అర్హులైన రైతులందరికీ రుణమాఫీ తప్పక వస్తుంది..

All eligible farmers must get loan waiver.– కాంగ్రెస్ సీనియర్ నాయకులు మచ్చర్ల జితేందర్ రెడ్డి
నవతెలంగాణ – ఆర్మూర్
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనుమల రేవంత్ రెడ్డి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పి ప్రస్తుతం చేపడుతున్న రుణమాఫీ పథకం అర్హులైన రైతులందరికీ వస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మచ్చర్ల జితేందర్ రెడ్డి అన్నారు.  పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి మూడు విడతలుగా రుణమాఫీ చేశారన్నారు. ఇప్పటివరకు రైతుల ఖాతాలలో సుమారు రాష్ట్ర వ్యాప్తంగా రూ.17 వేల కోట్ల రుణమాఫీ నగదు డబ్బులు పడ్డాయన్నారు. కేవలం 9 నెలల వ్యవధిలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నట్లు చెప్పారు.  మిగిలిన అర్హులైన రైతులకు ఏలాంటి అన్యాయం జరగదని, వారందరికీ రుణమాఫీ అవుతుందన్నారు. గత బి ఆర్ ఎస్ రెండో దఫా పర్యాయంలో ఐదేళ్ల గడిచిన రుణమాఫీ చేయకుండా అప్పటి సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులను దగా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసి ఆ టిఆర్ఎస్ నాయకుల తీరును విమర్శించారు.బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మానుకొని తామేం చేశామనేది రైతుల విషయంలో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలోనే హామీని నెరవేర్చుకుంటుందన్నారు. కొందరు రైతులకు తప్పులు ఉండడం వలన రుణమాఫీ వర్తించలేదని వాటిని సరిచేసి తిరిగి అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారన్నారు. రేషన్ కార్డు ఉన్న లేకున్నా రుణమాఫీ రైతులకు వర్తిస్తుందన్నారు. రైతులు అనవసరంగా ఇతరుల మాటలు నమ్మి అపోహ పడవద్దని చెప్పారు. రుణమాఫీ కానీ రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అర్హులైన రైతులందరికీ తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని  అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు బాబీ, తదితరులు పాల్గొన్నారు.