
ప్రశాంతమైన వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టరు హనుమంతు కే జెండగే ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఈనెల 28 నుండి వచ్చే మార్చి 16 వ తేదీ వరకు నిర్వహించబడే ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, 30 పరీక్షా కేంద్రాల ద్వారా మెదటి, రెండవ సంవత్సరం కలిపి మొత్తం 12,559 మంది విద్యార్ధినీ విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పరీక్ష నిర్వహించబడుతుందని, ఉదయం 9 తరువాత విద్యార్ధులను పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించబడరని, పరీక్ష వ్రాసే విద్యార్థినీ విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. పరీక్షల నిర్వహణకు ఛీఫ్ సూపరింటెండెట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్స్, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, 30 పరీక్షా కేంద్రాలకు గాను 30 సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పకడ్బందీ పరీక్షల నిర్వహణ గాను సంబంధిత శాఖల అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, అందరి సమన్వయ సహకారంతో ఇంటర్మీడియట్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు.