– సమగ్రంగా సర్వే నిర్వహించి అనర్హుల పేర్లు తొలగించాలి
– మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయింపు
– డబల్ బెడ్ రూమ్ సాధన కమిటీ కన్వీనర్ సందబోయిన ఎల్లయ్య
నవ తెలంగాణ-గజ్వేల్
గజ్వేల్ పట్టణంలోని అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని సమగ్రంగా సర్వే నిర్వహించాలని డబల్ బెడ్ రూమ్ సాధన కమిటీ కన్వీనర్ సందబోయిన ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గజ్వేల్ పట్టణంలో సమగ్రంగా సర్వే నిర్వహించి అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. సుమారు రెండు గంటలపాటు గేటు ముందు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన సర్టిఫికెట్లను రద్దుచేసి మొదటి ప్రాధాన్యతగా మీకే ఇస్తామని తెలిపి సమగ్రంగా సర్వే నిర్వహించకుండా సొంత ఇండ్లు ఆస్తులు కలిగిన వారికి స్థానికంగా గుర్తింపు కార్డు లేని వారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లను అందజేశారని విమర్శించారు. 30 సంవత్సరాల పైబడి అద్దెకు ఉంటూ అన్ని రకాల అర్హత ఉన్న వారి పేర్లు జాబితాలో లేవని డబల్ బెడ్ రూమ్ ఎంపికలో అవినీతి జరిగిందని విమర్శించారు. గత పది సంవత్సరాలుగా ఒక్కరికి కూడా డబల్ బెడ్ రూమ్ ఇవ్వకపోగా ప్రజల మధ్య కొట్లాటలు పెట్టే విధంగా డబల్ బెడ్ రూమ్‌లో సర్వే ఉందన్నారు. గజ్వేల్ పట్టణంలో 5000 మందికి ఇల్లు ఇస్తామని తెలిపి ప్రభుత్వం ఇండ్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ పేదలందరిని మోసం చేస్తుందన్నారు. స్థానిక మున్సిపల్, రెవెన్యూ, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రజా ప్రతినిధులకు పేర్లు రాసి ఇచ్చినా పట్టించుకోవడంలేదన్నారు. అన్నిటికీ ఆదర్శంగా ఉందని చెబుతున్న ప్రభుత్వం పట్టణంలోని ప్రజలందరికీ ఎందుకు న్యాయం చేయడం లేదని ప్రశ్నించారు. మున్సిపల్ కార్యాలయం వద్దకు వచ్చిన వైస్ చైర్మన్ జకీయెద్దీన్ మాట్లాడుతూ అర్హులకు న్యాయం జరిగే విధంగా తన వంతు కృషి చేస్తున్నానన్నారు. మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ సుధాకర్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డబల్ బెడ్ రూమ్ సాధన కమిటీ నాయకులు నర్సింహులు పద్మ వెంకట చారి స్వామి గణేష్ శివయ్య సంపత్ మానస లక్ష్మి అయేషా, కవిత, శ్రీనివాస్, బాసయ్య తదితరులు పాల్గొన్నారు.