మన చుట్టూనే…

All around us...”ఏ…భలే భలే! కొత్త క్రూర జంతువును చూడబోతున్నానోచ్‌” అంటూ గట్టిగా చప్పట్లు చరిచి కేరింతలు కొడుతోంది బుజ్జిది. కూతురి ఆనందాన్ని చూసి ముచ్చటేసింది రాంప్రసాద్‌కి. దార్లో ఎదురుగా ఎంక్లోజర్లో కనిపించిన తెల్లపులిని తీక్షణంగా గమనిస్తూ బుజ్జిదడిగింది. ”ఈ తెల్ల పులి అంతకు ముందెవరో ప్రమాదవశాత్తు ఎంక్లోజర్‌లోకి జారిపడిన ఒక మనిషిని చంపేసిందట కదా డాడీ?” అంటూ డాడీ గుండెల మీద విచారంగా ముఖం పెట్టి దాచుకుంది.
ఇటీవల జూ పార్క్‌ కేదో కొత్త జంతువొచ్చిందట. అచ్చం మనిషిని పోలిన జంతువులా వుందట. అత్యంత ప్రమాదకరమైన క్రూరజంతువట.
”దాన్నెప్పుడు చూపిస్తావ్‌ డాడీ?” అంటూ తెగ గోల చేస్తోంది బుజ్జిది. గత వారం రోజులుగా ఎంత ప్రయత్నించినా ఆఫీస్‌లో పనివొత్తిడి వల్ల వీలు చిక్కటం లేదు రాంప్రసాద్‌కి. బుజ్జిది పట్టు వదిలేలా లేదు. జూ పార్కుకు తీసుకెళ్లకపోతే ఇంటినే జూ పార్కు చేసి పడేసేలా వుంది.
”ఒక పూట ఆఫీసుకు సెలవు పెట్టి దాన్ని తీసుకెళ్లొచ్చు కదా!” ఆవిడ సమర్ధింపు దాని అల్లరికి హద్దులు చెరిపేసింది. ఆ పూట ఆన్‌ లైన్‌ క్లాసుగ్గూడా కూర్చోనని మొరాయించింది. ఆఫీసు హడావిడిలో అసలు విషయం మరిచిపోయి సాయంత్రం ఇంటికొచ్చేసరికి ఇంట్లోనే వుండి ఇల్లు పీకి పందిరేసిన బుజ్జిదాని అల్లరికి చెవి కోసిన మేకలా అరుస్తోంది ఇల్లాలు. తలనొప్పిగా వుండి సోఫాలో కూలబడ్డ రాంప్రసాద్‌కి కాఫీ ఇవ్వటం కూడా మర్చిపోయిందావిడ.
దానికి తోడు ”జూ పార్క్‌ డాడీ! జూ పార్క్‌” అంటున్న బుజ్జిదాని సణుగుడు తన కోపాన్ని నషాలానికి అంటించింది. సోఫాలో వెనక్కి మరింత జారగిలబడి పోయి. ”ఓ మై గాడ్‌! సేవ్‌ మి ఫ్రమ్‌ దిస్‌ డెవిల్‌!” గట్టిగా అరిచి జుట్టు పీక్కున్నాడు రాంప్రసాద్‌.
”అంత టెన్షన్‌ ఫీలవకపోతే ఓ పూట…” అన్నదో లేదో శ్రీమతి అర్థోక్తిగా. ఇంతెత్తున విరుచుకు పడ్డాడు రాంప్రసాద్‌.
”ఓ పక్క ఆఫీసు పని వొత్తిడి. ఇంటికొస్తేనేమో దీని గోలొకటి. అదేదో నువ్వే తీసుకెళ్లి తగలడొచ్చుగా జూపార్క్‌కి. నీకేమైనా పనా పాటా?” అహం మీద కొట్టాడు. హతాశురాలైంది ఆవిడ.
ఎంత మాటన్నాడు. ప్రతి మగాడికీ ఇంట్లో ఇల్లాలంటే మరీ చులకనైపోయింది. ఏం ఇంట్లో పని, పని కాదా? ఇల్లాలు చేసేది శ్రమ కాదా? పొద్దున్నే సూర్యుడికంటే ముందు నిద్రలేచి వంటింట్లో దాదాపు యుద్ధం చేసినంత పని చేస్తేనే టయ్యానికి ఇంటిల్లిపాదికన్నీ సమకూరేది. ఇక్కడున్న వస్తువు తీసి అక్కడ పెట్టేదేమైనా వుందా? పైగా పని పాట లేదట. పని పాట” తనదైన శైలిలో విరుచుకుపడుతూ ఎప్పట్లాగే వంటింట్లో గిన్నెలమీద తన ప్రతాపాన్ని చూపించింది ఆవిడ.
గిన్నెల కర్ణకఠోర నిరసన శబ్దాన్ని తట్టుకోలేక రాంప్రసాద్‌ తలనొప్పి తారా స్థాయికి చేరి సోఫాలోంచి ఇరిటేటింగా లేచి వీధి తలుపు దఢేల్మని మూస్తూ బయటకెళ్లాడు. కోపం శతి మించినపుడు విసురుగా వీధిలోకలా వెళ్లి తిరిగి ఇల్లు చేరటం మామూలే.
భర్త మీద కాస్త కోపం తగ్గాక తిరిగి గిన్నెల్ని నిశ్శబ్దంగా యధాస్థానాల్లో సర్ది కాఫీని స్టౌ మీద పెడుతూ వీధి గుమ్మం కేసి చూసింది శ్రీమతి. రాంప్రసాద్‌ అప్పుడే ఇంట్లోకి ప్రవేశిస్తూ కనిపించాడు. గబగబా ఫ్రిజ్‌ డోర్‌ తీసి వాటర్‌ బాటిల్‌ తీసుకెళ్లి సోఫాలో కూలబడ్డ రాంప్రసాద్‌కి అందించింది. బాటిల్‌ పైకెత్తి గటగటా రెండు గుటకలు వేసి స్థిమిత పడ్డాడు. బాటిలెత్తి నీళ్లు తాగుతున్న ఆ కొద్ది విరామంలోనే వంటింట్లోకెళ్లి కాఫీ తెచ్చిచ్చిందావిడ. కప్పు చేతిలోకి తీసుకుని సిప్‌ చేశాక తలంతా హాయిగా అనిపించింది రాంప్రసాద్‌కి. శ్రీమతి వైపు కృతజతగా చూశాడు. తల తిప్పి బుజ్జిదేం చేస్తోందా అని తన గదిలోకి తొంగి చూశాడు. డాడీ చూస్తున్నాడని తెలిసి రంగు పెన్సిల్లేవో సర్దుతూ ”డాడీ జూ పార్క్‌” అంది
రాంప్రసాద్‌ ఒకసారి బుజ్జిదాని వైపు ఆరాధనగా చూసి చిన్నగా నవ్వాడు. ”హమ్మయ్య!” అంటూ తను కూడా నవ్వింది శ్రీమతి. మరో రెండు సార్లు కాఫీని సిప్‌ చేసి కప్పు టీపాయి మీద పెడుతూ, ”రేపే జూపార్క్‌ ప్రోగ్రామ్‌!” అన్నాడు. అంతే! యురేకా అంటూ ఎక్కడ్నుంచొచ్చిందో బుజ్జిది గాలిపటంలా హాల్లోకి దూసుకొచ్చి సోఫా వెనక నుంచి రాంప్రసాద్‌ మెడ పట్టుకుని ఊపుతూ తనదైన శైలిలో సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఖాళీ కప్పు చేతిలోకి తీసుకుంటూ తండ్రీ కూతుళ్లని చూసి తృప్తిగా నవ్వి వంటింట్లో కెళ్లింది రాంప్రసాద్‌ భార్య.
ఆ రోజు చెల్లెలు ఇంటి కొస్తానన్న విషయం గుర్తు చేసి తండ్రీ కూతుళ్లనిద్దరినే వెళ్లమని చెప్పింది జూ పార్క్‌ కి. వీలైతే తను చెల్లిని తీసుకుని తర్వాత జాయినౌవుతానని కూడా అంది. భార్య మాటల్ని గుర్తు చేసుకుంటూ బడలికగా సోఫాలోకి ఒరిగిపోయాడు రాంప్రసాద్‌.
ష ష ష
కారు ముందుకు దూసుకెళుతోంది. పచ్చని చెట్లు వెనక్కి పరుగెత్తుతున్నాయి. వెనక సీట్లో మోకాళ్ల మీద కూర్చుని కారు అద్దానికి ముఖం ఆనించి వెనక్కి వెళుతున్న చెట్లను తదేకంగా చూస్తోంది బుజ్జిది.
కారు జూపార్కు గేటు ముందుకు రాగానే స్లో చేసాడు రాంప్రసాద్‌. గేటు ముందున్న కొంత మంది జూ పార్క్‌ వాలంటీర్లు కారు పార్కింగు వైపు చేయి చూపిస్తూ వాహనాలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కారు పార్కు చేసి బుజ్జిదాని చిటికెన వేలిని తన చేత్తో పట్టుకుని టికెట్‌ కౌంటరుకు దారి తీశాడు రాంప్రసాద్‌. మునుపటి ఉత్సాహం కంటే రెట్టింపు ఉత్సాహంతో బుడి బుడి అడుగులేస్తున్న బుజ్జిదాని వైపు చూస్తూ నవ్వుకున్నాడు.
”ట్రెయిన్‌ ఎక్కుదామా?” అంటే ససేమిరా వద్దంది. ”నాకేం కాళ్లు నొప్పి పుట్టవ్‌. నడుస్తాలే” అంది హుందాగా. క్రూర జంతువును చూడబోతున్నానన్న ఉషారులో వచ్చిన ఉత్సాహంలో కాళ్లెందుకు నొప్పుడతాయిలే అనుకున్నాడు తండ్రి రాంప్రసాద్‌.
”ఆ జంతువు చాలాక్రూరమైనదా డాడీ? పులి వుంటుందే. దాని కన్నా క్రూరమైనదా?”
”అబ్బా! తినబోతూ రుచులెందుకు? ఇంకాసేపైతే చూస్తావుగా!” అన్నాడు విసుగ్గా రాంప్రసాద్‌.
ఆ జంతువును చాలా దగ్గరగా చూడాలని తహతహగా వుంది బుజ్జిదానికి.
దార్లో రకరకాల పక్షుల గుంపులతో వున్న ఎంక్లోజర్‌ వైపు చూసి ”పక్షులు భలే వున్నయి కదరా బుజ్జీ!” అన్నాడు.
ఇంకా వాళ్లు నడిచే దారిలో ఎదురైన ఎలుగుబంటి, దుప్పులు, కృష్ణజింకలు, లేళ్లు, నిప్పు కోళ్లు, ఈవ్‌ పక్షులు, నక్కలు, తోడేళ్లు, గెరిల్లాలూ, జిరాఫీలు, చెవుల పిల్లులు, ఇంకా అరుదైన మరికొన్ని జంతు జాతులూ చూస్తూ వెళుతున్నా, వేటిపైనా ఆసక్తి కనబరచ లేదు బుజ్జిది. తనాశించిన క్రూరజంతువు ఎంక్లోజర్‌ ఎప్పుడొస్తుందా అంటూ వెతుకుతున్నాయి తన కళ్లు.
బుజ్జిదాని ఆసక్తిని గమనిస్తూ ”దగ్గర్లోకి వచ్చేశాం బుజ్జీ. అదిగో ఆ వైట్‌ టైగర్‌ ఎంక్లోజర్‌కు కాస్త దగ్గర్లోనే నువ్వెప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న కొత్తగా వచ్చిన క్రూర జంతువు వుంది” అన్నాడు.
”ఏ…భలే భలే! కొత్త క్రూర జంతువును చూడబోతున్నానోచ్‌” అంటూ గట్టిగా చప్పట్లు చరిచి కేరింతలు కొడుతోంది బుజ్జిది.
కూతురి ఆనందాన్ని చూసి ముచ్చటేసింది రాంప్రసాద్‌కి. దార్లో ఎదురుగా ఎంక్లోజర్లో కనిపించిన తెల్లపులిని తీక్షణంగా గమనిస్తూ బుజ్జిదడిగింది.
”ఈ తెల్ల పులి అంతకు ముందెవరో ప్రమాదవశాత్తు ఎంక్లోజర్‌లోకి జారిపడిన ఒక మనిషిని చంపేసిందట కదా డాడీ?” అంటూ డాడీ గుండెల మీద విచారంగా ముఖం పెట్టి దాచుకుంది.
”లేదులేమ్మా? అదో ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన. పులులంత క్రూరమైనవేమీ కావు. అవి ఆకలితో వున్నపుడే మనుషుల మీద దాడి చేస్తాయి”
”తెల్ల పులి చూడటానికి ఎంత అందంగా వుందో? అందమైన జంతువులు కూడా అంత క్రూరంగా వుంటాయా డాడీ?” బుజ్జిదాని ప్రశ్నకు నవ్వొచ్చింది రాంప్రసాద్‌కి.
”క్రూరత్వానికి అందానికి సంబంధమేమి లేదు తల్లి. అది మృగం. దానికి మనుషుల్లాగా మంచీ చెడూ విచక్షణ వుండదు. మనిషైనా మరో జంతువైనా ఆకలితో వున్నపుడు దాని కళ్లకు ఆహారమే. అందుకే దాన్ని క్రూర మృగమన్నారు. తండ్రి, క్రూర మృగం అన్న ప్రస్తావన తేగానే అసలు విషయం గుర్తొచ్చి ”ఇంతకీ ఆ క్రూరజంతువెక్కడ డాడీ” అంది బుజ్జిది.
”పక్కనే!” అంటూ ముందుకు నాలుగడుగులు వేశాడు రాంప్రసాద్‌.
అక్కడొక పులి బోనులాంటి చువ్వలతో నిర్మించిన జైలులాంటి నిర్మాణం వుంది. పులి బోను కంటే కట్టుదిట్టంగా వుంది. సందర్శకులకు చాలా దూరంగా లోపలెక్కడో వుంది ఆ క్రూర జంతువు.
ఒక మూలకు ఏర్పాటు చేసిన సిమెంటు గద్దెమీద ఏదో తలకు ముసుగేసిన ఆకారమొకటి కనిపిస్తోంది. ఊచల జైలు గదిలాంటి ఆ నిర్మాణం చుట్టూ చేరిన జనం ఒకింత భయంతో ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ముసుగు కప్పి వుండటం వల్ల జంతువు ముఖం, మెడ కనిపించటం లేదు. మిగతా శరీరమంతా మనిషిలాగనే వుంది. పైన చొక్కా, కింద ప్యాంటూ వేసుకుని వుంది. రెండు కాళ్లున్నాయి. పులి కాళ్లకు మల్లే పదునైన గోళ్లూ లేవు. మనిషికున్నట్టే రెండు చేతులున్నాయి. అవి పులి పంజాలాంటివి మాత్రం కావు. తలలో ఏమైనా కోరలున్నాయేమో పులి నోట్లో లాగా! ఊహించుకుంది. మరది క్రూర జంతువెందుకయింది? ఆలోచనలతో బుర్ర వేడెక్కింది బుజ్జిదానికి.
తలదించి అదే విషయమడిగింది వాళ్ల డాడీని.
”పులి క్రూర జంతువనేది దాని ఆకారాన్ని బట్టి తెలిసిపోతుంది. కానీ దీని విషయంలో అట్లా కాదు తల్లీ. నోట్లో వుండాల్సిన కోరలు ఈ జంతువుకి తలలో వుంటాయి. పంజాల్లాంటి పదునైన గోళ్లూ గట్రా పైకి కనిపించవు. అన్నీ శరీరం లోపలే వుంటాయి. అవెప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. అందుకే ఇది చాలా ప్రమాదకరమైన, అత్యంత క్రూరాతి క్రూరమైన జంతువని అందరూ భావిస్తారు” చెప్పాడు రాంప్రసాద్‌.
బుజ్జిదానికి అర్థమైనట్టే వుంది. కానీ కానట్టూ వుంది. ”నేరస్తులకీ, దొంగలకీ, క్రిమినల్స్‌కీ ముసుగులేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించినట్లు ఈ జంతువుకెందుకు డాడీ ముసుగు వేసి పెట్టారు?” అడిగింది తండ్రిని.
ఇటువంటి మృగాలు అడుగడుగునా వుంటాయమ్మా! ముఖం చూస్తే మనిషిలాగానే కనిపిస్తాయి కాబట్టి ఎదురుపడే మనుషులందర్నీ మృగాలుగా పొరపాటు పడే అవకాశముంటుందని దాని ముఖానికి ముసుగేసి వుంచారు.
ఈ మృగాన్ని కొంతకాలమిలా బంధిస్తే దీని బుద్ధిలో మార్పు వచ్చి మళ్లీ సాత్వికంగా మారిపోయి మునుషుల్లో కలిసిపోయే వీలుందనే ఆశేమోననుకుంటా. దాని ముఖాన్ని చూపించి మార్పొచ్చాక మళ్లీ మామూలుగా జనజీవన స్రవంతిలో కలిసిపోయే దాని ప్రాథమిక హక్కును కాలరాయటం కరెక్టు కాదు కదా. ఒక అవకాశమిచ్చి చూద్దాం అని కాబోలు. మానవ సమాజం అలాంటి చట్టాలను రూపొందించి పెట్టింది.
”మరి పులుల్లో అలాంటి మార్పు రాదా డాడీ? వాటినెందుకు ఎప్పుడలా జూలోనే బంధించి పెడతారు?”
”పులి పుట్టుకతోనే క్రూరజంతువుగా వుంటుంది. నిజానికదంత క్రూరమైంది కాదు. ప్రకృతి సిద్ధంగా దానికున్న సహజ లక్షణాల్లో క్రూరత్వం కూడా ఒకటి. ఆకలైన సందర్భాల్లో మాత్రమే తన ఆహారంపై దాడి చేసి అది తన క్రూరత్వాన్ని బయట పెడుతుంది. మిగతా సమయాల్లో అది చాలా సాత్వికంగా వుంటుంది. పైగా పర్యావరణ సమతుల్యానికి పులిలాంటి కొన్ని క్రూరమగాల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరముంది. అందుకే వాటినిలా జంతు సంరక్షణ శాలల్లో పెట్టి కాపాడుకుంటున్నాం తల్లీ!” వివరణిచ్చాడు తండ్రి.
”మరి ఈ క్రూర జంతువు సంగతీ?” అడిగింది బుజ్జి.
పులికంటే ప్రమాదకరమైన జంతువు తల్లీ ఇది.” అంటూ ఎంక్లోజర్‌ వైపు చూపించాడు రాంప్రసాద్‌.
ముసుగేసి వున్న ఆ రెండు కాళ్ల జంతువు రెండు చేతులు పైకెత్తి వొళ్లు విరుచుకుంటోంది. ఎంక్లోజర్‌ చుట్టూ చేరి చూస్తున్న జనంలో కలకలం. ఊచల జైలులాంటి ఆ నిర్మాణానికి మరో రెండు మీటర్ల దూరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్త్రీల క్యూలైన్లో మరింత కలకలం బయలుదేరింది. బుజ్జిదానికి ఆశ్చర్యమేసి అదే అడిగింది వాళ్ల డాడీని.
ఈ జంతువు స్త్రీలను చూస్తే రెచ్చిపోతుంది. యుక్త వయసులో వున్న ఆడపిల్లలనైతే అసలు వదిలి పెట్టదు. వెంటాడి వేటాడుతుంది. పులిలాంటి క్రూరజంతువుకైనా ఒక నీతీ నియమమంటూ వుంది. ఆకలి వేస్తేనే దాడి చేస్తుంది.
ఈ మనిషిని పోలిన జంతువు ఎప్పుడు ఆకలి మీదుంటుందో తెలియదు. దీనికొక నియమమంటూ వున్నట్టు కనిపించదు. ఒంటరిగా కనిపిస్తే చాలు. పసిపిల్లా? పండు ముదుసలా? అని కూడా చూడదు. ఆడపిల్ల వాసన తగిలితేచాలు. రెచ్చిపోతుంది. అమాంతం మీద పడి దాడి చేస్తుంది. నువ్వోసారడిగావు చూడూ! ఈ క్రూరజంతువును ఎక్కడ్నుంచి పట్టుకొచ్చి జూలో పెట్టారని. మన దేశంలోనే ఒక రాష్ట్రంలో జరిగిన ఒకానొక విషాదకరమైన దురదృష్ట సంఘటనలో పట్టుకున్నారీ జంతువును. దీనితోపాటూ ఆ సంఘటనలో పాల్గొన్న మరికొన్ని క్రూర జంతువులు తప్పించుకొని పారిపోయాయి. ఇది మాత్రం చేతికి చిక్కి ఊచల జైలులాంటి ఈ ఎంక్లోజర్లో పులి పక్క బోనులోనే బంధించబడి ప్రదర్శనకు పెట్టబడింది.
కనీసం పక్కనే వున్న పులిలాంటి క్రూర జంతువును చూసైనా ఈ క్రూర మృగంలో కొద్దో గొప్పో మార్పొస్తుందేమోనని ఆశించినట్టుంది అధికారులు. కానీ చూశావా? క్యూ లైన్లో వున్న ఆడవాళ్ల కలకలం, అలికిడి వినగానే కళ్లు కనిపించకుండా తలకు ముసుగేసినా సరే ఎట్లా బోను ఊచల్ని పట్టుకుని కుదుపుతూ కేకలు పెడుతుందో.
ఊచల శబ్దానికి అది పెట్టే అరుపులకీ బుజ్జిదానిక్కూడా చెప్పలేనంత భయమేసి వాళ్ల డాడీని గట్టిగా కరుచుకుని నిలుచుంది.
చేతికి చిక్కిన ఆహారాన్ని సొంతం చేసుకోవటంలో ఈ క్రూర జంతువుతో పోల్చితే పులి చాలా సాత్వికమైన జంతువుగానే చెప్పుకోవచ్చు.
”అవునా?” కళ్లు పెద్దవి చేసి, ఈ మనిషిలాంటి క్రూరజంతువు ఇంకేం చేసింది డాడీ?” ఉత్సుకతగా అడిగింది బుజ్జిది.
ఏం చెప్పమంటావు తల్లీ! ఈ క్రూరజంతువు దాడిలో ఛిద్రమైన ఆ అడపిల్ల సంఘటన చూసి దేశం యావత్తూ కన్నీళ్లు పెట్టుకుంది. మరిన్ని క్రూర మృగాలతో కలిసి ఆ అడపిల్లను ఎంత క్రూరంగా చంపిందో తెలుసా ఈ క్రూరజంతువు, నాలుకను తెగ్గోసింది. వెన్నెముకను విరగ్గొట్టి వెన్ను పూసల్ని ముక్కలుగా వెదజల్లింది. ఆ అడపిల్ల దేహంలో ఈ క్రూరజంతువు తన పళ్లతో గోళ్లతో పశుబలంతో గాయం చేయని చోటు లేదు బుజ్జీ! నీకెలా చెప్పాలో కూడా నాకర్థం కావటం లేదు. ఆ సంఘటన తల్చుకుని ఈ క్రూర మృగాల దాష్టీకం ఊహించుకుంటేనే గుండె తరుక్కుపోతోంది తల్లీ!” అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నాడు రాంప్రసాద్‌.
డాడీ కళ్లను తుడుస్తూ అతని ముఖంలోకి దిగులుగా చూసింది బుజ్జి. ”ఛీ! బ్యాడ్‌ యానిమల్‌” అంటూ ఊచల జైలులాంటి బోనులోకి దృష్టి సారించి ముఖం ముట ముటలాడించింది.
”మరీ క్రూరమగాన్నెందుకు డాడీ ఇక్కడ బంధించారు?”
బుజ్జిదాని ప్రశ్న ముగిసిందో లేదో మెరుపులాంటి వేగంతో లోపలి గద్దెమీదనుంచి ఒక్క గెంతు గెంతి బుజ్జిదాని వైపు లంఘించిందా రెండు కాళ్ల జంతువు. ఊహించని ఈ పరిణామానికి విసురుగా ఊచల ఇవతల బోనుకు దగ్గరగా నిలుచున్న స్థానం నుంచి ఒక్కుదుటున దూరం జరిగి పరుగెత్తుకొచ్చి తండ్రిని గట్టిగా వాటేసుకుని బెదిరిపోయింది బుజ్జిది.
హతాశుడైన రాంప్రసాద్‌, ”బుజ్జీ!” అని గట్టిగా అరుస్తూ బుజ్జిదాన్ని క్షణాల్లో చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. బుజ్జిదానికీ ఆ జంతువుకు మధ్యలో ఊచలున్నాయి కాబట్టి సరిపోయింది. లేదంటే, ఊహించుకుంటేనే వొళ్లు జలదరించింది రాంప్రసాద్‌ కి.
***
చేతుల్ని అలాగే గుండెలకు హత్తుకుని ”కిల్‌ దట్‌ యానిమల్‌. కిల్‌ దట్‌ డర్టీ యానిమల్‌” అంటూ బిగ్గరగా అరుస్తూనే వున్నాడు. రంగు పెన్సిళ్లను పౌచ్‌లో సర్దుకుంటున్న బుజ్జిది పరుగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి ”డాడీ ఏమైంది?” అంటూ సోఫాలో నిద్రపోతున్న వాళ్ల డాడీని కుదిపింది.
”ఏమైందండీ? అంతలా అరిచారు? ఏదైనా పీడకలా?” అంటూ అంతే విసురుగా వంటింట్లోంచి పరుగెత్తుకుంటూ వచ్చింది రాంప్రసాద్‌ భార్య.
”ఇవాళ క్రూర జంతువులు జూపార్కుల్లోనో అడవుల్లోనో లేవు. మనచుట్టూనే వుండి మనకు పీడకలలు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా మనలాంటి ఆడపిల్లల తల్లిదండ్రులకు” భార్యతో పైకే అంటూ సోఫాలోంచి లేచి నిలబడి బుజ్జిదాన్ని గుండెలకత్తుకుని నిట్టూర్చాడు రాంప్రసాద్‌.
– చిత్తలూరి
91 33832246