– గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైకోర్టును రాజేంద్రనగర్ మండలం బుద్వేలుకు తరలించడం వల్ల పలు మౌలిక వసతులతో కూడిన కొత్త భవనాలు సమకూరుతాయని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే అన్నారు. పార్కింగ్ దగ్గర నుంచి అనేక సమస్యల పరిష్కారానికి దోహదపడేలా వాటి నిర్మాణం ఉంటుందని తెలిపారు. శుక్రవారం హైకోర్టు ప్రాంగణంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీజే ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. అంబేద్కర్, ఇతర పెద్దల కషి ఫలితంగా దేశ ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు లభించాయని అన్నారు. రాజ్యాంగమనేది చట్టం కాదనీ, ప్రభుత్వం, ప్రజలూ పరస్పరం సామాజిక అవగాహనకు కట్టుబడి ఉంటేలా చేసుకున్న ఒక ఒప్పందమని తెలిపారు.
తమ జడ్జీలు న్యాయ నిర్మాణ్ డాక్యుమెంట్‌లో పొందుపర్చిన విధానాలకు అనుగుణంగా కొత్త హైకోర్టు నిర్మాణం ఉంటుందని సీజే ఈ సందర్భంగా తెలిపారు. అందుకోసం ప్రభుత్వం వందెకరాలను కేటాయించడం హర్షణీయమని అన్నారు. గత ఆర్నెల్లలో హైకోర్టులో ఏడున్నర వేల కేసుల్ని పరిష్కరించామని వివరించారు. వరంగల్, హన్మకొండ, కరీంగనగర్, జగిత్యాల జిల్లా కోర్టుల్లో శనివారం నుంచి ఈ-ఫైలింగ్ విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. హైకోర్టులో కూడా ఈ విధానం మొదలైందని వెల్లడించారు. రాష్ట్రంలోని 37 కోర్టుల్లో కూడా ఆ విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు. హైకోర్టులో అన్‌లైన్, ప్రత్యక్ష విధానాల్లో కేసుల విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు.