– కనీస పింఛన్ రూ.10 వేలివ్వాలి : సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ కె.హేమలత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశవ్యాప్తంగా బీడీ కార్మికులందరికీ ఒకే రకమైన వేతనం చెల్లించాలనీ, కనీస పింఛన్ రూ.10 వేలు ఇవ్వాలని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ కె.హేమలత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కొనసాగుతున్న ఆలిండియా బీడీ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం) జాతీయ సమావేశాల్లో ఆమె మాట్లాడారు. లేబర్ కోడ్‌లతో కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాసేందు కు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
బీడీ కార్మికుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందనీ, బీడీ కార్మికుల ఉపాధిని కొల్లగొట్టే విధంగా ముందుకెళ్తున్నదని అన్నారు. దేశంలో 60 లక్షల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న బీడీ పరిశ్రమను సంక్షోభంలోకి నెడుతున్న తీరును వివరించారు. ఈ రంగంలో 92 శాతం మంది మహిళా కార్మికులే ఉన్నారనీ, వారి నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని బీడీ కంపెనీల యాజమాన్యాలు శ్రమదోపిడీకి పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వంత పాడుతున్నాయని చెప్పారు. కార్మికులకు న్యాయం చేయాల్సిన లేబర్ అధికారులు కూడా యజ మానులతో కుమ్మక్కవుతున్నారని విమర్శించారు. జీఎస్టీ పేరుతో బీడీ కార్మికుల సంక్షేమానికి సెస్సు రద్దు చేసి వారి సంక్షేమాన్ని గాలికి వదిలివేశారని వాపోయారు. బీడీ కార్మికుల పోరాటాలకు సీఐటీయూ మద్దతుగా ఉంటుందని చెప్పారు. ఆలిండియా బీడీ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ జాతీయ అధ్యక్షులు సహదేవన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఏకే.పద్మనాభన్, బీడీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి దేబశిశ్రారు, తెలంగాణ బీడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె. గోపాలస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. రమ, రాష్ట్ర నాయకులు సూర్జహాన్, ఎంఎ. చౌదరి, పద్మ, బాలమణి, తదితరులు పాల్గొన్నారు.