”తెల్లారింది లెగండోరు కొక్కరోకో…” అంటాడు ఓ కవి. నిద్రామత్తులో జోగుతున్న సమాజాన్ని మేల్కొల్పడానికి దండోరా చేతపట్టుకొని లేదా డమరుకం చేతపట్టుకొని గొంతు చించుకొని లేలేత ప్రభాత కిరాణాలు మీ కోసం వేచి చూస్తున్నాయి లేవండి ఆస్వాదించండి, మీ మీ కర్తవ్య నిర్వహణలో నిమగం కండి అంటూ సమాజాన్ని తట్టిలేపే ప్రయత్నం చేస్తుంటారు కొందరు. అలాంటి వారిలో ముందు వరసలో ఉంటారు కవులు. ఆ కోవకు చెందిన వారిలో అలిశెట్టి ప్రభాకర్ (12.1.1954 – 12.1.1993) కవిత్వం ముందు వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
బతికింది కొద్దికాలమే అయిన సమాజం అనే విశాలమైన ‘కాన్వాస్’ పై బలమైన సాహిత్య ముద్రను వేసి ‘తాను మరణించి జనులకి కవితనందించి’ అన్నట్లుగా జీవితకాలంలో తను చూసిన పరిస్థితులను, అనుభవించిన పేదరికాన్ని సమాజంలోని వైరుద్యాలను చూస్తూ ఓ వైపు వ్యాధి (క్షయ) ముదిరి చావుకి దగ్గరౌతున్నా అదరక చెదరక బెదరక కలాన్ని ముందుకు నడిపి కవితాసేధ్యం చేసిన కవికర్షకుడు అలిశెట్టి ప్రభాకర్. ఎర్ర పావురాలు (1978), మంటల జెండాలు, చురకలు (1979), రక్తరేఖ (1985), ఎన్నికల ఎండమావి (1989), సంక్షోభగీతం (1990), సిటీలైఫ్ (1992) మొదలైన కవిత్వ సంకలనాలు అచ్చువేసి తెలుగు సాహిత్యంపై తనదైన ముద్రను వేశాడు.
”ఒక నక్క/ ప్రమాణస్వీకారం చేసిందట/ ఇంకెవర్నీ మోసగించనని/ ఒక పులి/ పశ్చాత్తాపం ప్రకటించిందట/ తోటి జంతువుల్ని సంహరించినందుకు/ ఈ కట్టుకథ విని/ గొర్రెలింకా/ పుర్రెలూపుతూనే ఉన్నారు”
నేటి రాజకీయ నాయకులకు వర్తించే అక్షర సత్యాలు పై వాక్యాలు అమాయకత్వం, అజ్ఞానం వున్నచోట తెలివి కలవాడే అజమాయిషీ చేస్తాడు అనేదానికి నిదర్శనంగా ఈ కవితను ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రముఖ రాజనీతి తత్వ్తవేత్త హెర్బర్ట్ స్పెన్సర్ ‘బలవంతుడిదే రాజ్యం’ అన్నట్లుగా బలహీనుడు ఎప్పుడు బలవంతుడి చెప్పు చేతల్లోనే అనిగిమనిగి ఉండడం, అధికారం మరియు అంగబలం ధనవంతులకే అనుకూలంగా ఉండటం వాస్తవమే కదా! ఎన్నికల తంతు వస్తే చాలు లేనిపోని హామీలు వాగ్ధానాలు గుమ్మరించి ప్రజల్ని ‘గొర్రెల్ని’ చేసి అధికారంలోకి వచ్చాక, ఇచ్చిన హామీలు తుంగలో తొక్కటం అమాయకులైన ప్రజలు ఇంకా పాలకులపై ఆశలు పెట్టుకోవడం వారి అవివేకానికి నిదర్శనం. ఈ వాక్యాలు నేటి రాజకీయ నాయకులకు, దేశంలోని ప్రస్తుత పరిస్థితులకు ప్రతిబింబాలు.
”బలవంతంగా/ విద్యార్ధుల్ని/ పుస్తకాలకి/ శిలువేసి/ సంవత్సరాల/ మేకులు/ దిగేసి/ వొదిలేస్తే/ ఈ విద్యా వ్యాపార వ్యవస్థలో/ నెత్తురోడుతూ/ యింకెందరు నిరుద్యోగ క్రీస్తులో”
నేటి నిరుద్యోగ వ్యవస్థకు సజీవ సాక్ష్యాలు. విద్యా వ్యవస్థ వ్యాపారమైన తర్వాత విద్యా విలువలు పూర్తిగా నశింపబడ్డాయి అనడానికి ఈ వాక్యాలను కోట్ చేయవచ్చు ఎవరైనా. ఈ కాలం పిల్లలకు పుస్తక జ్ఞానం తప్ప, లోక జ్ఞానం, ప్రాపంచిక విషయాలపట్ల అవగాహన అంతంత మాత్రమే కలిగి ఉంటున్నారనేది నా అభిప్రాయం. అందుకే కేవలం పుస్తక జ్ఞానము మాత్రమే ఉపాధి కల్పించలేదు. ఇతర పరిజ్ఞానం కూడా అవసరానికి పనికి వస్తుందనేది ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం. పిల్లల్ని కేవలం పుస్తకాల పురుగులుగా తయారుచేసి సమాజానికి పనికిరాని వస్తువులుగా మిగల్చడం అనేది బాధ కల్గించే విషయమే. ఈ కాలపు చదువులు దేనికి ఉపయోగపడుతున్నాయనేది అసలైన ప్రశ్న. చదువుతున్న విద్యార్ధి నిరంతర ప్రవాహం వలె చైతన్యశీలిగా ఉండాలి. అలానే గోడకు కొట్టిన మేకులా కాకుండా సామాజిక స్పృహ, సామాజిక స్పందన కూడా కల్గి ఉండాలి.
”ఓ ఆడదాని కళ్ళు తవ్వేశా/ కన్నీటి శిథిలాలు బయల్పడ్డాయి/ ఓ దౌర్భాగ్యుడి పొట్టలో ప్రవేశించా/ పేగులు నాగుబాముల్లా బుసలు కొట్టాయి/ ఓ చిన్నారి హృదయాన్ని స్పృశించా/ వాని తల్లి శిలావిగ్రహమే బ్రద్దలైంది/”
ప్రస్తుత వర్తమాన సమాజానికి దర్పణం ఈ వాక్యాలు. ప్రస్తుతం దేశంలో నలుదిక్కులా మహిళలపై జరుగుతున్న లైంగికపరమైన హింస రోజురోజుకి మితిమీరిపోతుంది. స్త్రీని దేవతగా పూజించిన సంస్కృతి మనది. అలాంటి ఆచార సాంప్రదాయాలు పాటించే మన సంస్కృతిలో స్త్రీలను వేధించటం నిత్యం చూస్తున్న తంతే. ఇక ప్రస్తుతం డెబ్బై ఐదు సంవత్సరాల ”ఆజాదికా అమృత్ మహోత్సవ్” ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో నిర్మూలించిన పేదరికపు శాతం ఎంత? ఇంకా మిగిలిన పేదవారి శాతం ఎంత అనేది నేటికీ ప్రామాణికమైన ఆధారాలు లేవు. అన్నపూర్ణగా పిలువబడుతున్న దేశంలో నేటికీ మూడు పూటలా తిండి దొరకని వారి శాతం సుమారు 12% మంది ఉన్నట్లు ఆర్ధిక గణాంకాలు చెపుతున్నాయి. వీరు ఎప్పుడు పేదరికపు జాబితా నుండి విముక్తిపొంది ఆర్ధిక స్వాతంత్య్రం పొందుతారనేది ప్రశ్న!.
అలిశెట్టి ప్రభాకర్ ఎనబైలలోనే కవిత్వం రాసినప్పటికి, అప్పటి పరిస్థితులు ఇప్పటి సామాజిక పరిస్థితులలో పెద్దగా మార్పులేనట్లుగానే భావించాలి. పాలకులు మారుతున్నా కొద్దిమంది జీవితాల్లో మార్పు పెద్దగా లేదనేది కాదనలేని వాస్తవం. ఇంతటి పదునైన భావజాలం కేవలం విప్లవ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, స్త్రీవాద సాహిత్యం, మైనార్టీవాద, దిగంభర సాహిత్యాలలో చూడవచ్చు. ఏ వాదాలకు, ఏ వివాదాలకు లొంగక తనదైన శైలిలో సాహిత్యాన్ని సుసంపన్నం చేసి నేటికి విమర్శకులకు, పరిశోధకులకు కొత్త ప్రశ్నలు వేశాడు అలిశెట్టి ప్రభాకర్.
తనను వేధిస్తున్న క్షయ వ్యాధి శరీరాన్ని అగ్నిలా దహించి వేస్తున్నా తను ‘వేశ్య’ గూర్చి రాసిన మాటల్లో ‘తను పుండై మరొకరికి పండై’ అన్నట్లుగా రోజురోజుకి శరీరంలో వ్యాపిస్తున్న క్షయవ్యాధి వల్ల ఆరోగ్యం క్షీణిస్తున్నా కవిత్వానికి పెద్దపీట వేసి ‘ఖడ్గం’ లాంటి పదునైన ప్రశ్నలు పాలకులపై, సమాజంపై వేసి తాను మరణించి జనులకు కవిత్వమందించి చిరంజీవిగా అందరి మనసులల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్నాడు. జాషువా అన్నట్లుగా ”సుకవి జీవించు ప్రజల నాలుకల యందు”, నేటికీ కవిత్వ రూపంలో జీవించే ఉన్నాడు అలిశెట్టి ప్రభాకర్. తెలుగు సాహిత్య చరిత్రలో జయంతి, వర్ధంతి ఒకే తేదీన జనవరి 12 ఉన్న వ్యక్తి బహుశా అలిశెట్టి ప్రభాకర్ ఒక్కడే కావచ్చు. ”మరణం నా చివరి చరణం కాదు మనోహారాకాశంలో విలపించే చంద్రబింబం నా అశ్రుకణం కాదు. పీడుతుడే నా అస్త్రం – అణ్వస్త్రం. శత్రువు నా పాదధూళి” అనే వాక్యాల్లో శ్రీ శ్రీ, దాశరధి తరువాత పదునైన కవిత్వం ద్వారా సమాజాన్ని తట్టిలేపే సాహిత్యాన్ని అందించిన గొప్ప వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్.
(జనవరి 12 అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి సందర్భంగా)
– డా|| మహ్మద్ హసన్, 9908059234
సాహిత్య విమర్శకులు