అక్షర వాచస్పతి…దాశరథి

అక్షర వాచస్పతి...దాశరథి‘నేను కత్తీ, డాలూ పట్టుకోలేను. సాయుధుడనై ఎదిరించలేను. కానీ, నా పెన్నే నా గన్ను” అని చాటిన ఘనాపాటి దాశరథి. తెలుగు సాహితీ లోకంలో ఆయనొక అక్షర వాచస్పతి. ఓవైపు మార్క్స్‌ను అనుసరిస్తూనే మరోవైపు రామున్ని ఆరాధించిన మహాపండితుడు. భారతీయ తాత్విక మూలాలను తెలుగు ప్రజలకు పరిచయం చేసిన బహుభాషా కోవిదుడు. నిజాం నిరంకుశ పాలనపై పోరాడిన ధీరుడు. భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం నాటి అభ్యుదయ సమాజాన్ని తన రచనల ద్వారా సంఘటిత పరిచిన ఉద్యమ సూరీడు.. ఆయనే దాశరథి రంగా చార్యులు. ”నా తెలంగాణ కోటి రతనాల వీణ” అంటూ నినదించిన దాశరథి కృష్ణమా చార్యులు, రంగా చార్యులకు స్వయాన అన్న. తెలంగాణ వేదనను, వీరత్వాన్ని దాశరథి సోదరులు స్వయంగా అనుభవించి సాహిత్య వినీలకాశంలో విహరించారు. రంగాచార్యులు తన రచనల ద్వారా ప్రజల్ని మేల్కొల్పడానికి, అన్యాయాన్ని ఎదిరించేలా పురిగొల్పడానికి ఇష్టపడేవారు. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆయన రచనలు ఎంతగానో దోహదపడ్డాయి. లక్ష్యశుద్థితో రచనలు కొనసాగాయి. దాశరథి సాహితీ సేవ విలక్షణమైనది, విస్తృతమైనది, విభిన్నమైనది. రంగాచార్య రచనలు భావోద్రేకాలు రగిలించేకన్నా, భావోద్వేగాలు కలిగిస్తాయి.
సంప్రదాయ పునాదుల మీద ఆకాశమంత ఎత్తుగా ఎదిగిన అభ్యుదయ సారస్వత గోపురం దాశరథి సాహిత్యం.తన నలభై ఏండ్ల జీవితంలో అక్షర ప్రస్థానం ప్రారంభించి ఎన్నో నవలలు గ్రంథాలు, కవితలు, వ్యాస సంకలనాలు రాసిన దాశరథి మహబూబాబాద్‌ జిల్లాలోని చిన్నగూడూరు గ్రామంలో సాంప్రదాయ బ్రాహ్మణ వైదిక కులంలో 24 ఆగస్టు1928లో జన్మించారు. పన్నెండేండ్ల్ల వయసులోనే పోరుబాట పట్టారు. భారత స్వాతంత్య్ర ఉద్యమం, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. దేశ్‌ముఖ్‌లు, మక్తాదారులు, పటేళ్లు, పట్వారీలు, మాల్‌ పటేళ్లు తెలంగాణ పల్లెల్లో ప్రజలపై జరిపిన అరాచకాలను కండ్లకు కట్టినట్లు చెప్పేందుకే ఆయన రచనలు చేశారు. ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో అన్న కృష్ణమాచార్య నేరుగా సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. నిజాం నిరంకుశత్వం ఆయన్ను జైల్లో నిర్భంధించగా ఆ ఉద్యమ ప్రభావం కుటుంబం మొత్తమ్మీద పడింది. దీంతో రంగాచార్య లైబ్రేరియన్‌గా పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. ఉద్యమ చివరి రోజుల్లో రజాకార్ల దాడులు పెరగడంతో రంగాచార్య కూడా అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మహా రచయిత వట్టికోట అల్వార్‌ స్వామి సాహిత్యం దాశరథి మీద తీవ్రమైన ప్రభావం చూపింది. రంగాచార్యుల రచనలది విశిష్ట పంథా. కవిత్వం కన్నా కథలు ప్రజల హృదయాలను నేరుగా తాకుతాయని ఆయన అభిప్రాయపడేవారు. అన్యాయాలను, ఆకృత్యాలను ఎదిరించడమే ఆయన రచనల ముఖ్య ఉద్దేశం. నిజాం పరిపాలనలోని అఘాయిత్యాల గురించి రంగాచార్య రాసిన సాహిత్యం ఒక దృఢమైన ఆశయంతో ముందుకు సాగింది. గ్రామీణ ప్రజల మట్టి బతుకులు ఆయన మనసును కదిలించేవి. గడుల్లోని దొరలు, మాల్‌ పటేళ్లు తనకు రాబంధులుగా కనిపించేవారు. తెలంగాణ సాయుధ పోరాటానికి ముందున్న స్థితిగతులు, నిజాంకాలం నాటి ప్రజల దుర్భర పరిస్థితులను దారుణమైన బానిస బతుకుల గురించి తను రాసిన ‘చిల్లర దేవుళ్ళు’ నవలలో అక్షరీకరించారు. ‘వేదం, జీవననాదం’ అంటూ మెప్పించారు. అమృతంగమయ మాధుర్యం చూపించారు. మాయజలతారుతో మైమరిపించారు. రానున్నది ఏది నిజం అంటూ ప్రశ్నించారు. అప్పటి సమాజంలో ప్రజల బానిస బతుకుల స్థితిగతులను మోదుగుపూలు నవలలో కండ్లకు కట్టినట్లు చిత్రించారు.
తెలంగాణ జనజీవనం, నిజాంపాలన నాటి నిరంకుశత్వం తదానంతర రైతాంగ పోరాటం నాటి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాల నేపథ్యంలో దాశరథి రచనలు ఒక ప్రేరణగా నిలిచాయి. తెలంగాణ సమాజం తమ అస్తిత్వం కోసం, సాంస్కృతిక స్వేచ్ఛ కోసం, నీళ్లు, నిధులు, నియామకాల కోసం చేసిన తెలంగాణ మలి దశ పోరాటాన్ని ఆయన రచనలు ప్రభావితం చేశాయి. జనం భాషలో గుండెలను పలకరిస్తూ మెదళ్లను పదును పెడుతూ వీరు చేసిన రచనలు నేటితరానికి మార్గదర్శకాలుగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. బుద్ధుని జీవిత చరిత్రను ‘బుద్ధ భానుడు’ పేరుతో అపురూపమైన రచనను 2010 సంవత్సరంలో వెలువరించారు. రంగాచార్య నవలలు ఎక్కువగా రాసినా తెలుగు సాహిత్య ప్రక్రియల్లో కథా సాహిత్యం అంటే ఆయనకెంతో అభిమానం. ఆయన చేతి నుండి జాలు వారిన కథా సంపుటి ‘నల్లవాగు’. సమర సాహిత్యానికి చెందిన ‘రణరంగం’, ‘రణభేరి’, ‘జనరంగం’ వీరి రచనలే.
తొలుత కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితుడైన రంగాచార్య తదనంతర కాలంలో ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకున్నారు. అనంతర కాలంలో తెలుగు సాహిత్య చరిత్రలో తొలిసారిగా నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించి ‘అభినవ వ్యాసుని’గా ఖ్యాతిగాంచారు. వేదాలను అనువాదం చేయడానికి ముందు ఆయన తన కట్టుబొట్టును కూడా మార్చుకున్నారు. పంచె కట్టుకోవడం, చొక్కా వేసుకోకుండా శాలువా కప్పుకో వడం, నుదుట మూడునామాలు పెట్టుకోవ డం చాలామందిని ఆశ్చర్యపరిచాయి. ఆయన జీవితంలో వైవిధ్యమైన వేషధారణ అది. దీనికి ఆయన ‘మతం వ్యక్తిగతమైంది. మార్క్సిజానికి, నా వేషధారణకు, వేదాల అనువాదానికి మధ్య వైరుధ్యమేమీ లేదు” అంటూ నిక్కచ్చిగానే సమాధానమిచ్చారు. ఇరవయ్యవ శతాబ్దము సాహిత్యవనంలో మోదుగు పువ్వుగా నిలిచిన దాశరథి 2015 జూన్‌ 8న అస్తమించారు. మానవత్వమే లక్ష్యంగా, అక్షరమే ఆయుధంగా జనం కోసం పనిచేసిన ఆయన తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు తన రచనల ద్వారా ఎంతగానో కృషి చేశారు. సాహితీలోకంలో ఒక ధ్రువతారగా వెలుగొందారు.
(నేడు దాశరథి రంగాచార్య 96వ జయంతి)
అంకం నరేష్‌
6301650324