– సొంతగడ్డపై రోహిత్‌సేన జోరు
– ఉత్పేరకంగా అభిమానుల విశేష మద్దతు
– మూడో కప్పు వేటలో భారత్ దూకుడు
నవతెలంగాణ క్రీడావిభాగం
ఆరుకు ఆరు. ప్రపంచకప్ గ్రూప్ దశలో టీమ్ ఇండియా జోరు. వరుసగా ఆరు మ్యాచుల్లో విజయాలు సాధించిన రోహిత్‌సేన సెమీఫైనల్లో చోటు ఖాయం చేసుకుంది. కీలక సెమీఫైనల్స్‌కు ముందు మరో మూడు మ్యాచుల్లో నాకౌట్ సమరానికి సన్నద్ధం కానుంది. బ్యాట్‌తో బ్యాటర్లు, బంతితో బౌలర్లు, గ్రౌండ్‌లో ఫీల్డర్లు, స్టాండ్స్‌లో అభిమానులు ఇలా 2023 ఐసీసీ ప్రపంచకప్‌లో ప్రతిదీ ఆతిథ్య భారత్‌కు అనుకూలంగానే సాగుతోంది. ముచ్చటగా మూడోసారి వన్డే వరల్డ్‌కప్ అందుకునే ప్రయత్నంలో భారత జట్టుకు అన్నీ మంచి శకునములే!!
ఆతిథ్యమే విజయం!
ప్రపంచకప్‌లకు ఆతిథ్యం ఇవ్వటం సొంత జట్టుకు నరకప్రాయంగా ఉండేది. విపరీత అంచనాలు, అభిమానుల ఆశలు, కప్పు వేటలో అదుపుచేయలేని భావోద్వేగాలు.. బలమైన జట్లను సైతం కుంగదీశాయి. 1975 నుంచి 2007 వరకు ఇదే కొనసాగింది. ప్రపంచకప్ ఎప్పుడూ పర్యాటక జట్ల పరం కాగా.. ఆతిథ్య ఎప్పుడూ ఓటమి గాయాలతో విలవిల్లాడేది. 1996 సహా ఆతిథ్య దేశంగా నిలిచిన శ్రీలంకకు ఇక్కడ కాస్త మినహాయింపు. కానీ ఆ జట్టు సైతం కప్పును లాహోర్‌లోనే అందుకుంది. ఆతిథ్య జట్లకు అసలు సిసలు మజా తీసుకొచ్చిన ఘనత ధోనీసేనకే దక్కుతుంది. 2011 ప్రపంచకప్ ఆతిథ్య జట్టుగా బిలియన్ ప్రజల అంచనాలతో బరిలోకి భారత్ అద్భుత విజయం సాధించింది. ఆతిథ్య జట్టు సైతం చాంపియన్‌గా నిలువచ్చని 2011లో టీమ్ ఇండియా నిరూపించింది. ధోనీసేన చూపిన బాటలోనే 2015, 2019 ప్రపంచకప్ ఆతిథ్య జట్లు నడిచాయి. 2015 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా, 2019 ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్‌లు సొంతం చేసుకున్నాయి. టీమ్ ఇండియానే శ్రీకారం చుట్టిన సంప్రదాయాన్ని కొనసాగించేందుకు రోహిత్‌సేన రంగం సిద్ధం చేసింది. గ్రూప్ దశలో వరుసగా ఆరు విజయాలతో అజేయంగా నిలిచింది. సెమీఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకుని.. నాకౌట్ ప్రత్యర్థి కోసం అస్త్రాలు సిద్ధం చేస్తోంది.
ఏమా ప్రదర్శన
టీమ్ ఇండియా గ్రూప్ దశలో వరుసగా ఆరు విజయాలు సాధించటం అసమానం. ఆతిథ్య భారత్ సెమీస్, ఫైనల్ ఫేవరేట్ అనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ అగ్రజట్లను సైతం పసికూనల మాదిరి చిత్తు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. లక్నోలో ఇంగ్లాండ్‌పై 100 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్.. అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. చెన్నైలో ఆస్ట్రేలియా మాత్రమే కాస్త ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. మరో ప్రత్యర్థి టీమ్ ఇండియాకు గట్టి పోటీ ఇచ్చిన దాఖలాలు సైతం లేవు. పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్‌లు టీమ్ ఇండియా ముందు దాసోహం అయ్యాయి. శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌లతో మ్యాచులే మిగిలి ఉండగా… ఈడెన్‌గార్డెన్స్‌లో సఫారీ సవాల్‌పై ఇప్పుడు ఆసక్తి రెట్టింపు అవుతోంది.
సందిగ్థత నుంచి సాహో..
ఆసియా కప్ విజేతగా నిలిచి భారత్ ఆత్మవిశ్వాసం సాధించినా.. కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో ప్రపంచకప్ వేటపై అనుమానాలు నెలకొన్నాయి. ప్రపంచకప్‌లో భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న జశ్‌ప్రీత్ బుమ్రా, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యలు అప్పుడప్పుడే జట్టులోకి వచ్చారు. ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్ నిరూపించుకునే స్థితి నుంచి భారత్‌కు అప్రతిహాత విజయాలు అందించే స్థాయిలో చెలరేగుతున్నారు. డెంగీ జ్వరంతో తొలి రెండు మ్యాచులకు శుభ్‌మన్ గిల్, గాయంతో చివరి రెండు మ్యాచులకు హార్దిక్ పాండ్య దూరమయ్యారు. గాయం నుంచి కోలుకుని పూర్వ ఫామ్ చాటడం అంత సులువు కాదు. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ పరిస్థితి అందరం చూస్తూనే ఉన్నాయి. అయినా.. మనోళ్లు అద్భుత రీతిలో రాణిస్తున్నారు.
సూపర్ షమి
హైదరాబాదీ పేసర్ ఆసియా కప్ ఫైనల్లో కలల ప్రదర్శన చేశాడు. వన్డేల్లో నం.1 బౌలర్‌గా నిలిచాడు. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చాడు. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని శార్దుల్ ఠాకూర్ మూడో పేసర్‌గా తుది జట్టులో నిలిచాడు. దీంతో సీనియర్ పేసర్ మహ్మద్ షమి బెంచ్‌కు పరిమితం కావాల్సి వచ్చింది. హార్దిక్ పాండ్య గాయం బారిన పడటంతో తుది జట్టు కూర్పు మార్చాల్సి వచ్చింది. ఈ కూర్పులో మహ్మద్ షమి జట్టులోకి వచ్చాడు. వన్డే కెరీర్‌లో సాధించిన వికెట్లలో మహ్మద్ షమి ఏకంగా 25 శాతం వికెట్లను ప్రపంచకప్‌లోనే పడగొట్టాడు. అంతటి మహ్మద్ షమి ధర్మశాలలో న్యూజిలాండ్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన, లక్నోలో ఇంగ్లాండ్‌పై నాలుగు వికెట్ల ప్రదర్శనతో విజృంభించాడు. అనూహ్యంగా సిరాజ్ ఇబ్బంది పడుతున్న వేళ.. షమి భీకర స్పెల్స్ భారత బౌలింగ్‌ను మరింత బలోపేతం చేశాయి. షమి, బుమ్రా, సిరాజ్ పేస్ త్రయం ప్రత్యర్థులకు దడ పుట్టిస్తోంది.
ఫ్యాన్స్‌కు పండుగ
ఆటలో తిరుగులేదు. సెమీస్ దారిలో ఎదురులేదు. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. కానీ టీమ్ ఇండియా నుంచి అభిమానులకు మరో ట్రీట్ లభించింది. కొన్నిసార్లు నాయకత్వం అహానికి దారితీస్తుంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ బంధంపై ఎన్నో కథనాలు వచ్చాయి. కానీ ప్రపంచకప్‌లో కోహ్లి, రోహిత్ అనుబంధం.. మైదానంలో ఆ ఇద్దరు ఆటగాళ్ల ఆనందహేళి చూడటం అభిమానులకు పండుగే. విజయాలకు తోడు స్టార్ క్రికెటర్ల మైత్రీ డ్రెస్సింగ్ రూమ్‌ను సానుకూలం చేస్తోంది. మ్యాచ్‌కు ముందు జట్టు హడిల్‌లో కెప్టెన్ మాట్లాడటం చూస్తుంటాం. కానీ ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్‌కు ఒక్కో ఆటగాడు జట్టును ఉద్దేశించి ‘పెప్ టాక్’ ఇస్తున్నాడు. మ్యాచ్ అనంతరం టీమ్ ఇండియా డ్రెస్సింగ్‌రూమ్‌లో అవార్డ్స్ సెర్మానీ ఈ ప్రపంచకప్ వేటలో మరో ప్రత్యేకత.