
నవతెలంగాణ – నెల్లికుదురు
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అనుభవాద్యులైన ఉపాధ్యాయులు సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని మండల విద్యాశాఖ అధికారి గుగులోతు రాము అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో బుధవారం మండల నోడల్ ఆఫీసర్ రామ్దాస్ తో కలిసి పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు నోట్ బుక్కులు ఏకరూప దుస్తుల తోపాటు మధ్యాహ్న భోజనం తదితర ఉచిత సౌకర్యాలను అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకై ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులను నిర్వహిస్తున్నదని ఈ పనులు పాఠశాల ప్రారంభం నాటికి పూర్తవుతాయని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించి ఆర్థికంగా నష్టపోకుండా ప్రభుత్వ బడులను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. మండలంలోని ఎనిమిది హై స్కూల్ లకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం పూర్తయిందని నేడు ప్రాథమికోన్నత ప్రాథమిక పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మండల ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఎం సుధాకర్ కంప్యూటర్ ఆపరేటర్ హెచ్ ఉపేందర్ సిఆర్పిలు ఏ భాస్కరరావు బి వీరస్వామి బి కవిత జె కవిత ఐఆర్పి యాకయ్య తదితరులు పాల్గొన్నారు.