– రేడియల్ రోడ్ల భూ సమీకరణ వేగవంతం చేయండి
– డ్రై పోర్ట్, బందరు-కాకినాడ పోర్టుల అనుసంధానంపై అధ్యయనం చేయండి
– అటవీ ప్రాంతాల్లో నైట్ సఫారీలకు ప్రణాళిక రూపొందించండి : దక్షిణ భాగం సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగం అలైన్‌మెంట్ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం, రేడియల్ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్ట్‌ను సీ పోర్ట్‌కు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ రహదారిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నూతనంగా ఏర్పడనున్న ఫోర్త్ సిటీలో నెలకొల్పనున్న పరిశ్రమలు, వాటిలో పని చేసే అధికారులు, సిబ్బందికి విద్యా, వైద్యం ఇతర వసతులు అందుబాటులో ఉండేలా అలైన్‌మెంట్ ఉండాలని సూచించారు. గత వారం జరిగిన సమీక్షలో సూచించిన మార్పులపై ఆయన మరోసారి సమీక్షించి పలు సూచనలు చేశారు. నిర్దేశిత మార్పుల తర్వాత కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డ్రైపోర్ట్ నిర్మాణంలో మచిలీపట్నం, కాకినాడ రేవులను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. దూరంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ మార్గానికి సుముఖంగా ఉంది, తెలంగాణ ప్రయోజనాలకు ఏ విధంగా లబ్ది చేకూరుతుంది తదితర అంశాలపై అధ్యయనం చేశాకే గ్రీన్ ఫీల్డ్ హైవేకు రూపకల్పన చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్ అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. రైలు, జల మార్గంతో కూడిన ఇన్‌ల్యాండ్ వాటర్ వేలకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు తెలపగా, ఇప్పటి వరకు దేశంలో ఎక్కడైనా అలాంటిది ఉందా? సక్సెస్ రేట్ ఎలా ఉంది?తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఓఆర్‌ఆర్ -ఆర్‌ఆర్‌ఆర్ మధ్య రావిర్యాల నుంచి అమన్‌గల్ వరకు నిర్మించనున్న రహదారిలో మూడు చోట్ల ఉన్న అటవీ ప్రాంతాలను నైట్ సఫారీలుగా మార్చే అంశంపై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. అంతర్జాతీయ విమానాశ్రయం, నగరం, అటవీ ప్రాంతం సమీపంలోనే ఉండడం అరుదనీ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. బెంగళూర్‌లో జిందాల్ నేచర్ కేర్ పెట్టారనీ, మనకున్న అటవీ ప్రాంతం, అనుకూలతలు తెలియజేస్తే అటువంటివి ఎన్నో వస్తాయని అన్నారు. ఫోర్త్ సిటీలోని పరిశ్రమలకు అటవీ ప్రాంతాలను అనుసంధానిస్తే అభివృద్ధి వేగంగా జరగుతుందన్నారు. అమెరికాలో యాపిల్ పరిశ్రమ అక్కడి యాపిల్ తోటలోనే ఉన్న అంశాన్ని సీఎం ప్రస్తావించారు. ఈ సందర్భంగా రాచకొండ పరిధిలోని లోయలు, ప్రకృతి సౌందర్యం సినీ పరిశ్రమను ఆకర్షించడానికి ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు.
సానుభూతితో వ్యవహరించండి..
ఓఆర్‌ఆర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్ వరకు నిర్మించనున్న రేడియల్ రోడ్ల భూ సేకరణలో సానుభూతితో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. సాధ్యమైనంత ఎక్కువ పరిహారం ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పరంగా అదనంగా ఏవిధమైన సహాయం చేయగలమో ఆలోచించాలని పేర్కొన్నారు. భూ సేకరణ విషయంలో అన్ని శాఖల అధికారులు కలిసి పని చేయాలని సూచించారు. ప్రతి సమీక్షకు ప్రగతి కనపడాలనీ, లేకుంటే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడనని హెచ్చరించారు. సమీక్షలో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.