అదానీతో అన్ని ఒప్పందాలనూ రద్దు చేయాలి

అదానీతో అన్ని ఒప్పందాలనూ రద్దు చేయాలి – స్కిల్‌ యూనివర్సిటీకి ఆయన ఇచ్చిన రూ.100 కోట్లను తిరిగి ఇచ్చేయాలి : కేటీఆర్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అంతర్జాతీయ స్థాయిలో అదానీ ముడుపుల వ్యవహారం మరోసారి బయటపడిన నేపథ్యంలో… ఆయనకు చెందిన వివిధ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అన్ని ఒప్పందాలనూ రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఇక్కడ ఏర్పాటు చేయబోతున్న స్కిల్‌ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని సైతం తిరిగి ఆయనకు ఇచ్చేయాలని సూచించారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో శాసనసమండలిలో బీఆర్‌ఎస్‌ నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద తదితరులతో కలిసి కేటీఆర్‌ మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో సైతం అదానీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించారనీ, కానీ ఆయన వ్యవహారం తెలిసిన తాము అందుకు అంగీకరించలేదని గుర్తు చేశారు. అదానీకి చెందిన కంపెనీలతో తమ ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలూ చేసుకోలేదని అన్నారు. కానీ కాంగ్రెస్‌ మాత్రం ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించిందని విమర్శించారు. అదానీ అవినీతి పరుడంటూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపణలు గుప్పిస్తోంటే, అలాంటి వ్యక్తికే రేవంత్‌ సర్కార్‌ ఎర్ర తివాచీ పరిచిందని ఎద్దేవా చేశారు. అదే తమకూ, కాంగ్రెస్‌కు ఉన్న తేడా అంటూ విమర్శలు గుప్పించారు. అదానీ విషయంలో బడే భారు (మోడీ) ఆదేశించగానే, చోటే భారు (రేవంత్‌) ఆయనకు స్వాగతం పలికారని సెటైర్లు విసిరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే అదానీ సంస్థలతో రూ.12,400 కోట్ల మేర ఒప్పందాలు చేసుకున్నట్టు సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. తెలంగాణ డిస్కంలను సైతం అదానీకి అప్పగించేందుకు వీలుగా హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీ నుంచి బిల్లుల వసూళ్ల డ్రామాకు తెరలేపారని తెలిపారు. తద్వారా వాటిని ప్రయివేటీకరించేందుకు కుట్రలు పన్నారని ఆరోపించారు. రామన్నపేటలో సిమెంట్‌ పరిశ్రమ వద్దంటూ ప్రజలు మొత్తుకున్నా, పట్టించుకోకుండా అదానీ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌ తెలంగాణలో అదానీ సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఉవ్విళ్లూరుతున్నారని దెప్పిపొడిచారు.
కాంగ్రెస్‌ హైకమాండ్‌కు తెలియదా…?
తెలంగాణలో అదానీ, రేవంత్‌ బంధం గురించి కాంగ్రెస్‌ హైకమాండ్‌కు తెలియదా? అని కేటీఆర్‌ ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రతీ రోజూ అదానీని విమర్శించే ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ… మన రాష్ట్ర ప్రభుత్వంతో ఆయన చేసుకున్న ఒప్పందాలకు మద్దతిస్తున్నారా? అని నిలదీశారు. స్కిల్‌ యూనివర్సిటీ కోసం ప్రభుత్వం తీసుకున్న విరాళాన్ని… రాహుల్‌కు తెలిసే తీసుకున్నారా? తెలియకుండానా? అని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో అదానీని విమర్శిస్తున్న కాంగ్రెస్‌ నేతలు… తెలంగాణలో మాత్రం ఆయన్ను సమర్థిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని విషయాల్లోనూ ఒకే విధానం ఉండాలి కదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌… అదానీ నుంచి ఏం ఆశించి, ఎంత ఆశించి రూ.12,400 కోట్ల ఒప్పందాలు చేసుకున్నారంటూ ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే… అదానీతో ఒప్పందాలు చేసుకున్న సీఎం రేవంత్‌పై పార్టీ పరంగా వెంటనే చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.
మోడీజీ.. మౌనమేల?
అదానీ విషయంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ విధానాలొక్కటేనని కేటీఆర్‌ విమర్శించారు. దేశ ప్రతిష్టను మంటగలిపిన ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రధాని మోడీని ప్రశ్నించారు. ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ నిలదీశారు. అదానీతో దోస్తీ చేస్తోన్న సీఎం రేవంత్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ప్రధానిని కోరారు.
స్పీకర్‌ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు పోతాం : కేటీఆర్‌
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి నిర్ణీత గడువులోగా అసెంబ్లీ స్పీకర్‌ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళతామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో శుక్రవారం ఆయన స్పందించారు. స్పీకర్‌ను ఆదేశించే అధికారం కోర్టులకు లేదంటూ కాంగ్రెస్‌ నేతలు వాదిస్తూ వచ్చారని తెలిపారు. కానీ రీజనబుల్‌ పీరియడ్‌లో నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడు స్పీకర్‌కు సూచించారని గుర్తు చేశారు. రీజనబుల్‌ పీరియడ్‌ అంటే మూడు నెలలంటూ ఆయన విశదీకరించారు. మణిపూర్‌కు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేటీఆర్‌ ఈ సందర్భంగా ఉదహరించారు.