– గవర్నర్ దత్తత గ్రామం కొండపర్తి లో జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలన…
– కలెక్టర్ కు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికిన కొండపర్తి గ్రామ ప్రజలు
నవతెలంగాణ – తాడ్వాయి
రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామంను మోడల్ గ్రామం గా తీర్చిదిద్దేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. అన్నారు. గురువారం మండలంలోని కొండపర్తి గ్రామంలో అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు. కలెక్టర్ కు మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అర్రేం లచ్చు పటేల్ ఆధ్వర్యంలో గ్రామస్తులు మహిళలు పెద్ద ఎత్తున కదిలి వచ్చి పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ అధికారులు, గ్రామస్తులతో అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం గ్రామ సభ ఏర్పాటుచేసి ప్రజలకు కావలసిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ.. గత సంవత్సరంలో రాష్ట్ర గవర్నర్ ములుగు జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లాలోని ఒక గ్రామంను దత్తత తీసుకోవాలని కోరగా, సానుకూలంగా స్పందించి గవర్నర్ కొండపర్తి గ్రామంను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారని, గవర్నర్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం చాలా అదృష్టంమని అన్నారు. గ్రామంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో సోలార్ ఆర్గనైజింగ్ సిస్టం ద్వారా మసాలా మేకింగ్, టైలరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. స్కూల్, అంగన్వాడి భవనాలకు కాంపౌండ్ వాల్, టాయిలెట్స్, వాటర్ సప్లై ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గ్రామంలో కావాల్సిన మౌలక వసతులు రోడ్లు, డ్రైనేజీ, తరగతి గదులలో డ్యూయల్ డేస్ డిజిటల్ క్లాస్ రూమ్స్, డ్రైనేజ్ నిర్మించుటకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోండని, త్వరలో ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు మంజూరు అవుతాయని, ఇండ్లు నిర్మించుకోవడానికి గ్రామ ప్రజలు అందరు కలిసి ఒక ప్రణాళిక రూపొందించు కావాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ వీరభద్రం, ఎలక్ట్రిసిటీ డిఈ పులుసం నాగేశ్వరరావు, మిషన్ భగీరథ, వ్యవసాయ శాఖ అధికారి ఎం శ్రీధర్, తహసిల్దార్ జగదీష్, ఎంపీడీవో సుమన వాణి, ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.