– సీఎంకు గురుకుల జేఏసీ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
317 జీఓ ద్వారా ప్రభుత్వ గురుకులాల్లోని కేటాయింపుల్లో అన్ని స్పౌజ్ కేసులను పరిగణనలోకి తీసుకోవాలని గురుకుల జేఏసీ సీఎంకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జేఏసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె జనార్దన్, టీజీ సోషల్ వెల్ఫేర్ అధ్యక్ష, కార్యదర్శులు నర్సింహులు గౌడ్, ఎస్ గణేశ్ ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. స్పౌజ్ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారని, సెంట్రల్ గవర్నమెంట్, జ్యుడీషియరీ, రైల్వేలు, బ్యాంకులు, ఇతర పబ్లిక్ సెక్టార్ల వారికి కూడా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 2022లో జరిగిన కేటాయింపు తర్వాత ఉన్నటువంటి అన్ని మెడికల్ కేసులను కూడా పరిగణలోకి తీసుకుని వారికీ న్యాయం చేయాలని కోరారు. విద్యాశాఖలో ఉపాధ్యాయులకు ఇస్తున్న బదిలీల అవకాశాన్ని అన్ని గురుకుల పాఠశాలలకు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం సానుకూలంగా స్పందించారని జేఏసీ నేతలు తెలిపారు.