– 33 జిల్లాల నుంచి నగరానికి రాక
– డిగ్రీలో 61 శాతం మంది హైదరాబాద్‌లోనే చదువు
– నిజాం, కోఠి, బేగంపేట, సిటీ కాలేజీల్లో చేరేందుకు ప్రాధాన్యం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యార్థుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ మహానగరంలోనే చదివేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అది ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తి విద్యా కోర్సులైనా, డిగ్రీ కోర్సులైనా విద్యార్థుల చూపంతా సిటీపైనే ఉన్నది. హైదరా బాద్‌లో 33 జిల్లాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుతున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు నిజాం కాలేజీ, కోఠి మహిళా కాలేజీ, బేగంపేట మహిళా కాలేజీ, సిటీ కాలేజీలో చేరేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నిజాం కాలేజీలో 915 మంది చదువుతున్నారు. వారిలో రంగారెడ్డి జిల్లా నుంచి అత్యధికంగా 128 మంది ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన వారు 120 మంది, మేడ్చల్ నుంచి 63 మంది చదువుతున్నారు. అత్యల్పంగా హన్మకొండ, రాజన్న సిరిసిల్ల నుంచి నలుగురు చొప్పున, ములుగు నుంచి ఐదుగురు ఉన్నారు. కోఠి మహిళా కాలేజీలో 1,520 మంది ప్రవేశం పొందారు. వారిలో రంగారెడ్డి నుంచి 237 మంది, హైదరాబాద్ నుంచి 199 మంది, నల్లగొండ నుంచి 114 మంది చదువుతున్నారు. బేగంపేట మహిళా కాలేజీలో 1,294 మంది విద్యార్థులున్నారు. వారిలో హైదరాబాద్ నుంచి 352 మంది, మేడ్చల్ నుంచి 350 మంది ఉన్నారు. సిటీ కాలేజీలో 1,415 మంది చదువుతున్నారు. వారిలో రంగారెడ్డి జిల్లా నుంచి 304 మంది, నారాయణపేట్ నుంచి 147 మంది, హైదరాబాద్ నుంచి 117 మంది ఉన్నారు. హైదరాబాద్‌లో అయితే ఉన్నత విద్యావకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటితోపాటు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు అందుబాటులో ఉంటాయి. దాంతోపాటు భవిష్యత్తు బాగుంటుందని ఇక్కడ చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ మహానగరానికి అంతర్జాతీయ ఖ్యాతి ఉండడం, చదువు పూర్తయ్యాక ఉద్యోగావకాశాలు దొరకడం గమనార్హం. కంప్యూటర్ నైపుణ్యం పెంపొందించుకోవడంతోపాటు ఇంగ్లీష్ మాధ్యమంలో చదివేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి. దేశీయ, అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు కూడా ఇక్కడ ఉన్నాయి. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో చదివేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంకోవైపు ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీల్లో రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరంలో 1,054 డిగ్రీ కాలేజీల్లో 3,85,573 సీట్లున్నాయి. వాటిలో 2,12,188 మంది చేరారు. అయితే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 362 డిగ్రీ కాలేజీల్లో 1,43,739 సీట్లున్నాయి. వాటిలో 81,915 (56 శాతం) మంది విద్యార్థులు చదువుతున్నారు. 61,824 సీట్లు మిగిలాయి. ఇతర 30 జిల్లాల్లో 692 కాలేజీలుంటే 2,41,834 సీట్లున్నాయి. వాటిలో 1,30,273 (54 శాతం) మంది విద్యార్థులు చేరారు. ఇక్కడ 1,11,561 సీట్లు మిగిలాయి. హైదరాబాద్‌లోనే 174 కాలేజీల్లో 83,767 సీట్లుంటే, 51,346 (61 శాతం) మంది చదువుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో 104 కాలేజీల్లో 32,490 సీట్లకుగాను 16,664 (51 శాతం) మంది చేరారు. మేడ్చల్ మల్కాజిగిరిలో 84 కాలేజీల్లో 27,482 సీట్లుంటే, 13,905 (50 శాతం) మంది విద్యార్థులు చేరారు.
విద్యార్థుల భవిత కోసనే అనేక చర్యలు : లింబాద్రి
విద్యార్థుల భవిష్యత్తు కోసమే ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి చెప్పారు. అందులో భాగంగానే డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)ను ప్రవేశపెట్టి విద్యార్థులకు డిగ్రీ ప్రవేశాన్ని సులభతరం చేశామని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని అన్ని వర్సిటీల పరిధిలో సీట్లు పొందొచ్చని వివరించారు. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లో కాలేజీల వారీగా తిరిగి దరఖాస్తు చేసే విధానానికి స్వస్తి పలికామని చెప్పారు.
ఇంకోవైపు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కొత్త కోర్సులను డిగ్రీలో అందుబాటులోకి తెస్తున్నామన్నారు. బీఏ (ఆనర్స్), బీకాం (ఆనర్స్), బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ (ఆనర్స్) కోర్సులను ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. ఇవన్నీ విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.