అయ్యో దానం..పాపం మల్లారెడ్డి

Danam Mallareddy– అప్పుల్లో దానం నాగేందర్‌
– కారు కూడా లేని మంత్రి మల్లారెడ్డి
–  ఎన్నికల అఫిడవిట్లో సిత్రాలే సిత్రాలు
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌
అబద్దాలు ఆడినా అతికినట్టుండాలే అని ఎనకటికి ఒక సామెత ఉంది. తిమ్మిని బమ్మిని చేయడంలో నాలుగాకులు ఎక్కువ చదివిన మన నేతలు అబద్దాలను నిజాలుగా నమ్మించడంలో ఘనాపాటీలు.. ప్రస్తుత ఎన్నికల్లో పోటీబడుతున్న అభ్యర్థుల అఫిడవిట్లు ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రోల్స్‌ రాయల్‌, మెర్సిడార్‌ బెంజ్‌, ఆడి లాంటి ఖరీదైన కారుల్లో తిరిగే నేతలు సైతం తమకేమీ లేదని ఎన్నికల్లో అఫిడవిట్లు దాఖలు చేస్తూ జనం చెవిలో పువ్వులు పెడుతున్నారు.
700 ఎకరాలున్నా కారు లేదంట..
ఒకనొక టైమ్‌లో పాలమ్మిన మంత్రి మల్లారెడ్డి నేడు కోట్లకు పడగలెత్తారు. ల్యాండ్‌ సెటిల్‌మెంట్ల నుంచి విద్యాసంస్థల వరకు ఈయన చేయని వ్యాపారం అంటూ లేదు. ఈ మధ్యన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్‌ దిప్రెస్‌ కార్యక్రమంలో ల్యాండ్‌ కబ్జాలకు సంబంధించి ఆయనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ.. ”తనకే 700 ఎకరాల భూమి ఉంది.. భూకబ్జాలు చేయాల్సిన అవసరం లేదు” అని కుండబద్దలు కొట్టారు.
హైదరాబాద్‌ చుట్టు పక్కల ఎకరా భూమి కనీసం రూ. కోటి నుంచి రూ.10 కోట్ల వరకు ధరలు పలుకుతున్నాయి. మంత్రి గారు చెప్పిన లెక్కల ప్రకారం చూసినా ఆస్తి విలువ ఎంతుంటుందో ఊహించు కోవచ్చు. తాజాగా ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో మాత్రం తనకు సొంతగా కారు కూడా లేదని చెప్పారు. రూ.90 కోట్ల స్థిరాస్థులు ఉన్నాయని పేర్కొన్నారు. అందులో రూ.38 కోట్లు భార్య కల్పన పేరున ఉన్నాయని తెలిపారు. అయితే, తన పేరున రూపాయి కూడా నగదు లేదని పేర్కొన్నారు. వందల కోట్ల భూములు తనకు ఉన్నాయని స్వయంగా ఒప్పుకున్న మంత్రిగారు అఫిడవిట్లో మాత్రం కనీసం కారు కూడా పేర్కొనడం కొసమెరుపు.
అప్పుల్లో దానం నాగేందర్‌
1994 నుంచి 2018 సాధారణ ఎన్నికల వరకు ఆసీఫ్‌నగర్‌, ఖైరతాబాద్‌ నియోజకవర్గాల నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర దానం నాగేందర్‌ది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి, అనంతరం రోశయ్య మంత్రివర్గాల్లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. నిత్యం ఖరీదైన కార్లు, విమానాల్లో ప్రయాణం చేసే కార్పొరేట్‌ మంత్రికి స్థిర చరాస్థుల కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. తన పేరున రూ.22 కోట్ల ఆస్తులుండగా, బ్యాంకులు, వివిధ సంస్థల్లో రూ.47 కోట్ల అప్పులున్నాయని తెలిపారు. భార్య అనిత పేరున ఉన్న స్థిర, చరాస్థులు సైతం తనుకు ఉన్న అప్పుల కంటే తక్కువగా ఉన్నాయని చెప్పడం గమనార్హం.