మద్య నిషేధమే మంచి ‘పథకం’!

Prohibition of alcohol is a good 'plan'!తెలంగాణలో వెలువడిన ఎన్నికల షెడ్యూల్‌తో రాజ కీయ వాతావరణం హీటెక్కింది. ఇక రాజకీయ పార్టీలు ప్రజ లకి అరచేతిలో స్వర్గం చూపెట్టబోతున్నాయి. నాయకుల ఎన్నికల వాగ్దానాలకి అడ్డూఅదుపూ, అంతూపొంతూ వుం డదు. కనీవినీ ఎరుగని హామీలతో ప్రజల్ని బుట్టలో వేసు కోవడానికి పోటీ పడుతుంటారు. వేల, లక్షల కోట్ల రూపా యల ఖర్చయ్యే వాగ్దానాలు చేస్తారు! నిజంగా ఆ వాగ్దానాలు అమలు చేస్తే వాటికి సొమ్ము ఎక్కడనించి తెస్తారు? వాళ్ళ పెద్దలు సంపాదించిన మూట ఏమైనా తీసుకొచ్చి పంచి పెడ తారా? వాళ్ళ ఇళ్ళలో దాచుకున్న డబ్బు ఏమైనా పంచు తారా? లక్షల కోట్ల రూపాయలు, వీళ్ళే దోచిపెట్టిన బడా పెట్టుబడిదారుల సొమ్ము ఏమైనా తెచ్చిస్తారా? విదేశీ బ్యాం కుల్లో మూలుగుతున్న మన భారతీయుల అపార సంపద ఏమైనా తెచ్చి పంచగలరా? అదంతా ఏమీకాదు. మన కార్మి కుల, కర్షకుల, శ్రామికుల అదనపు విలువనించి కొట్టేసిన సొమ్మూ, ఇంకా విపరీతంగా, వివిధ రూపాల్లో పన్నులు పెంచి ప్రజల్ని బిచ్చగాళ్ళుగా మారుస్తూ, వారిని చావకుండా వాళ్ళ నుంచి కొట్టేసిన సొమ్మునే దానాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. కుడిచేత్తో కాజేసి ఎడం చేత్తో విదిలించడం! పేదల కడుపుకొట్టి కొట్టేసే వాటిలో ప్రధానంగా మద్యం ద్వారా వచ్చే సొమ్మే సింహభాగం.
తెలంగాణ రాష్ట్రంలో 2022 – 23 ఏడాదిలో రూ.35,036 కోట్లు మద్యం ఆదాయం ప్రభుత్వ బొక్క సానికి చేరింది. ఒక్క రంగా రెడ్డి జిల్లాలోనే రూ.8410 కోట్లు, హైదరాబాద్‌ జిల్లాలో రూ. 3739 కోట్లు, నల్గొండ జిల్లాలో 3538 కోట్లు ఇలా ఏ జిల్లాలో కూడా మూడు వేల కోట్లకి తగ్గకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు నెలలో మద్యం దుకాణాల కేటాయింపుకి లాటరీ నిర్వహించింది. లాటరీ టిక్కెట్‌ ఎంతనుకుంటున్నారు? అక్షరాల రెండు లక్షల రూపాయలు! మొత్తం 2620 దుకాణాలకు 1,39,490 దరఖాస్తులు వచ్చాయి. ఆ షాపుల కేటాయింపునకి నిర్వ హించే లాటరీ ద్వారానే రూ.2639 కోట్లు ఆదాయమొ చ్చింది. హైదరాబాద్‌, సరూర్‌నగర్‌ ప్రాంతంలోని ఒక దుకా ణానికి 10,938 దరఖాస్తులు వచ్చాయంటే అతిశయోక్తి కాదు. ఆదుకాణం కేటాయింపునకు అన్ని లాటరీ టిక్కెట్లు అమ్ముడు పోయాయి. ఒక్కమద్యం సీసా కూడా అమ్మకుం డానే ఒక్క ఆ దుకాణానికి 218.16 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. శంషాబాద్‌లోని మరో దుకాణానికి 10,811 దరఖాస్తులు అమ్ముడయ్యాయి. సగటున ఒక్కో షాపుకి 50 దరఖాస్తులు వచ్చాయి. అంటే సగటున ఒక్కో షాపు మీద, ఒక్కసీసా కూడా అమ్మకుండానే కోటి రూపా యలు గవర్నమెంటుకి చేరాయి. ఇక లైసెన్స్‌ ఫీజు ఆ ప్రాంత జనాభాని బట్టి రూ.50 లక్షల నుంచి ఒక కోటీ పదిలక్షల వరకూ వుంటుందట! ఎంతెంత సొమ్ము! ఇదంతా ప్రజల రక్తం పిండి లాగడమే కదా! ఏపీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు తెలంగాణలో షాపులు దక్కించుకోవడానికి పోటీ పడ్డారట! ఒక ఎమ్మెల్యే ఒక్కషాపైనా దక్కకపోతుందా అనే వుద్దేశంతో రూ.3 కోట్లు వెచ్చించి 150 లాటరీ దరఖాస్తులు చేసాడట బినామీల పేరుతో! పాలకులకీ, నేతలకీ ప్రజలు ఎలా పోయినా పర్లేదు. వాళ్ళకి కావాల్సింది డబ్బు మూటలే! ప్రజల్లో మద్యం కలిగిస్తున్న కల్లోలం, కలవరం, అరాచకం, అత్యాచారాలు, హత్యాకాండలకి అంతేలేదు.
మద్యం మత్తులో భార్యని హత్య చేసిన భర్త, మద్యానికి డబ్బు ఇవ్వ లేదని కన్నతల్లిని కడతేర్చిన కొడుకు, మద్యానికి బానిసై కొడుకుని చంపిన తండ్రి! ఎన్నివార్తలు! ఇవిపైకి కనిపించే ఘటనలు. తాగుడువుండే ఇండ్లలో ఎప్పడూ నర కమే! తగాదాలూ, తన్నులాటలూ, కీచులాటలూ, గొడవలూ, కేకలూ, అరుపులూ, రంకెలూ, రచ్చరచ్చే నిత్యమూ! మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారినపడి ప్రతి రోజూ ఎంతమంది యువకులు మరణిస్తున్నారో! మద్యం కారణంగా కాలేయం, ఉదరం, జీర్ణకోశవ్యవస్థ పాడైపోయి, ప్రతి రోజూ ఎంతమంది యువకులు అకాల మత్యువాత పడుతున్నారో! ఇరవై ఏళ్ళ యువకులు కూడా ఇలాంటి సమ స్యలతో ఆస్పత్రులకు వస్తున్నారంటే, యువత పెడమార్గం పడుతున్నదనీ, చిన్న వయసులోనే ప్రమాదకరమైన మద్య వ్యసనాని కిలోనై ఆహూతైపోతున్నారనీ ఓ డాక్టరు నాతో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేసాడు. వేలమంది ఉసురుతీసి, వాళ్ళ కాపురాల్ని కూల్చి, ఆబిడ్డల్ని దిక్కులేని దీనుల్ని చేయటమా ప్రభుత్వం చేసే మేలు! మద్యం కారణం గా సమాజం ఎంత నాశనమై పోతోందీ, ఎంత పతనావస్థకి చేరుకుంటోంది!
ప్రజల జీవితాల్ని అల్లకల్లోలం చేసి, అనేక కాపురా ల్లోనూ, సంసారాల్లోనూ, జీవితాల్లోనూ నిప్పులు పోసి, చిచ్చు పెట్టి కొట్టేసిన సొమ్మునే సంక్షేమంపేరుతో తిరిగి పంచుతు న్నారు. తాగుడు రూపంలో ప్రజల రక్తమాంసాల్ని పీల్చడాన్ని సంక్షేమం అంటారా? ఇదేనా సంక్షేమం? మద్యం కారణంగా జరుగుతున్న దారుణాలూ, కుటుంబాలు చితికిపోవడం మీ కంటికి కనిపించవా? కుటుంబాల్ని సంక్షోభంలోనికి నెట్టేస్తూ సంక్షేమ జపమా? పాలకులు ప్రజల క్షేమాన్నీ, సంక్షేమాన్నీ, ప్రజల సుఖమయ జీవితాల్నీ కోరేవాళ్ళయితే తక్షణం మద్యం నిషేధించాలి. అంతకన్నా మంచి పథకం ప్రజలకు వేరే లేదు. అప్పుడు మాట్లాడాలి. కానీ అది జరుగు తుందా? పాలక వర్గాల స్వభావమే దోపిడీ! కాకుల్ని కొట్టి గద్దలకి వేయడం! రానున్నకాలంలో మద్యం వ్యాపారమూ, వ్యసనాలూ ఇంకా బాగా ఉధృతమవుతాయనడంలో సందే హమేమీ లేదు. ఇందుకు పెరుగుతున్న మద్యం అమ్మకాలే దష్ట్యాంతం. డబ్బు రుచి మరిగిన పాలకులు మద్యం నిషేధిం చడం అనేది కలలోని మాట! ప్రజల చేతిలోనే మద్య నిషేధం వుంది. ప్రజలు ఉద్యమిస్తేనే మద్యానికి ముగింపు.
– మొలకలపల్లి కోటేశ్వరరావు, 99892 24280