ఆసియా జట్టులో ఆకుల శ్రీజ

– పది మందితో జాతీయ జట్టు
– భారత టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య ప్రకటన
న్యూఢిల్లీ : తెలుగు తేజం, తెలంగాణ వర్థమాన స్టార్‌ ఆకుల శ్రీజ ఆసియా క్రీడల్లో పోటీపడనుంది. ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్స్‌లో పోటీపడే టేబుల్‌ టెన్నిస్‌ జట్టును భారత టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (టిటిఎఫ్‌ఐ) శుక్రవారం ప్రకటించింది. పది మందితో కూడిన భారత బృందానికి సీనియర్‌ ప్యాడ్లర్లు అచంట శరత్‌ కమల్‌, మనిక బత్రా సారథ్యం వహించనున్నారు. ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్స్‌ సెప్టెంబర్‌ 3-10 వరకు దక్షిణ కొరియాలో జరుగనుండగా.. ఆసియా క్రీడలు సెప్టెంబర్‌ 24-అక్టోబర్‌ 2 వరకు జరుగనున్నాయి. ఆసియా చాంపియన్‌షిప్స్‌లో వ్యక్తిగత విభాగంలో అందరూ పోటీపడవచ్చు. కానీ ఆసియా క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో ఇద్దరు మాత్రమే పోటీకి అర్హులు. వరుసగా రెండుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచి రికార్డు నెలకొల్పిన ఆకుల శ్రీజ.. జాతీయ సమాఖ్య సెలక్షన్‌ కమిటీ నుంచి ప్రమోషన్‌ దక్కించుకుంది. మహిళల విభాగంలో మనిక బత్రాతో పాటు ఆకుల శ్రీజ ఆసియా క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో పోటీపడనుంది. ఇక మెన్స్‌ విభాగంలో అచంట శరత్‌ కమల్‌, సతియన్‌లు బరిలో నిలువనున్నారు. డబుల్స్‌ విభాగంలో అచంట శరత్‌ కమల్‌, మనిక బత్రాలు సతియన్‌తో కలిసి వరుసగా మెన్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఈవెంట్లలో జోడీ కట్టనున్నారు. ఇతర విభాగాల్లో ఇప్పటికే జోడీలుగా రాణిస్తుండటంతో కాంబినేషన్లను కొనసాగించేందుకు కమల్‌, మనికలు డబుల్స్‌ విభాగాల్లో ఒక్క ఈవెంట్‌కే పరిమితం అయ్యారు. మహిళల డబుల్స్‌లో ఆకుల శ్రీజ, దియ జత కట్టనుండగా.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో హర్మీత్‌ దేశారుతో కలిసి శ్రీజ బరిలోకి దిగనుంది. ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్స్‌కు ఇద్దరు రిజర్వ్‌ ఆటగాళ్లను సైతం ఎంపిక చేశారు. తెలంగాణ ఆటగాడు ఎస్‌ఎఫ్‌ఆర్‌ స్నేహిత్‌, సానిల్‌ శెట్టి మెన్స్‌ విభాగంలో.. అర్చన కామత్‌, రీత్‌ రిశ్య మహిళల విభాగంలో రిజర్వ్‌ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు. కోచ్‌లుగా సుబజిత్‌ సాహా, మమత ప్రభులను ఎంపిక చేసినా.. త్వరలోనే విదేశీ కోచ్‌ నియామకంపై నిర్ణయం తీసుకోనున్నారు.
భారత టేబుల్‌ టెన్నిస్‌ జట్టు :
పురుషులు : అచంట శరత్‌ కమల్‌, జి. సతియన్‌, హర్మీత్‌ దేశారు, మానవ్‌ టక్కర్‌, మనుశ్‌ షా.
మహిళలు : మనిక బత్రా, ఆకుల శ్రీజ, సుతీర్థ ముఖర్జీ, అహిక ముఖర్జీ, దియ చిటాలె.