల కోసమే ప్రయత్నించకుండా వికెట్ల మధ్య చురుగ్గా పరుగు తీశారు. స్ట్రయిక్‌రొటేషన్‌కు తోడు అప్పుడప్పుడూ బౌండరీలనూ పలకరించటంతో స్కోరు బోర్డుకు ముందుకు కదిలింది. ఓవల్‌ పిచ్‌పై సౌకర్యవంతంగా బ్యాటింగ్‌ చేసిన రహానె హుక్‌ షాట్‌తో సిక్సర్‌ బాది 92 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 22 ఓవర్ల పాటు సుమారు ఐదు రన్‌రేట్‌తో పరుగులు సాధించిన రహానె, శార్దుల్‌.. భారత్‌ను ఫాలోఆన్‌ ప్రమాదం నుంచి బయటపడేశారు. లంచ్‌ విరామ సమయానికి భారత్‌ 260/6తో మెరుగైన స్థితిలో నిలిచింది.
కానీ రెండో సెషన్లో కంగారూ పేసర్లు జోరందుకున్నారు. అజింక్య రహానె రెండో సెషన్లో పాట్‌ కమిన్స్‌కు చిక్కాడు. కెరీర్‌ 26వ అర్థ సెంచరీతో పాటు టెస్టుల్లో 5000 పరుగుల మైలురాయి అందుకున్న రహానె.. ఆ ఘనత సాధించిన 13వ భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇక, సహచర టెయిలెండర్లతో కలిసి శార్దుల్‌ ఠాకూర్‌ పోరాటం కొనసాగించాడు. ఆరు ఫోర్లతో 108 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన శార్దుల్‌ ఠాకూర్‌.. ఈ మైదానంలో వరుసగా మూడో అర్థ సెంచరీ సాధించాడు. ఆసీస్‌ దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌ రికార్డును శార్దుల్‌ ఠాకూర్‌ సమం చేశాడు. అర్థ సెంచరీ అనంతరం ఠాకూర్‌ నిష్క్రమించగా.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 296 పరుగుల వద్ద ముగిసింది. 69.4 ఓవర్లలోనే భారత్‌ పది వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఆసీస్‌ బౌలర్లలో కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ (3/83), బొలాండ్‌ (2/59), కామెరూన్‌ గ్రీన్‌ (2/44), స్టార్క్‌ (2/71) రాణించారు.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : 469/10
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : రోహిత్‌ (ఎల్బీ) కమిన్స్‌ 15, గిల్‌ (బి) బొలాండ్‌ 13, పుజార (బి) గ్రీన్‌ 14, కోహ్లి (సి) స్మిత్‌ (బి) స్టార్క్‌ 14, రహానె (సి) గ్రీన్‌ (బి) కమిన్స్‌ 89, జడేజా (సి) స్మిత్‌ (బి) లయాన్‌ 48, భరత్‌ (బి) బొలాండ్‌ 5, ఠాకూర్‌ (సి) అలెక్స్‌ (బి) గ్రీన్‌ 51, ఉమేశ్‌ (బి) కమిన్స్‌ 5, షమి (సి) అలెక్స్‌ (బి) స్టార్క్‌ 13, సిరాజ్‌ నాటౌట్‌ 0, ఎక్స్‌ట్రాలు : 29, మొత్తం :(69.4 ఓవర్లలో ఆలౌట్‌) 296.
వికెట్ల పతనం : 1-30, 2-30, 3-50, 4-71, 5-142, 6-152, 7-261, 8-271, 9-294, 10-296.
బౌలింగ్‌ : మిచెల్‌ స్టార్క్‌ 13.4-0-71-2, పాట్‌ కమిన్స్‌ 20-2-83-3, బొలాండ్‌ 20-6-59-2, కామెరూన్‌ గ్రీన్‌ 12-1-44-2, నాథన్‌ లయాన్‌ 4-0-19-1.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ : ఖవాజ (సి) భరత్‌ (బి) ఉమేశ్‌ 13, వార్నర్‌ (సి) భరత్‌ (బి) సిరాజ్‌ 1, లబుషేన్‌ నాటౌట్‌ 41, స్మిత్‌ (సి) ఠాకూర్‌ (బి) జడేజా 34, హెడ్‌ (సి,బి) జడేజా 18, గ్రీన్‌ నాటౌట్‌ 7, ఎక్స్‌ట్రాలు : 9, మొత్తం : (44 ఓవర్లలో 4 వికెట్లకు) 123.
వికెట్ల పతనం : 1-2, 2-24, 3-86, 4-111.
బౌలింగ్‌ : మహ్మద్‌ షమి 10-4-17-0, మహ్మద్‌ సిరాజ్‌ 12-2-41-1, శార్దుల్‌ ఠాకూర్‌ 6-1-13-0, ఉమేశ్‌ యాదవ్‌ 7-1-21-1, రవీంద్ర జడేజా 9-3-25-2.