
ఈనెల1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి, కార్మికులకు, అట్టడుగు వర్గ జాతులకు, విద్యార్థి లోకానికి తీరని నష్టం జరిగే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఈ బడ్జెట్ పూర్తిగా ప్రజావ్యతిరేక బడ్జెట్ అని యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ ఆరోపించారు. మండల కేంద్రంలో సోమవారం మాట్లాడారు దేశంలో 70 శాతం ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తుంటే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని దేశంలోని రైతాంగం మొత్తం ఢిల్లీ కేంద్రంగా ఉద్యమాలు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదన్నారు. వ్యవసాయ రంగానికి పూర్తిగా మొండి చెయ్యి చూపించి వ్యవసాయ సబ్సిడీలను పూర్తిగా ఎత్తి వేసే దిశగా, ఆహార భద్రతకు సంబంధించి అతి తక్కువ బడ్జెట్ కేటాయించారన్నారు. ఎరువుల సబ్సిడీని కూడా బడ్జెట్లో తగ్గించారని సంవత్సరానికి 12 లక్షల రూపాయలకి ఇన్కమ్ టాక్స్ ఎత్తివేయడం వల్ల సామాన్య పేద వర్గాలకు ఒరిగేదేమీ లేదని, కేవలం ఉన్నత వర్గాలకే ఈ బడ్జెట్ కేటాయించిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా, రాష్ట్ర కార్మిక, రైతులకు తీరని అన్యాయం చేశారన్నారు. విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలకు,పేదల అభ్యున్నతి కొరకు ఈ బడ్జెట్ లో అతి తక్కువ కేటాయించడం ఆ వర్గాలకు అన్యాయం చేసినట్టేనని తెలిపారు