మాడ్రిడ్ (స్పెయిన్) : మట్టికోర్టు గ్రాండ్‌స్లామ్ రారాజు రఫెల్ నాదల్‌తో మట్టికోర్టు యువరాజు కార్లోస్ అల్కరాజ్ జతకట్టనున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో రికార్డు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించిన స్పెయిన్ బుల్ నాదల్‌తో కలిసి 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మెన్స్ డబుల్స్ టెన్నిస్ పసిడి వేట సాగించేందుకు కార్లోస్ అల్కరాజ్ సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు స్పెయిన్ టెన్నిస్ ఫెడరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఒలింపిక్స్‌లో నాదల్ 2008లో సింగిల్స్‌లో, 2016లో డబుల్స్‌లో పసిడి పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. సమ్మర్ ఒలింపిక్స్‌తో ప్రొఫెషనల్ కెరీర్‌కు ముగింపు పలికే ఆలోచనలో ఉన్న స్పెయిన్ బుల్ పారిస్‌లో పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు.