– వీస్తున్న మార్పు పవనాలు
– అగ్రాలో జోరుగా సాగిన రాహుల్ యాత్ర
లక్నో : ఉత్తరప్రదేశ్ మార్పునకు సిద్ధమైందని, మార్పు పవనాలు వీస్తున్నా యని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆయన చేపట్టిన భారత్ జోడో న్యారు యాత్ర ఆదివారం నాడు ఉత్తరప్రదేశ్‌లోని అగ్రాలోకి ప్రవేశించింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత రాహుల్ యాత్రకు ఘన స్వాగతం పలికారు. యాత్రలో పాల్గొని మద్దతు తెలియజేశారు. తొలుత రాహుల్, అఖిలేశ్, కాంగ్రెస్ మరో నేత ప్రియాంక గాంధీ రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత రాహుల్, అఖిలేశ్, ప్రియాంక ముగ్గురూ జోడో యాత్రలో పాల్గొని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. యాత్ర అసాంతం ఉల్లాసంగా, ఉత్తేశంగా సాగింది. రాహుల్, అఖిలేశ్ సెల్ఫీ తీసుకుంటున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. సామాజిక మాధ్యమాల్లోనూ బిజెపిపై తనరీతిలో విమర్శలు గుప్పిస్తూ అఖిలేశ్ యాదవ్‌తో ఉన్న ఫొటోలను రాహుల్ పోస్టు చేశారు. ‘మార్పు పవనాలు వీస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్ మార్పునకు సిద్ధమైంది’ అని రాహుల్ పేర్కొన్నారు. అఖిలేశ్ కూడా సామాజిక మాధ్యమాల్లో భావోద్వేగరీతిలో స్పందించారు. ‘స్నేహాపూర్వక రథం ప్రేమతో నిండిన సామాజ్య్రాన్ని చేరుకున్న సమయంలో విద్వేష రాజకీయాలు సమాధి కావాల్సిందే’ అని ఆయన పేర్కొన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అన్ని పక్షాల లక్ష్యం ఒకటేనని, ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ఆ లక్ష్యమని అఖిలేశ్ అన్నారు. ప్రతిపక్షాల ఐక్య వేదిక ‘ఇండియా ఫోరం’ ప్రధాన కర్తవ్యం బీజేపీని ఓడించడం, అంబేద్కర్ కలలను సాకారం చేయడం అని పేర్కొన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో యుపిలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల సర్దుబాటు కుదిరిన నేపథ్యంలో రాహుల్ యాత్రలో అఖిలేశ్ భాగం కావడం విశేషం. యుపిలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 స్థానాల్లోనూ, 63 స్థానాల్లో సమాజ్‌వాదీ, ‘ఇండియా ఫోరం’లోని ఇతర పార్టీలు పోటీ చేయనున్నాయి. ఆగ్రాలో ప్రవేశించడానికి ముందు, రాహుల్ నేతృత్వంలోని జోడో న్యారు యాత్ర అలీగఢ్ డివిజన్ నుండి అమ్రోహా, సంభాల్, బులంద్‌షహర్, అలీగఢ్, హత్రాస్ మీదుగా సాగింది. ఈ ఏడాది జనవరి 14న మణిపూర్‌లో ప్రారంభమైన రాహుల్ యాత్ర వచ్చే మార్చి 20న ముంబయిలో ముగియనుంది.